పొత్తి కడుపు నొప్పి

పొత్తి కడుపు నొప్పి


వివిధ వృత్తుల్లో పనిచేసే మహిళలు, గృహిణులు, వివిధ యంత్ర పరికరాలపై పనిచేసే స్ర్తిలు, రసాయనాల ఫ్యాక్టరీలలో పనిచేసేవారు, ఆహార పదార్థాలలో అధికంగా కారం మసాలాలు సేవించేవారు, ఎండలో పనిచేసే వివిధ వృత్తులవారు, మూత్ర విసర్జనకి వీలుకాని సందర్భం తోడైనపుడు, ఇతరేతర కారణాలవల్ల ఇన్‌ఫెక్షన్ సోకినపుడు మూత్రంలో మంట, మూత్ర విసర్జనాంతరం పొత్తికడుపులో నొప్పి, మూత్రదోహం, జ్వరం, మూత్ర విసర్జనపుడు దుర్వాసన, నడుము నొప్పి, వాంతులు మొదలగు లక్షణాలు ఏర్పడతాయి.

 మూత్రనాళములు, మూత్రాశయము మూత్రద్వారములలో ఎక్కడైనా ఇన్‌ఫెక్షన్ కలిగినపుడు, మూత్రంలో ఆలీకరణ స్థితి ఎక్కువైనపుడు పై లక్షణాలు కలిగే అవకాశం ఉంటుంది. అయితే అందరిలోను ఈ లక్షణాలు ఒకే విధంగా వుండవలసిన అవసరం లేదు. సాధారణంగా చిన్న పిల్లల్లో మూత్ర వహా సంస్థానంలో వచ్చే ఇన్‌ఫెక్షనువల్ల కడుపులో నొప్పి, జ్వరం, వాంతులు, జననాంగాలను చేతితో నలుపుతూ ఉండటం- వంటి లక్షణాలు వుంటాయి.
అదేవిధంగా 20 సం. వయస్సు నుండి 50 సం. వయస్సు వారిలో కిడ్నీలో రాళ్లు, గర్భం ధరించినప్పుడు, మూత్రద్వారంలో ఒరిపిడి, ఎస్.టి.డి.లు, మందులకు సైడ్ ఎఫెక్టుగా, యోని ద్వారం వద్ద వాపు మొదలైన కారణాలవలన మూత్రమార్గంలో శోధ, మూత్ర విసర్జన కాలంలో మంట వచ్చే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా ఆడవాళ్ళలో మూత్ర ద్వారం తక్కువ పొడవు వున్నందున బ్యాక్టీరియా, ఫంగై వంటి క్రిములు చాలా తేలికగా మూత్రాశయానికి చేరి మూత్రకృచ్ఛాన్ని కలిగిస్తాయి. వీరిలో పదే పదే మంట, నొప్పితో కూడి మూత్రవిసర్జన చేయవలసి రావడం, మూత్రం రక్తంతోకూడి రావడం, చలితోకూడిన జ్వరం, దుర్వాసన, యోని ద్వారం వద్ద మంట, పొత్తికడుపులో నొప్పి వంటి లక్షణాలు కలుగుతాయి.
యాభై సం. వయస్సు పైబడిన స్ర్తిలలో మూత్రకృచ్ఛ లక్షణాలు తక్కువగా కనబడతాయి మూత్రాశయంలో కంతులు, మూత్రనాళంలోకి అవసరమై కాథెటిర్ వేసిన తరువత, మూత్రవహ సంస్థానంలో శస్త్ర చికిత్స మొదలైన కారణాల మూలంగా మూత్రకృచ్ఛత ఏర్పడుతుంది. మధుమేహ వ్యాధి పీడితులను ముఖ్యంగా ఈ వ్యాధి ఎక్కువగా బాధిస్తుంది.
ఆయుర్వేద సంహితా గ్రంథాలలో మూత్రకృచ్ఛ వ్యాధి 8 రకాలుగా పేర్కొనబడినది- అతిగా తీక్షణమైన ఆహారం అనగా కారం, పులుపు, మసాలాలు కలిగిన ఆహారం, నీళ్ళు తీసుకోవడం, మాంసాహారం అధికంగా సేవించుట మూలంగా వాత పిత్త దోషాలు ప్రకృపితమై మూత్ర కృచ్ఛ వ్యాధి వస్తుందని పేర్కొనబడింది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మూత్రంలో మంట, వేడి వున్నపుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ఆచరించవలసినది ఎక్కువగా మంచినీళ్ళు త్రాగటం. ఎక్కువగా మంట, నొప్పి కలిగివుంటే పళ్ళరసాలు, బార్లీ నీళ్ళు, నిమ్మరసం, కొబ్బరినీళ్ళు, రాగి జావ మొదలైనవి ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ ‘సి’ ఎక్కువగా వుండే ఆహార పదార్థాలను విరివిగా తీసుకుంటే మూత్రంలో ఆలీకరణ శాతం తగ్గుతుంది. అధికంగా కారం, మసాలాలు కలిగిన ఆహారం తినటం తగ్గించుకోవాలి.
మూత్ర వేగాన్ని ఆపుకోకుండా వీలు వున్న సమయంలో పరిశుభ్రమైన ప్రదేశంలో మూత్ర విసర్జన చేయటం అవసరం. విసర్జన జరిగిన తరువాత మూత్రద్వారాన్ని శుభ్రపరచుకోవాలి. ఈ చర్య ద్వారా చాలా భాగం మూత్రకృచ్ఛ వ్యాధిని నిరోధించగలం. శే్వతప్రదరం వంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తపడాలి.
పిత్తప్రకృతి వ్యక్తులలో ఎప్పుడు దాహం, అరిచేతులు, అరికాళ్ళు వేడిగా వుండటం, ఎక్కువగా చెమట పట్టడం, కళ్ళు మంటలు, తరచుగా వేడి చేసిందనే భావన, ఇటువంటివారిలో మూత్రకృచ్ఛత సమస్య అధికంగా వుంటుంది. వీరికి శీతాకాలంలో కూడా ఈ బాధ కలిగి వుండటం అనేది సాధారణం. అలాంటప్పుడు వ్యక్తియొక్క జీవన శైలిలో మార్పు చేసుకోవలసిన అవసరం వుంది.
ఒక్కొక్కసారి మూత్రం మంటతో కూడి ఎరుపుగా వచ్చినపుడు కిడ్నీలలో రాళ్ళు వుండే అవకాశం వుంటుంది. అటువంటి సమయంలో లేబరేటరీ పరీక్షలు చేయించుకొని వైద్యుల సలహా మేరకు మందులు వాడుకోవాలి.
మూత్రకృచ్ఛ వ్యాధిలో చందనం, ఉశీర, గోక్షుర, పునర్నవ, శిలాజిత్తు, హపుష, ఆమలకీ తులసి మొదలగు ఓషధులు మంచి ఫలితాలను ఇస్తాయి. చంద్రప్రభావటి, చందనాసనం, ఉశీరాసనం, గోక్షురాది గుగ్గులు మొదలగు ఔషధాలు వైద్య సలహా మేరకు వాడుకోవాల్సి వుంటుంది.
ప్రముఖ కంపెనీలచే తయారు చేయబడిన నీరి మాత్రలు, ఉశీరాల్క, రీవాల్కా మొదలైన ఔషధాలు ఈ వ్యాధిలో ఉపయోగపడతాయి. చాలాకాలంగా ఈ వ్యాధితో బాధపడేవారు కర్పుర శిలాజిత్తును పటికబెల్లం (కలకండ)తో కలిపి మండలం (40) రోజులు సేవిస్తే పూర్తి నివారణ అవుతుంది.