Pages

శారీ ఫాల్స్‌ తయారి పరిశ్రమ




మారుతున్న కాలంతో దుస్తుల అలంకరణ ముఖ్య పాత్ర వహిస్తోంది. ఎంత మార్పు వచ్చినప్పటికీ భారతీయ సంప్రదాయంలో భాగమైన చీరలకు ఆదరణ పెరుగుతూనే ఉంది. చీరలకు కూడా ఆధునికత్వాన్ని చేర్చి సమకాలీన మహిళలకు ముఖ్యంగా యువతులను ఆకర్షించే విధంగా చీరలు రూపొందుతున్నాయి. కాటన్‌, సిల్క్‌, పట్టు చీరలకు డిమాండ్‌ పెరుగుతోంది. అలాగే చీరలకు అనుబంధ ఉత్పత్తుల డిమాండ్‌ కూడా పెరుగుతోంది. శారీ ఫాల్‌ అటువంటి అనుబంధ ఉత్పత్తుల్లో ఒకటి.
చీర కింది అంచుకు సమాంతరంగా వెనకవైపు ఒక గుడ్డను కుడతారు. దీనినే ఫాల్‌ అంటారు. చీరకు ఫాల్‌ కుట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
1. చీర కుచ్చిళ్లు స్థిరంగా ఉంటాయి
2. ఫాల్‌ బరువుతో చీర కదలకుండా నిలువుగా ఉంటుంది
3. చీర నేలకు రాసుకున్నప్పటికీ పాడవకుండా ఉంటుంది
గతంలో కేవలం సిల్కు చీరలకు మాత్రమే ఫాల్‌ కుట్టేవారు. ఇప్పుడు అన్ని రకాలకు అంటే సిల్క్‌, కాటన్‌, పట్టు చీరలకు ఫాల్‌ కుట్టడం అలవాటుగా మారింది. అందువల్లనే చీరల సంఖ్యకు సమాంతరంగా ఫాల్స్‌ అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి.
శారీ ఫాల్స్‌కు ఉండాల్సిన మంచి లక్షణాలు
1. గుడ్డ మందంగా బరువు తక్కువగా ఉండాలి
2. ఉతికినపుడు షింక్‌ కాకూడదు. నాణ్యతలేని గుడ్డ వల్ల చీరకు కుట్టిన ఫాల్‌ షింక్‌ అయితే చీర అంచు మొత్తం ముడతలు పడి చూడడానికి అందవిహీనంగా మారుతుంది.
3. రంగు వెలిసి పోకుండా దీర్ఘకాలం మన్నికగా ఉండాలి
శారీ ఫాల్స్‌ రకాలు
శారీ ఫాల్స్‌ గుడ్డ, రంగు, నాణ్యత, సైజును బట్టి అనేక రకాలుగా వర్గీకరించారు.
1. తయారీ గుడ్డ: కాటన్‌, శాటిన్‌, పాలిస్టర్‌
2. రంగులు: వంద రంగులకు పైగా లభ్యమవుతున్నాయి
3. నాణ్యత, ధర: తక్కువ ధరతో తక్కువ నాణ్యత ఉన్న ఎకానమీ ఫాల్స్‌, మధ్యస్థ నాణ్యతతో మధ్యస్థ ధరతో ఉండే ఫాల్స్‌, అధిక నాణ్యత ఉన్న ప్రీమియం ఫాల్స్‌.
4. సైజులు: ఎ. 5 అంగుళాల వెడల్పు2.4 మీటర్ల పొడవు/2.5 మీటర్లు/2.25 మీటర్లు
    బి. 6 అంగుళాల వెడల్పు2.4 మీటర్ల పొడవు2.5 మీటర్లు2.25 మీటర్లు
మహిళలు గృహ పరిశ్రమగా ప్రారంభించడానికి అనుకూలమైన ఉత్పత్తుల్లో ఈ శారీ ఫాల్స్‌ ఒకటి.
అవసరమైన యంత్ర పరికరాలు
1.     స్ట్రయిట్‌ క్లాత్‌ కటింగ్‌ నైఫ్‌
2.     కుట్టు యంత్రాలు
3.     స్టీమ్‌ ఐరనింగ్‌ సిస్టమ్‌
4.     టేబుల్స్‌, ఇతర పరికరాలు

తయారీ విధానం
వివిధ నాణ్యతలతో ఉన్న వివిధ రంగుల కాటన్‌, శాటిన్‌, పోలిస్టర్‌ వస్త్రాన్ని అధిక పరిమాణంలో సేకరించాలి. తరవాత నిర్ణీత పరిమాణం కొలతలో క్లాత్‌ను కత్తిరించి చివరలను కుట్టు మిషన్లపై మడిచి కుట్టాలి. తరవాత మడతలు లేకుండా ఐరన్‌ చేసి కార్డు బోర్డు అట్టకు చుట్టి ప్లాస్టిక్‌ కవర్‌లో ఉంచి అన్నింటిని కార్టన్‌ బాక్సుల్లో భద్ర పరచి సీల్‌ చేసి మార్కెట్‌కు పంపాలి. చీరల హోల్‌సేల్‌ డీలర్లకు, క్లాత్‌ షాపులకు, షోరూంలకు అమ్ముతూ మార్కెట్‌ చేసుకోవాలి.
పరిశ్రమ వ్యయం
ఉత్పత్తి సామర్థ్యం: రోజుకు 1500 శారీ ఫాల్స్‌
పరిశ్రమ వ్యయం: రూ.5 లక్షలు