ఎలాంటి పాపాలు చేస్తే ఎలాంటి దోషాలు
వస్తాయి?
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చెయ్యటం, దూరంగా వుంచటం, నమ్మినవారిని, భార్యా పిల్లలని నట్టేట ముంచటం, వారిని వదిలేసి మనదారి మనం చూసుకోవటం పాపం. పురుషుడుగానీ, స్త్రీగానీ సంతానాన్ని వదిలేసి దూర దేశాలకు వెళ్ళినా, రెండవ పెళ్ళి చేసుకున్నా పాపం. మనం తింటూ ఎదుటివారికి పెట్టకపోవటం, ఇంటిముందున్న కుక్కకి, పక్షికి ఆహారం పెట్టకపోవటం, ఎండలో వచ్చినవారికి మంచినీరివ్వకపోవటం కూడా దోషమే. అతిధులకు ఏ వేళకి వచ్చినవారికి ఆ విధంగా తగు మర్యాద చెయ్యాలి. అలాగే మన సహాయం కోరి వచ్చినవారికి సహాయం చేయగలిగి చేయకపోవటం మంచిదికాదు. తప్పు తెలిసీ సరిచెయ్యకపోవటంకూడా దోషమే. మన పూర్వీకులు క్రమశిక్షణకోసం, సక్రమమైన జీవన విధానానికి ఏ వేళకి ఏమి చెయ్యాలో నియమాలు, ఎన్నో పరుధులు ఏర్పాటుచేసి, ఎక్కడెక్కడ ఎలా నడుచుకోవాలో కొన్ని విధులు ఏర్పరచారు. వాటిని నెరవేరిస్తే మనిషి సంతోషకరమైన జీవనం గడపగలడు. ప్రపంచంలో ప్రతి ప్రాణీ దైవ స్వరూపమే. మనిషి ఆ సద్భావంతో సత్ఫ్రవర్తన కలిగి వుండాలి. లేకపోతే మనం ఇప్పుడు ఏ అవయవంతో ఏ దోషం చేస్తామో మరు జన్మలో ఆ అవయవాలకి అలాంటి దోషాలుకలిగి బాధపడాల్సివస్తుంది. పాపం అంటే ఎక్కడో మనకు కనబడకుండా వుండేదికాదు. మన నిత్యజీవితంలో మన ఎదురుగా కనబడే అడ్డంకులు, రోగాలు, చికాకులే. మనం ప్రశాంతమైన జీవితం గడపాలంటే మనమీద ఆధారపడినవారికి, ప్రకృతికి మనం ఎలాంటి హానీ చెయ్యకుండా జీవించాలి.