తీపి పిండివంటల్లో సువాసనకు వాడే పచ్చ కర్పూరంతో శారీరక రుగ్మతలను తగ్గించుకోవచ్చునంటున్నారు ఆరోగ్య నిపుణులు. |
- పచ్చకర్పూరం నూనెలో నానబెట్టి, ఆ నూనెను పడుకునే ముందు ఛాతీపైన బాగా మర్దన చేస్తే ముక్కు దిబ్బడ, దగ్గు నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. |
- నోటిలో పిప్పిపన్ను నొప్పితో బాధపెడుతుంటే కొద్దిగా పచ్చకర్పూరం పొడిని చిన్న ఉండలా చేసి, ఆ రంధ్రంలో ఉంచితే వెంటనే బాధ తగ్గుతుంది. |
- పచ్చ కర్పూరం నూనెతో మర్దన చేయించుకుంటే కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పుల నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది. |
- ఒక స్పూన్ కర్పూరం పొడిని కొబ్బరి నూనెలో కలుపుకుని ప్రతిరోజూ తలకు మసాజ్ చేసుకుంటే జుట్టు తెల్లబడకుండా వుంటుంది. |
- పచ్చకర్పూరంలో ఉండే త్వరగా చొచ్చుకుపోయి, నొప్పిని హరించే గుణం వలన దీనిని మన మందుల తయారీలో (చర్మ దురదలకు, నొప్పులకు, దగ్గుకు, గొంతు నొప్పికి, తలను, కళ్ళను చల్లపరిచే నూనెలలో) వాడుతున్నారు. అంతేకాకుండా మన టూత్ పేస్ట్ తయారీలో కూడా ఇది ముఖ్యపదార్థంగా వుంటుంది. |
- పల్చటి తెల్లని బట్టలో కొంచెం బియ్యం, కొంచెం పచ్చకర్పూరం కలిపి మూటకట్టి వాసన పీల్చితే ముక్కు దిబ్బడ, జలుబు తగ్గుతుంది. |
- చిటికెడు ఉప్పు, చిటికెడు పచ్చకర్పూరం కలిపి పళ్ళు, చిగుళ్ళు రుద్దితే చిగుళ్ళ వాపు, పంటి నొప్పులు తగ్గుతాయి. పళ్ళు తెల్లగా మెరుస్తాయి. |
అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామీ వారి గడ్డం క్రింద కుడా పచ్చ కర్పూరం పెడతారు ఎందుకంటే?
స్వామికి ప్రతిరోజూ గడ్డం దిగువన ఒకటిన్నర తులాల మేలిరకం పచ్చకర్పూరం ముద్దను అద్దాలి! దీని కథ ఏమంటే, రామానుజాచార్యులు వారి కోరిక మేర తిరుమలపై నివాసం ఉంటూ, పూలతోట పెంచుతూ, నిత్యం స్వామి వారికి నవనవలాడే నాజూకు పూలు, పూల దండలను శ్రద్ధతో సమర్పించే ఆప్తశిష్యుడైన అనంతుడు ఒకనాటి ఉదయం సతీసమేతంగా పూలతోటలో నీళ్ళు పోస్తుంటాడు. దంపతుల భక్తిభావానికి, నిస్వార్థ సేవకు మురిసిపోయిన శ్రీనివాసుడు బాల వటువురూపంలో వచ్చి వారికి సహాయ పడబోగా – ఆ అల్లరి పిల్లవాడు తమ పనులకు అడ్డు తగులుతున్నాడని భ్రమించి ఆగ్రహించిన అనంతుడు అతడిపై గడ్డిపార విసురుతాడు. ఆ గడ్డపార కొన ఆ బాలుని గడ్డం క్రిందుగా రాచుకుంటూ వెళుతుంది. వెంటనే ఆ బాలుడు ఆలయంవైపు పరుగిడుతూ అంతర్థానమవుతాడు! |
తీరా, అనంతుడు పూలు తీసుకుని సాయంకాలం గర్భగుడికి వెళ్ళి చూడగా స్వామివారి గడ్డం దిగువన గాయం కనిపిస్తుంది. అతడికి వెంటనే ఉదయం జరిగిన సంఘటన గుర్తుకి వస్తుంది. పట్టరాని పశ్చాత్తాపంతో, ప్రేమాభిమానంతో అతడు తక్షణమే అక్కడ ఉన్న పచ్చకర్పూరం ముద్ద తీసుకుని గాయంపై గట్టిగా అడుముతాడు. దాంతో క్షణాలలో చిత్రంగా గాయం మాయమై – అక్కడ గుర్తుగా మచ్చ మాత్రం మిగిలిపోతుంది. అదిగో…అప్పటినుంచి స్వామివారి గడ్డంపై ఈ పచ్చకర్పూరం అద్దడమనే ఆచారం ఏర్పడింది. ఈ మచ్చ మనకు విగ్రహంలో అగుపించడం ఒక మహావింత! |