Pages

పాము కాటు నుండి ప్రాణాలు కాపాడే మొక్కలు - ఆయుర్వేదం


పాము కాటు నుండి ప్రాణాలు కాపాడే మొక్కలు


రాత్రనకా పగలనకా పంట పొలాల్లో తిరిగే రైతన్నలు తరచుగా పాము కాటుకు గురవుతుంటారు.
అలాంటి సందర్భాల్లో సంజీవనిలా పని చేసే కొన్ని ఔషధ మొక్కలు చేరువలోనే ఉన్నప్పటికీ సరైన అవగాహన లేకపోవడంతో వాటిని ఉపయోగించుకోలేక ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు అనేకం. ఈ నేపథ్యంలో పాము కాటు నుండి ప్రాణాలు కాపాడే ఔషధ మొక్కలు, వాటిని ఉపయోగించే విధానం గురించి కృష్ణా జిల్లా జి.కొండూరు మండల వ్యవసాయాధికారి డాక్టర్ జి.రమేష్ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.
ఆ వివరాలు…ప్రపంచంలో మూడు వేల రకాల పాములు ఉన్నప్పటికీ వాటిలో సుమారు 350 రకాలు మాత్రమే విషపూరితమైనవి. వీటిలో కట్లపాము, తాచుపాము, రాచనాగు, రాటిల్‌పాము, సముద్ర సర్పం, రక్తపింజర అతి ప్రమాదకరమైనవి.

వీటిలో తాచుపాము, నాగుపాము, కట్లపాము కాటేస్తే వాటి విషం నేరుగా కేంద్ర నాడీ మండలం, ఊపిరితిత్తులపై పని చేస్తుంది. హృదయ స్పందన ఆగి అప్పటికప్పుడే మరణం సంభవిస్తుంది. రక్తపింజర విషం ఎక్కువగా రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది. రక్తనాళాలు చిట్లి నోటి నుండి రక్తం వస్తుంది. రక్తనాళాల్లో రక్త ప్రసరణ ఆగిపోతుంది. రక్తం గడ్డకట్టడం వల్ల కాటుకు గురైన వ్యక్తి మరణిస్తాడు.
ఎలా గుర్తించాలి?
పాము కాటు శరీరం పైన పడిందా లేక బట్టల పైన పడిందా అన్న విషయాన్ని ముందుగా పరిశీలించాలి. శరీరం పైన కాటు వేస్తే ఎన్ని గాట్లు పడ్డాయో చూడాలి. తాచుపాము, కట్లపాము, రక్తపింజర కాటేస్తే రెండు గాట్లు పడతాయి. అంతకంటే ఎక్కువ గాట్లు కన్పిస్తే అది సాధారణ పాముగా గుర్తించవచ్చు.
ఏం చేయాలి?
కాటు వేసిన శరీర భాగం నుండి ఇతర భాగాలకు రక్తప్రసరణ జరగకుండా పై భాగాన రబ్బరు లేదా తాడు లేదా గుడ్డతో గట్టిగా కట్టాలి. దీనివల్ల విషం త్వరగా గుండెకు చేరకుండా నివారించవచ్చు. దీంతో పాటు పాము కాటుకు గురైన వ్యక్తి నడవడం, పరిగెత్తడం వంటి పనులు చేయకుండా విశ్రాంతి తీసుకునేలా చూడాలి.
ఔషధ మొక్కలు ఇవే
నేటి ఆధునిక యుగంలో ఔషధ మొక్కల్ని వాడడం మొరటు వైద్యంగా కన్పించవచ్చు. కానీ అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా వీటిని ఉపయోగిస్తే రోగిని బతికించుకునే అవకాశాలు మెరుగుపడతాయి. తులసి, గాడిద గడప, పొగాకు, మారేడు, నేల వేము వంటి మొక్కలు ఈ కోవకు చెందినవే.
తులసి మొక్కలు అందరికీ అందుబాటులో ఉండేవే. పాము కరిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే పావు కిలో తులసి ఆకుల్ని బాగా నమిలి మింగాలి. పొలాల్లో కలుపు మొక్కగా పెరిగే గాడిద గడప వేరును మెత్తగా నూరి పాము కరిచిన చోట ఉంచి కట్టు కట్టినా ప్రయోజనం ఉంటుంది.
దీంతో పాటు రెండు చెంచాల వేరు పొడిని అర గ్లాసు మంచి నీటిలో కలిపి తాగించాలి. పచ్చి పొగాకు అందుబాటులో ఉన్నట్లయితే దాని రసం తీసి తాగించాలి. ఎండు పొగాకు ఉంటే దానిని నీటిలో నానబెట్టి సారం దిగేంత వరకూ బాగా నలిపి వడకట్టి తాగించాలి. ఈ విధంగా అరగంటకు ఒకసారి చొప్పున నాలుగైదు సార్లు తాగిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడతారు. పొగాకును మెత్తగా నూరి పాము కాటు వేసిన చోట ముద్దగా కట్టినా మంచి ఫలితం ఉంటుంది.
మారేడు ఆకుల్ని మెత్తగా నూరి రసం తీసి రోగితో తాగిస్తే పాము కాటు నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక అన్ని ప్రాంతాల్లో కన్పించే నేల వేము మొక్కను మెత్తగా నూరి గ్లాసు నీటిలో కలిపి రోగితో తాగించాలి. ఈ విధంగా అరగంటకు ఒకసారి చొప్పున నాలుగైదు సార్లు తాగించాలి. ఔషధ మొక్కల్ని ఉపయోగించిన తర్వాత రోగిని ఆసుపత్రికి తీసికెళ్లి అవసరమైన చికిత్స చేయించాలి.
వంట గదిలో దొరికేవి కూడా…
వంట గదిలో దొరికే పసుపు, మిరియాలు, వెల్లుల్లి, నిమ్మకాయ సైతం పాము కాటుకు సంజీవనిలా పని చేస్తాయి. నాణ్యమైన పసుపు కొమ్ముల్ని పొడి చేసి రెండు చెంచాల పొడిని అర గ్లాసు మంచి నీటిలో కలిపి అరగంటకు ఒకసారి చొప్పున నాలుగైదు సార్లు తాగిస్తే రోగి కోలుకుంటాడు. అలాగే 100 గ్రాములు తెల్ల మిరియాలను పొడి చేసి కషాయం కాచి వడపోసి రెండు మూడు సార్లు తాగించినా ఫలితం ఉంటుంది. 20 వెల్లుల్లి పాయల్ని నూరి పాలలో కలిపి తాగిస్తే ప్రాణాపాయం నుండి రోగి బయటపడతాడు. అదే విధంగా నిమ్మకాయలోని 10-15 గింజల్ని మెత్తగా నూరి నీటిలో కలిపి తాగించవచ్చు.
ఇవి కూడా…
ఈశ్వరి, ఉడుగ, విషముష్టి, పొడపత్రి మొక్కలు కూడా పాము కాటు నుండి ప్రాణాలు కాపాడేవే. అరుదుగా లభించే తీగ జాతి మొక్క ఈశ్వరి వేరును అరగదీసి పాము కరిచిన చోట పూయాలి. ఆ తర్వాత రెండు చెంచాల పొడిని అర గ్లాసు మంచి నీటిలో కలిపి తాగించాలి. ఉడుగ (దీనినే నట్లాడుగ, అంకోలం అని కూడా పిలుస్తారు) మొక్క వేరును మెత్తగా నూరి పొడి చేసి నీటిలో కలిపి తాగించవచ్చు.
దీనిని వాడినప్పుడు వాంతులు అయినప్పటికీ రోగి త్వరగా కోలుకుంటాడు. విషముష్టి లేదా నాగముష్టి వేర్లను పొడి చేసి రోగి చేత తినిపించినా ఫలితం ఉంటుంది. అలాగే పొడపత్రి ఆకు కషాయాన్ని కూడా తాగించవచ్చు.
ఈ విధంగా ఆసుపత్రికి తీసికెళ్లడం సాధ్యం కాని అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా మనకు అందుబాటులో ఉండే ఔషధ మొక్కల్ని ఉపయోగించి రోగి ప్రాణాలు కాపాడవచ్చు. తేలు, మండ్రగబ్బ, తేనెటీగలు, కందిరీగలు వంటివి కుట్టినప్పుడు కూడా ఈ మొక్కల్ని ఉపయోగించి రోగికి ఉపశమనం కలిగించవచ్చు.
ఇలా చేయకూడదు
పాము కరిచిన వెంటనే ప్రాణం పోతుందనే భయంతో పరిగెత్తితే విషం మరింత వేగంగా గుండెకు చేరి ప్రాణాలు త్వరగా పోయే ప్రమాదం ఉంది.
పాము కరిచిన చోట పెద్దగా గాయం చేసి విషాన్ని నోటితో పీల్చి ఉమ్మేయడం కూడా మంచిది కాదు. దీనివల్ల గాయం మరింత పెద్దదై విషం చర్మంలోకి, చుట్టుపక్కల ఉన్న కణాల్లోకి వ్యాపించి త్వరతిగతిన గుండెకు చేరుతుంది.