కల్లాకపటం లేని చంద్రయ్య (చిట్టి కథ)
చంద్రయ్య వృత్తిరీత్తా వడ్రంగి. సాధారణ జీవితానికి ఇష్టపడే చంద్రయ్య ఒంటరిగా జీవిస్తూ ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టించి పనిచేసేవాడు. సంపాదించిన దానిలో కొద్దిగా ఖర్చుపెట్టి మిగిలిన సొమ్మును ఓ కుండలో దాచుకునేవాడు. ఓరోజు చంద్రయ్య డబ్బులు దాచుకునే కుండ నిండిపోయింది. కొత్తగా డబ్బు దాచుకోవాలంటే అందులో ఉన్న సొమ్మును తీసి ఖర్చు పెట్టాలి, లేదంటే మరో కొత్త కుండ కొనుక్కోవాలి. అయిష్టంగానే చంద్రయ్య కుండలోని సొమ్మంతా ఖర్చుపెట్టి ఓ బంగారు కంకణాన్ని కొనుక్కున్నాడు. కొననైతే కొన్నాడు కానీ ఆ కంకణాన్ని ఏంచేయాలనే చింత చంద్రయ్య మనసులో నాటుకుంది. సరిగ్గా ఆసమయంలో ఓ వ్యాపారి ఒంటెపై అటుగా వెళ్లడాన్ని గ్రహించాడు చంద్రయ్య. చంద్రయ్య ఆ వ్యాపారిని ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నించాడు. ‘రాకుమారికి కావల్సిన బట్టల్ని తీసుకుని రాజకోటకు వెళ్తున్నానని ఆ వ్యాపారి బదులిచ్చాడు. చంద్రయ్య తాను కొత్తగా బంగారు కంకణాన్ని రాజకుమారికి బహుమతిగా ఇవ్వాలను కున్నాడు. వెంటనే తన మనసులోని మాటను వ్యాపారికి చెప్పాడు.
అందుకు ఆ వ్యాపారి సమ్మతించి బంగారు డియాన్ని చంద్రయ్య నుంచి తీసుకుని రాకుమారికి అందించాడు. రాకుమారి ఆ కడియాన్ని, దాని అందాన్ని చూసి సంతోషించి ఆనందంతో పట్టుతో నేసిన ఓ వస్త్రాన్ని ఒంటెపై కప్పి ఆ ఒంటెను చంద్రయ్యకు బహుమతిగా పంపింది. రాకుమారి పంపిన విలువైన బహుమతి చూసి చంద్రయ్య ఆశ్చర్యపోయాడు. కానీ ఖరీదైన పట్టువస్త్రం, ఒంటెను ఏంచేసుకోవాలనే సందేహాన్ని వ్యాపారి వద్ద ఉంచాడు. అప్పుడు ఆ వ్యాపారి నీకు దీని అవసరం లేదనుకుంటూ ఎవరికైనా బహుమతిగా ఇచ్చేయ్ అని సలహా ఇచ్చాడు. చంద్రయ్య వ్యాపారి చెప్పినట్లుగానే రాకుమారి ఇచ్చిన కానుకను పొరుగు రాజ్యంలో ఉండే చక్రవర్తికి బహుమానంగా పంపాడు. చక్రవర్తి చంద్రయ్య పంపిన కానుకను చూసి ఎంతో సంతోషించాడు. ఓ సాధారణ పౌరుడు తనకు బహుమతిగా ఓ ఒంటెను పంపండంతో చక్రవర్తి ఆనందభరితుడయ్యాడు.
సంతోషంతో చక్రవర్తి ఓ గుర్రాన్ని చంద్రయ్యకు కానుకగా పంపాడు. ఈసారి చంద్రయ్య ఆ గుర్రాన్ని రాకుమారికి కానుకగా పంపాడు. ఇలా ప్రతీసారీ తనకు విలువైన కానుకల్ని పంపిస్తున్న చంద్రయ్య ఎవరని రాకుమారి తన ఆంతరంగికుల వద్ద ఆరాతీసింది. ‘తన వద్ద ఉన్న ధనబలాన్ని చూపించడానికి మీకు ఇలా కానుకల్ని పంపిస్తున్నట్లున్నాడని’ వ్యక్తిగత సలహాదారులు సూచించారు. అప్పుడు ఆ రాకుమారి ‘ఇదే నిజమైతే అతడు కలలో కూడా ఊహించని, అమూల్యమైన, అతిఖరీదైన కానుకను చంద్రయ్యకుపంపించండి’ అని సైనికులకు ఆజ్ఞాపించింది. వారు రాకుమారి చెప్పినట్లే బంగారు ఆభరణాలు, వజ్రవైఢుర్యాలు పొదిగిన నగల్ని చంద్రయ్యకు కానుకగా పంపారు.
చంద్రయ్య వాటిని చూసి ఏమాత్రం అసూయ పడకుండా వాటిని చక్రవర్తికి కానుకగా తిరిగి పంపించాడు. చంద్రయ్య పంపిన విలువైన కానుకల్ని చూసి ఆశ్చర్యపోవడం చక్రవర్తి వంతైంది. చక్రవర్తి కూడా చంద్రయ్య గురించి ఆరాతీశాడు. వారూ రాకుమారికి చెప్పిన సమాధానమే చెప్పారు. వెంటనే చక్రవర్తి అత్యంత విలువైన నగలు, సొమ్ముతో కూడిన 20 వాహనాల్ని చంద్రయ్యకు కానుకగా పంపాడు. చంద్రయ్య వాటిని చూసి ఏమాత్రం ప్రలోభ పడలేదు. వెంటనే వాటిని రాకుమారికి కానుకగా పంపాడు. వాటిని చూసిన రాకుమారి ఎలాగైనా చంద్రయ్యను స్వయంగా చూడాలని నిర్ణయించుకుంది. ఓరోజు చెలికత్తెల్ని వెంటపెట్టుకుని మారువేషంలో చంద్రయ్య ఇంటికి వెళ్లింది. సరిగ్గా అప్పుడే చ్రవర్తి కూడా మారువేషంలో అక్కడికి వచ్చాడు. ఇలా రాకుమారి, చక్రవర్తి ఒకరినొకరు తొలిసారి చూసుకుని ప్రేమలో పడ్డారు.
ప్రేమ ముదరిపాకాన పడి త్వరలో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. తమ ప్రేమకు కారణమైన చంద్రయ్యకు వారిద్దరూ లెక్కలేనంత సంపదను సేవకులతో ఇచ్చి పంపారు. కానీ చంద్రయ్య వారి మనసు నొప్పించడం ఇష్టంలేక సేవకుల రాకను గమనించి ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.