Pages

ఏ ఆహారం లో ఎన్ని పోషకాలు ఉనాయి తెలుసుకోండి ?



పౌష్టికాహారం ఇవి హెల్దీ ఫాస్ట్‌ ఫుడ్స్‌

ఫాస్ట్‌ ఫుడ్స్‌ ఆరోగ్యానికి మంచిది కాదని మనందరికీ తెలుసు. అయితే ఫాస్ట్‌ఫుడ్స్‌నే చిన్న చిన్న మార్పులతో ఆరోగ్యకరమైన ఆహారంగా తయారుచేసుకుని తింటే శరీరానికి పోషకాలు అందడమే కాదు ఫాస్ట్‌ఫుడ్స్‌ తినాలన్న కోరిక కూడా తీరుతుంది. శరీరానికి సమతులాహారం అందుతుంది. ఫాస్ట్‌ ఫుడ్స్‌ను ఆరోగ్యకరంగా ఎలా చేయొచ్చో ఈ వారం తెలుసుకుందాం...

బర్గర్స్‌: బర్గర్స్‌ లోపల ఉండే టిక్కాలో నూనె ఎక్కువగా ఉంటుంది. పోషకాలు తక్కువగా ఉంటాయి. అందుకని ఆ టిక్కా స్థానంలో బేక్‌ చేసిన ఆకు కూరలు లేదా పెసలు, కందులు వంటి గింజలతో చేసిన పదార్థాన్ని పెట్టి తింటే బర్గర్‌ ఎంతో రుచికరంగా ఉంటుంది. అందులో పోషకపదార్థాలు కూడా పుష్కలంగా ఉంటాయి. 

సాఫ్ట్‌ డ్రింక్స్‌: వీటిల్లో పోషకపదార్థాలుండవు. పైగా ఇవి శరీరంలో ఉన్న కాల్షియంను పీల్చేస్తాయి. అందుకే సాఫ్ట్‌ డ్రింక్స్‌ను ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. సాఫ్ట్‌ డ్రింక్స్‌కు బదులు పళ్ల రసాలు శరీరానికి మంచిది. అలాగే రోజూ పాలు తప్పనిసరిగా తాగాలి. 

ఎనర్జీ డ్రింక్స్‌: ఇవి తాగితే వెంటనే ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. వీటిల్లో బి విటమిన్స్‌ బాగా ఉంటాయి. రోజుకు ఒక ఎనర్జీ డ్రింకు మించి తాగకూడదు. కెఫెన్‌ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కెఫెన్‌ ఉన్న వాటిని ఎక్కువ పర్యాయాలు తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. ఎనర్జీ డ్రింక్సులో కూడా కెఫెన్‌ ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆల్కహాల్‌ను ఎనర్జీ డ్రింకుతో కలిపి తాగకూడదు.

పిజ్జాలు: పిజ్జా పైభాగంలో కూరగాయలు, తక్కువ ఫ్యాట్‌ ఉన్న వెన్న, ఆకుకూరలు టాపింగ్స్‌గా పెట్టి తింటే రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికీ మంచిది. 

చెన్నా చాట్‌: చెన్నా చాట్‌లో పుష్కలంగా పోషకాలుంటాయి. తినడానికి ఎంతో రుచిగా కూడా ఉంటుంది.

పానీ పూరి: వీటిని రెండు ప్లేట్లు మించి తినొద్దు. వీటికి ఉపయోగించే నీరు పరిశుభ్రంగా ఉందో లేదో గమనించుకుని ఆ తర్వాతే వాటిని తినాలి. 

భేల్‌ పూరి: భేల్‌ పూరికి నట్స్‌ను కూడా జోడించి తింటే ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి.

దహీ పూరి: దీనిని ఉల్లిపాయలతో కలిపి తింటే చాలా మంచిది. ఇది ప్రొబయొటిక్‌ స్నాక్‌. యాంటిబయొటిక్‌ చికిత్స తర్వాత దీన్ని పేషంటుకు పెడితే చాలా మంచిది.

సేవ్‌ పూరి: ఇందులో సేవ్‌, పూరి రెండింటినీ నూనెలో బాగా వేగిస్తారు. అలా కాకుండా వీటిని తక్కువ ఫ్రై చేసి అందులో కూరగాయలు, నట్స్‌ వేసుకుని తింటే మంచిది.

చికెన్‌ మంచూరియా: చికెన్‌ మంచూరియాతో పాటు వెజ్‌ సలాడ్‌, మజ్జిగను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. 

గోబి మంచూరియా: దీనితో పాటు చిరుధాన్యాల సలాడ్‌, మజ్జిగ లేదా జ్యూసును తాగితే శరీరానికి ఎంతో మంచిది. 

పావ్‌ భాజి: ఇందులో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని సగం మాత్రమే తినాలి. ఇంకా తినాలనిపిస్తే పచ్చి కూరగాయలు లేదా పళ్లను తినడం మంచిది.

బిర్యానీ: తరచూ దీన్ని తినకూడదు. దీన్ని తినేటప్పుడు కూడా సగం ప్లేటు మాత్రమే తినాలి. బిర్యానీకి రైతా, నిమ్మరసం జోడించి తినాలి.

నూడుల్స్‌: నూడుల్స్‌తోపాటు ఉడకబెట్టిన గుడ్డు లేదా చికెన్‌ లేదా చిరుధాన్యాల ఫుడ్‌ని జోడించి తింటే మంచిది. ఫ్రైడ్‌ రైస్‌ను కూడా ఇదే పద్ధతిలో తీసుకోవాలి. 

ఇడ్లీ: సాంబారు లేదా చెట్నీతో ఇడ్లీని మితంగా తినాలి.

వడ: గ్రీన్‌ చెట్నీతో వడలను మితంగా తినాలి.

పూరి: ఆకుకూరలతో వండిన పప్పుతో పూరిని తింటే ఎంతో ఆరోగ్యం.

పఫ్స్‌: వీటిల్లో ఎక్కువ కాలరీలు ఉంటాయి. ఇవి తింటే రెండు సార్లు భోజనం చేసిన దానితో సమానమని నిపుణులు చెప్తారు. పఫ్‌ తినాలనుకుంటే దానితోపాటు మజ్జిగ తీసుకోవడం మంచిది. 

సమోసా: పఫ్స్‌లో కన్నా సమోసాల్లో కాలరీలు కొద్దిగా తక్కువగానే ఉంటాయి. సమోసాతో పాటు వెజ్‌ సలాడ్‌, మజ్జిగ తీసుకుంటే ఆ పూట భోజనం చేయాల్సిన అవసరం లేదు. 

పేసీ్ట్రస్‌: డార్క్‌ చాక్లెట్‌ మంచిది. ఇది తినడం వల్ల ఎక్స్‌ట్రా కాలరీలు శరీరంలో చేరవు. అన్నం తిన్న తర్వాత పేసీ్ట్ర తినకూడదు. అన్నం మధ్యలో దీన్ని తినాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో కాలరీలు పెరగవు.