దగ్గు
పొడిదగ్గు…. ఆయా సందర్భాల్లో ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టే సమస్య ఇది. సాధారణంగా రుతువులు మారుతున్నప్పుడు అంటే…ఒక సీజన్ నుండి మరో సీజన్‌లోకి అడుగుపెడుతున్నప్పుడు, శరీరంలోని రక్షణ వ్యవస్థ త్వరగా వాతావరణ మార్పులకు అనుగుణంగా సర్దుబాటుగాక, తేలికగా ఇన్‌ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంటుంది. ఇలా సీజన్ మారుతున్న సందర్భంలోనూ జలుబు, జ్వరం, పొడిదగ్గు లాంటి సమస్యలు తెలెత్తుతాయి. ప్రస్తుత శీతాకాలంలో కూడా ఈ సమస్యలు పలువురిని ఇబ్బంది పెడుతుంటాయి.
వైరస్, బాక్టీరియా, ఫంగస్, పరాన్న జీవులవల్ల కలిగిన ఇన్‌ఫెక్షన్ మొదట పొడిదగ్గుతో ప్రారంభమై బాధిస్తుంటుంది. గొంతులో, ముక్కులో ప్రారంభమై ఇన్‌ఫెక్షన్ ఊపిరితిత్తుల వరకూ ప్రాయాణించి, శ్వాసమార్గాల లోపల ఉండే ‘మ్యూకస్’ పొరను దెబ్బ తీస్తాయి. ఫలితంగా పొడిదగ్గు మొదలై సతాయిస్తుంది. సాధారణంగా ఏ దగ్గు అయినా, వారం రోజుల్లో తగ్గాలి. వారం దాటినా పొడి దగ్గు వేధిస్తుంటే మాత్రం, ప్రమాదకరమైన సమస్య ఉన్నదని భావించి జాగ్రత్తపడాలి. దగ్గుతోపాటు జ్వరం, తలనొప్పి, ఆయాసం ఉంటే రక్త పరీక్ష, ఊపిరితిత్తుల ఎక్స్‌రే, శ్వాసకోశాల పరీక్ష చేయించుకోవాలి.
జాగ్రత్తలు
వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి, చల్లటి పదార్థాలు, కూల్‌డ్రింక్స్, స్వీట్స్ తీసుకోకూడదు. చల్లటి గాలికి వెళ్లేముందు మాస్క్ ధరించాలి. ఆల్కహాలు, పొగతాగే అలవాటు ఉన్నవారు వెంటనే మానేయాలి. బ్రీతింగ్, ఎక్సర్‌సైజ్, ప్రాణాయమం, యోగా నిత్యమూ చేయాలి.
చికిత్స
వ్యాధి లక్షణాలను, ఉద్రేక, ఉపశమనాలనూ, వ్యక్తి శరీరతత్వాన్నీ దృష్టిలో ఉంచుకొని, చికిత్స చేస్తే పొడిదగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.
మందులు
ఎకోనైట్: చలిగాలిలో తిరగటంవల్ల పొడిదగ్గు వస్తుంది. దగ్గు భరించలేకుండా ఉండి మంచం మీద వెల్లకిలా పడుకోలేరు. మూడు, నాలుగు, దిండ్లు వేసి ఎత్తుగా పడుకోబెట్టాలి. విపరీతమైన దాహం ఉండి, ఎప్పుడూ చల్లటి పానీయాలు కోరడం ప్రత్యేక లక్షణాలు. ఇలాంటి వారికి ఈ మందు బాగా పనిచేస్తుంది.
ఇపికాక్: రాత్రిళ్లు దగ్గు ఎక్కువగా ఉండి, ఛాతీలో గుర్‌గుర్ శబ్దాలు వస్తుంటాయి. వాంతులు, వికారం ఉంటాయి. వాంతి చేసుకొన్న తర్వాతా, వికారం తగ్గకపోవడం గమనించ దగిన లక్షణం. ఈ రోగికి ముక్కులో జిలగా ఉండి, తుమ్ములెక్కువగా వస్తుంటాయి. ఈ రోగులలో సాధారణంగా దప్పిక ఉండదు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు తప్పక ఆలోచించ దగినది.
హెపార్‌సల్ప్: గొంతులో తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ ఉండి, పుల్ల అడ్డుపడి నట్లుగా అనిపించి, నొప్పిగా ఉంటుంది. ఊపిరితిత్తులలో నిమ్ము ఉండి, పిల్లి కూతలు వస్తాయి. దగ్గుతోపాటుగా జ్వరం ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు తప్పక వాడుకోదగినది.
స్పాంజియా: గొంతు చీరుకుపోతున్న ట్లుండి, ఖంగు ఖంగుమని దగ్గు ఉంటుంది. దగ్గువల్ల గొంతు బొంగురుపోయి, మాట స్పష్టతను కోల్పోతుంది. ఈ లక్షణం ఉన్న రోగులకు, స్పాంజియా మందు ఉపశమనం ఇస్తుంది.ఈ మందులతోపాటు, బ్రయోనియా, ఆర్సినిక్ ఆల్బ్, బెల్లడొనా, రూస్‌టాక్స్, డల్కమెర, పల్సటెల్లా, ఫాస్పరస్, సల్ఫర్ వంటి కొన్ని మందులను లక్షణాలను అనుసరించి, డాక్టర్ సలహా మేరకు వాడి ప్రయోజనం పొందవచ్చు.