Pages

ఇంటికి ఎన్ని పిల్లర్స్ ఉండాలి?



ఇంటికి ఎన్ని పిల్లర్స్ ఉండాలి?




vasthuuu
చాలామంది ఈ పిల్లర్‌ల అల్లరిలో మునిగి పోతున్నారు. ఇంటి నిర్మాణానికి ఇంటిని సరిగ్గా మోయడానికి నాలుగు మూలల నాలుగు పిల్లర్లు వచ్చిన తర్వాత ఇంటి పొడవు, వెడల్పులను బట్టి మధ్యలో పిల్లర్స్‌ని కలుపుతూ ఇంటి కప్పును నిలుపుతారు. ఈ విధమైన నిర్మాణ శైలిలో ఫిల్లర్ల సంఖ్య కన్నా ఇంటి స్థిరత్వం ముఖ్యం. అందులో భాగంగానే కొన్ని పెద్ద పిల్లర్‌లు, సన్న పిల్లర్‌లు వాడుతూ ఉంటాం. అన్నీ సన్నయి వాడాలి, అన్నీ లావువి వాడాలి అనడం ఎలాగైతే కరెక్టు కాదో, అందరూ కిలో అన్నమే తినాలనడం ఎలా ఐతే నవ్వు తెప్పిస్తుందో, ఎంత తెలియని తనాన్ని చూపిస్తుందో సంఖ్య కోసం పిల్లర్లను పెంచడం కూడా అంతే. ఎన్ని వేర్లమీద చెట్టు నిలుస్తుంది? దానికి సంఖ్య ఉన్నదా? కాబట్టి, ఇంటి నిర్మాణంలో పిల్లర్ల లెక్క అవసరం లేదు.

దక్షిణ స్థలం పెరిగితే ఏమౌతుంది? :~ రాజయ్య, శారాజీపేట
‘ముక్కు పొడవుగా పెరిగితే ఏమౌతుంది?’ అందం సంగతి పక్కన పెట్టండి. ముందుగా అది నోటికి అడ్డం అవుతుంది. ప్రతి సారి పక్కకు జరిపి భోజనం చేయాలి. ఇది ఎంత ఇబ్బందికరం? ఎందుకు చెబుతున్నానంటే ప్రకృతి నిర్మితమైన శరీరంలో ప్రతి అవయవానికి ఒక కొలమానం ఉంది. చెవి కింది భాగానికి ముక్కు కొసకి ఒక గీత గీస్తే సమంగా ఉంటాయి. చేయి మలిస్తే మోచేతి కొస నుండి బొడ్డు వరకు ఒక సరళరేఖ గీయవచ్చు. ఇలా సృష్ట రచనకు స్పష్టమైన కొలత ఉంది. మనిషే తను సృష్టించే వాటికి కొలతలు పాటించడంలో అవకతవకలు చేస్తూ అవస్థలు పడుతున్నాడు. అంతెందుకు, పెట్రోలు పోయకుండా నడిచే సైకిల్ ఒక చక్రం చిన్నగా పెడితే నడుస్తుందా. ఇవన్నీ కూడా కొలతల నిర్మాణానికి, ఖాళీస్థలానికి ఒక నియమం ఉంది. ఆ కోణంలో ఉత్తరం కన్నా దక్షిణ స్థలం పెరిగినప్పుడు గృహం ధనధ్రువం నుంచి గృహ స్థలంలో రుణధ్రువంలోకి పడిపోతుంది. 

అప్పుడు ఇంటి పీఠం ఒకవైపు వంగిపోతుంది. ఒక బండిమీద బస్తాలు వేసినప్పుడు ఎద్దుల మెడమీద ఎక్కువ బరువు పడకుండా ఉండాలి. అలాగే, బండి వెనుకకు బరువు ఎక్కువ అయితే బండి పోలు లేస్తుంది. కాబట్టి, సమస్థితిలో బర్తిని పెడతారు. బండి లేవడి అయినప్పుడు బండిని తోలె మనిషి బండి తొట్టిలో ముందుకు వెనుకకు జరిగి కూర్చుంటూ బండి బరువును సమతూకంలో పెడతాడు. ఇది అతి సహజమైన అద్భుతమైన గరిమనాభి సూత్రం. ఎంత దూరమైనా ఎద్దులకు బరువు కాకుండా బండి సాగుతుంది. అలాగే, గృహ గరిమనాభి స్థానం దెబ్బ తినకుండా దక్షిణ స్థలాన్ని తెంచేసుకోవాలి. వాస్తు నియమాలతో గృహం రూపొందించుకోవాలి.

కిచెన్‌లో స్టోర్ రూం ఎక్కడ పెట్టాలి? :~ ధర్మమూర్తి, పాలంపేట
కిచెన్ ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకున్న తర్వాత కిచెన్ గది వైశాల్యాన్ని స్టోర్‌ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే పెంచుకోవాలి. స్టోర్ రూమ్‌ను కిచెన్‌కు నైరుతి భాగంలో పెట్టడం శ్రేయస్కరం. లేదా కిచెన్ దక్షిణ భాగం మొత్తం స్టోర్‌ని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే, కిచెన్‌కు ఆగ్నేయంలో యుటిలిటి వచ్చినప్పుడు అందులోకి ద్వారాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మూడు అడుగులు వదిలి మిగతా దక్షిణ నైరుతి భాగాన్ని స్టోర్‌గా మార్చుకోవాలి. అలాగే, పడమర భాగంలో ఉత్తర, దక్షిణాలుగా కిచెన్‌లో స్టోర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. కిచెన్‌లోకి పడమరవైపు నుంచే ద్వారం పెట్టుకోవాల్సి వస్తే పడమర, వాయవ్యంలో ద్వారం ఏర్పాటు చేసుకొని మిగతా పడమర నైరుతిలో స్టోర్ కట్టుకోవాలి.

బీముల కింద పడుకోవచ్చా? : ~ రాజిరెడ్డి, వరంగల్

ఏ వస్తువైన బరువు ఎక్కువగా ఉంటే దాని గురుత్వాకర్షణ శక్తి అంత ఎక్కువగా ఉంటుంది. బీములు ప్రధానంగా ఇంటి పైకప్పును మోస్తూ అధిక బరువుతో ఉంటాయి. వాటికింద పడుకున్నప్పుడు ఆ గురుత్వాకర్షణ ప్రభావానికి మన శరీరంలో అనేక మార్పులే కాక ముఖ్యంగా రాత్రిళ్ళు నిద్ర పట్టకుండా గొంతుపైన ఎవరో కూర్చున్నట్టు, ఊపిరి ఆడనట్టు, తల బరువుతో కలత నిద్రగా ఉంటుంది. నిద్రకు ఎప్పుడైతే దూరం అవుతామో ఉదయం లేచింది మొదలు పనుల ఒత్తిళ్ళలో, మనసు చేసే కార్యకలాపాలతో మానసిక అస్థిరత ఏర్పడి ఇరిటేషన్ తద్వారా కోపం, అలజడికి లోనై చీటికి మాటికి ఇతరులను దూషించే, ద్వేషంచే సందర్భాలు ఎదురౌతుంటాయి. కాబట్టి, పడక గదులలో, హాలులో పడుకోవాల్సి వచ్చినప్పుడు స్లాబు నుండి కిందకు చొచ్చుకొని వచ్చే బీములు లేకుండా చూసుకోవాలి.