ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి విజయవంతం కాగలమన్న నమ్మకం మీకుందా?
ఎలా ముందడుగు వేయాలి అన్న విషయంలో సరైన అవగాహన లేక నిర్ణయం తీసుకోవడం ఆలస్యమవుతోందా...
మీ కోసం కొన్ని టిప్స్...
సాధ్యమైనంత ఎక్కువ డబ్బు కూడబెట్టండి:
చాలా మంది పొదుపు చేసిన డబ్బును వెచ్చించకుండా వ్యాపారాన్ని కేవలం రుణంపై ఆధారపడి ప్రారంభించేందుకు ముందుకు వస్తారు.
ఆలోచన మంచిదైతే స్నేహితులు, బ్యాంకులు రుణాలిచ్చేందుకు ముందుకు వస్తారు. అయినప్పటికీ సాధ్యమైనంత ఎక్కువ డబ్బు
కూడబెట్టి ఆ డబ్బనే ముందుగా వినియోగిస్తే మంచిది.
ఒక వేళ విఫలమైన రుణం బాధ, అందుకు చెల్లించాల్సిన వడ్డీ బాధా ఉండదు. తక్కువ మొత్తమే అయినప్పటికీ క్రెడిట్ కార్డును ఎంతమాత్రం వాడవద్దు.
కనీసం రెండేళ్ళ పాటు ఇంటి ఖర్చుల నుంచి ఎన్నింటినో ఆదా చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బు సమకూర్చుకోవచ్చు.
నెమ్మదిగా అడుగులు వేయండి:
ప్రారంభ దశలోనే భారీ స్థాయిలో వ్యాపారం సాగాలని కోరుకోవద్దు. తొలుత ఒక వ్యక్తిగానే ప్రారంభమై నెమ్మదిగా అడుగులు వేయండి.
పూర్తిగా బిజీ అయ్యేదాకా రెండో వ్యక్తి సహాయం ఆశించవద్దు. ఎవరికీ ఉపయోగ పడని స్థలంలో, ఇంటి ఆవరణలో ఇలా చిన్న వ్యాపారం ఆరంభించేందుకు వెతికితే ఎన్నో స్థలాలు దొరుకుతాయి.
ప్రారంభంలో అద్దె కార్యాలయం ఉండకపోవడమే మేలు.
తప్పదంటే సాధ్యమైనంత తక్కువ రెంట్‌కు చూసుకోవడం ఉత్తమం.
వ్యక్తిగత ఆస్తులను కాపాడుకోండి:
వ్యాపారం ప్రారంభమైన తరువాత ఎటువంటి అవసరాలు, పెట్టుబడులకైనా వ్యక్తిగత ఆస్తులను విక్రయించడం చేయవద్దు.
అలా చేయాల్సి వచ్చిందంటే ముందు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ లాభాన్ని అందించకుండా ఎక్కడో చిక్కుకుపోయినట్టు. అటువంటి స్థితిలో వ్యక్తిగత ఆస్తులకు రెక్కలొస్తే...
పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధపడండి:
ప్రస్తుత పోటీ మార్కెట్లో ఎంత వినూత్న ఉత్పత్తి అయినా సరే వెంటనే పోటీని ఎదుర్కోవాల్సి వుంటుంది. ఎంచుకున్న రంగంలో పోటీదారులు ఎవరు, వారు ఎలాంటి ఉత్పత్తులను ఏ రేంజ్‌లో ఏ ధరలో మార్కెట్లో ఉంచుతున్నారు అన్నది తెలిసి వుండాల్సిన అవసరం ఎంతో ఉంది.
వారితో పోటీ పడుతూ, అంతకు మించిన నాణ్యతా ప్రమాణాలు పాటించేందుకు ప్రయత్నించండి. వినియోగదారుల్లో ఒకసారి నమ్మకం ఏర్పడితే అది వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా మారుస్తుందన్న విషయాన్ని మరువద్దు.
అమ్మకానికి నమ్మకమే పునాది. ఎట్టి పరిస్థితుల్లోనూ కస్టమర్ల జాబితా, మాన్యుఫాక్చరింగ్ టెక్నిక్స్, సర్వే పద్ధతులు, వ్యూహాలు ఇతరులకు తెలియనివ్వద్దు. వ్యాపారాన్ని నాశనం చేసే చెడు వార్తలు వెలువడినప్పుడు తక్షణమే నష్ట నివారణకు ఉపక్రమించాల్సి వుంటుంది.
కార్యాలయాలను మార్చడం, కొత్త ఉత్పత్తులు లేదా సేవలు ప్రారంభించడం, మరో మార్గంలో మార్కెటింగ్‌కు ఉపక్రమించడం వంటివి వ్యాపారం నుంచి దూరం కాకుండా అడ్డుకోగలుగుతాయి.
ఏ సంస్థ లేదా వ్యక్తితో కుదుర్చుకున్న ఒప్పందాన్నైనా లిఖితపూర్వకంగా ఉండేలా జాగ్రత్త పడాలి. పోటీ ప్రపంచంలో అదే సంస్థ మరో కంపెనీతో జతకడితే మొదటికే ప్రమాదమన్న సంగతి మర్చిపోవద్దు.
ఈ ఒప్పందాలను సంవత్సరం కన్నా ఎక్కువ కాలం సాగేలా చూసుకోవాలి. కాపీరైట్స్, ఓనర్‌షిప్ వంటి విషయాల్లో ఎంత దగ్గరివారైనా ఎవరి జాగ్రత్తలో వారుంటేనే మంచిది.
నమ్మకస్తుల అవసరం ఎంతైనా ఉంది:
వ్యాపార లక్ష్యాలను అందుకోవాలంటే కేవలం నైపుణ్యమున్న ఉద్యోగుల వల్లే సాధ్యం కాదు. ఇదే సమయంలో నిజంగా నిబద్ధతతో సంస్థ ఉన్నతికి కృషి చేయగల ఉద్యోగుల అవసరం ఎంతో ఉంటుంది.
అందుకోసం నమ్మకస్తులను ఎంపిక చేసుకుని ముఖ్యమైన విభాగాలు, పనులు అప్పగించాల్సి వుంటుంది. వీరికే నైపుణ్యం కూడా తోడైతే ఒక్కోసారి ఇద్దరు లేదా ముగ్గురు సాధారణ ఉద్యోగులతో వీరు సమానమవుతారన్న విషయం మరువకండి.
ఉద్యోగులు పూర్తి సామర్థ్యంతో పనిచేయాలంటే వారికి కనీస సదుపాయాల కల్పన ఎంతో ముఖ్యం. మంచి పనివాతావరణం, తగిన వేతనం చెల్లిస్తూ ఉంటే వారి బయటి ప్రపంచపు ఒత్తిళ్ళు ఆఫీసు పనులకు, వ్యాపారానికి అడ్డు కలిగించవు.
ఉద్యోగుల చట్టబద్ధతపై దృష్టి నిలపండి:
ఓక ఇండిపెండెంట్ కాంట్రాక్టరుగా ఉద్యోగులను తీసుకునే పక్షంలో వారందరి చట్టబద్దతకూ మీరు బాధ్యత వహించాల్సి వుంటుంది. లేకుంటే ఐఆర్‌ఎస్ విధించే పెనాల్టిల భారం పడుతుంది.
ఒక పనివాడు కూడా ఉద్యోగే అన్నది ఐఆర్‌ఎస్ తదితర ఏజన్సీల అభిప్రాయం. మూడు నిబంధనలపై వర్కర్ల చట్టబద్దత ఆధారపడి వుంటుంది.
అవి పూర్తిస్థాయిలో కార్మికుడు మీ దగ్గర పనిచేస్తుంటే, అదే కార్మికుడు మరెక్కడా పని చేయకుంటే, మీ వ్యాపార కార్యకలాపాల్లో అంతర్గత పనుల్లో కార్మికుడు సేవలందిస్తుంటే ఆ కార్మికుడికి చట్టపరమైన అన్ని హక్కులూ ఉన్నట్టే.
భవిష్యత్‌లో ఉద్యోగుల నుంచి ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలూ ఉన్నాయి. ఉద్యోగులతో కుదుర్చుకున్న సర్వీస్ కాంట్రాక్టు లేదా ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ అగ్రిమెంట్‌పై నియమ నిబంధనలు విఫులంగా ఉండేలా చూసుకోండి.
ఉద్యోగులను ఎంపిక చేసుకునే ముందే వారిని అన్ని విధాలా పరీక్షిస్తాం కాబట్టి వారు నైపుణ్యవంతులే అయివుంటారు. ఆపై భవిష్యత్‌లో ఏదైనా కారణాలతో వారిని తొలగించే హక్కు మీకు ఉండాలి.
అందుకు సహేతుకమైన కారణాలు కూడా ఉండాలనుకోండి. ఒకవేళ ఉద్యోగులే వారంతట వారు రాజీనామా చేయాలని భావిస్తే కనీసం రెండు నెలల నోటీసు ఇవ్వాలనే నిబంధనా తప్పనిసరిగా ఉంచండి.
ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను శాశ్వతం చేస్తామనే వాగ్దానం చేస్తే ప్రయోజనాలకన్నా ఇబ్బందులే అధికంగా వస్తాయి. శాశ్వత ఉద్యోగులైతే ఎన్నో కారణాలుంటే తప్ప విధుల నుంచి తొలగించే వీలుండదని గుర్తుంచుకోవాలి.
సమయానుకూలంగా పన్ను చెల్లింపులు:
మీరు చెల్లించాల్సిన బిల్లులు, ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులను సకాలంలో చెల్లించే ఏర్పాట్లు చేసుకోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రా మెటీరియల్ బిల్లు చెల్లింపు రోజులు ఆలస్యమైనా ఆ నష్టం భారీగానే ఉంటుంది.
ఉద్యోగుల నుంచి పిఎఫ్, ఇఎస్‌ఐ వంటివి తక్షణం చెల్లిస్తూ ఉండండి. ఒకవేళ అలా జరుగక, ఏదైనా ప్రమాదం వటిల్లితే చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అప్పుడు ఏర్పడే సమస్యలు తప్పించుకోవాలంటే ముందు జాగ్రత్త అవసరం. ఈ సూచనలన్నీ పాటిస్తూ, వ్యూహాత్మకంగా ముందుకు వెడితే వ్యాపారంలో విజయం సాధించవచ్చు.
సరైన వ్యాపారం ఎంచుకోవడమెలా..
-మీ కాళ్లమీద మీరు నిలబడాలనుకుంటున్నారా?
-మీరు ఉపాధి పొందడమే కాకుండా పదిమందికి ఉపాధి కల్పించాలనుకొంటున్నారా?
-అసలు పరిశ్రమలు పెట్టాలంటే ఏం చేయాలి?
-పరిశ్రమలు ఎన్ని రకాలు? రుణం పొందడం ఎలా?
-పరిశ్రమను ప్రారంభించాలంటే.. ఏం చేయాలి?
-అన్న విషయాలపై ప్రత్యేకం....
మనలో చాలామందికి స్వయంఉపాధి మార్గా న్ని ఎంచుకోవాలని, జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ఉంటుంది. వేలాదిగా ఉన్న వస్తుత్పత్తి, వ్యాపార, సేవా రంగ అవకాశాల్లో ఏదో ఒకటి లాభదాయకమైనదని కచ్చితంగా చెప్పలేం..! ఎందుకంటే ఒక చోట ఎంతో లాభసాటిగా నడుస్తున్న వ్యాపారం మరొక చోట భారీ నష్టాలను పొందుతూ ఉండవచ్చు. అందువల్ల స్వయం ఉపాధి మార్గాన్ని మన స్థాయిని బట్టి మనకు సరిపడే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ లేదా వ్యాపారాన్ని ఎంచుకుని ప్రారంభించవచ్చు.
స్వయం ఉపాధి రంగంలో విజయం సాధించడానికి కచ్చితమైన ఫార్ములా అంటూ ఏమీ లేదు.
విషయ పరిజ్ఞానం కలిగి ఉండటం, నిరంతర అధ్యయనం, ప్రణాళిక, సంకల్పం, పట్టుదలతో కృషి చేస్తే విజయం సాధించవచ్చు. తద్వారా మరికొంత మందికి ఉపాధి కల్పించడం వల్ల సమాజం త్వరగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. స్వయం ఉపాధిలోకి ప్రవేశించే ముందు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (Micro, Small and Medium Enterprises (MSME), భారీ పరిశ్రమలు అంటే ఎంటో తెలుసుకుందాం..
-పరిశ్రమలను మూడు విభాగాలుగా చెప్పుకోవచ్చు. అవి..
మొదటి విభాగం
1. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు: ఏదైనా ఒక సంస్థ నిర్ణీత ప్రమాణాల ప్రకారం వస్తువులను ఉత్పత్తి చేయడంలో నిమగ్నమై ఉంటే ఆ సంస్థను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (Micro, Small and Medium Enterprises (MSME)గా పరిగణిస్తారు. దీనిని ఆ సంస్థకు చెందిన ప్లాంట్, యంత్రాలు, యంత్ర సామాగ్రి, ఇతర చరాస్తుల విలువనుబట్టి కింది విధంగా వర్గీకరించవచ్చు. కానీ, ఇందులో భూమి, భవనం విలును లెక్కించకూడదు.
i. సూక్ష్మ పరిశ్రమలు (Micro Enterprise): రూ. 25 లక్షలు, అంతకంటే తక్కువ విలువ ఉన్న వాటిని సూక్ష్మ పరిశ్రమలు అంటారు.
ii. చిన్న పరిశ్రమలు (Small Enterprise): రూ. 25 లక్షలు నుంచి రూ. 5 కోట్లు, అంతకంటే ఎక్కువ విలువ ఉన్న వాటిని చిన్న పరిశ్రమలుగా పరిగణిస్తారు.
iii. మధ్య తరహా పరిశ్రమలు (Medium Enterprise): రూ. 5 కోట్లు నుంచి రూ. 10 కోట్లు విలువ కలిగిన పరిశ్రమలు.
రెండో విభాగం:
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు: ఏదైనా ఒక సంస్థ నిర్ణీత ప్రమాణాల ప్రకారం వస్తువులను సరఫరా చేయడం గానీ సేవలు అందించే రంగంలో (హోటల్, హాస్పిటల్, విద్య, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల వంటివి) నిమగ్నమై ఉంటే దానిని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థగా పరిగణిస్తారు. అయితే సేవలు అందించే రంగంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలను కింది విధంగా వర్గీకరించవచ్చు..
i. సూక్ష్మ సంస్థ (Micro Enterprise): రూ. 10 లక్షలు లేదా అంత కంటే తక్కువ విలువ ఉంటే దానిని సూక్ష్మ సంస్థ అంటారు.
ii. చిన్న సంస్థలు (Small Enterprise): రూ. 10 లక్షలు నుంచి రూ. 2 కోట్లు, అంతకంటే తక్కువ విలువ ఉన్నవాటిని చిన్న సంస్థలుగా పరిగణిస్తారు.
iii. మధ్య తరహా సంస్థ (Medium Enterprise): దీని విలువ రూ. 2 కోట్లు నుంచి రూ. 5 కోట్లు.
మూడో విభాగం:
భారీ పరిశ్రమలు: మిషనరీ పై రూ. 10 కోట్లు అంతకన్నా ఎక్కువ పెట్టుబడి ఉంటే ఆ పరిశ్రమను భారీ పరిశ్రమ అనవచ్చు.
పరిశ్రమ ప్రారంభించడానికి..
స్వయం ఉపాధిమార్గాన్ని ఎంచుకునే వ్యక్తి వ్యాపారం లేదా పరిశ్రమ ప్రారంభించే ముందు వాటికి సంబంధించిన విషయ పరిజ్ఞానం ఉండటం చాలా అవసరం. ఏ రంగాన్ని ఎంచుకుంటున్నారో దానికి సంబంధించిన పూర్తి మార్కెట్ సర్వే అంటే ఆ వస్తువుకు ప్రస్తుతం ఉన్న డిమాండ్, భవిష్యత్ డిమాండ్, సైప్లె గురించిన పూర్తి సమాచారం సిద్ధం చేసుకుని ఉండాలి. అలాగే ఆ వస్తువుకు సంబంధించిన తయారీ విధానం, ముడి సరుకు దొరికే ప్రదేశాలు, తయారు చేయడానికి కావలసిన మిషనరీ, పెట్టుబడి, ఉత్పత్తి చేసిన వస్తువు ధరను నిర్ణయించే పద్ధతి, మార్కెటింగ్ సంబంధిత విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఈ సమాచారాన్ని సేకరించడానికి ప్రభుత్వ రంగంలో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్, ప్రైవేట్ రంగంలోని MIND CAPITAL వాళ్లు సహాయం చేస్తారు.
ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ:
పరిశ్రమ స్థాపనలో ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒక ముఖ్యమైన డాక్యుమెంట్, అందులో పరిశ్రమకు సంబంధించిన అన్ని ముఖ్య విషయాలు ఉంటాయి. అవి..
-పరిశ్రమకు కావాల్సిన భూమి, బిల్డింగ్ లేదా షెడ్ వివరాలు
-ఉత్పత్తి వివరాలు
-పరిశ్రమ సాలీనా చేయబోయే ఉత్పత్తి వివరాలు
-తయారీ విధానం
-మిషనరీ వివరాలు - వాటి ధర, సాంకేతిక వివరాలు
-ముడి సరుకు వివరాలు
-పరిశ్రమకు కావలసిన విద్యుత్తు, నీరు వివరాలు
-కార్మికులు, సిబ్బంధి వివరాలు
-మార్కెటింగ్ వివరాలు
-పరిశ్రమకు కావలసిన పెట్టుబడి, ఉత్పత్తి వ్యయం
-ఫైనాన్షియల్ అనాలసిస్, ఎకనామిక్ వయబిలిటీ
ప్రాజెక్ట్ రిపోర్టును కొన్ని నియమాలకు లోబడి తయారుచేయాలి. అయితే నిపుణులతో తయారు చేయిస్తే పరిశ్రమకు సంబంధించిన అన్ని ముఖ్య విషయాలు అందులో వస్తాయి.
పెట్టుబడి
పరిశ్రమకు కావలసిన మొత్తం పెట్టుబడిలో దానిని స్థాపించాలనుకునే వారు వారి కేటగిరీని బట్టి 10 నుంచి 25 శాతం పెట్టుబడి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. మిగతా పెట్టుబడిని ఏదైనా నేషనలైజ్‌డ్ బ్యాంకు, స్మాల్ ఇండస్ట్రీస్ డెవెలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రీజనల్ రూరల్ బ్యాంకులు, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా సమకూర్చుకోవచ్చు.
బ్యాంక్ లోన్ పొందాలంటే..
-నిర్దేశిత అర్హత ప్రమాణాలు
-పరిశ్రమకు సంబంధించిన ఆర్థిక, సాంకేతిక అంశాలు
-ప్రమోటర్‌కు చెందిన మూలధనం, ఆర్థికస్థితి, ఆర్థిక క్రమశిక్షణ
-కొల్లెటారల్ సెక్యూరిటీ లేదా హామి
ప్రాజెక్ట్ లోన్‌ను రెండు భాగాలుగా విభజిస్తారు
-ప్రాజెక్ట్‌లో భాగమైన భూమి, భవనం, ప్లాంట్, మిషనరీ సమకూర్చుకోవడానికి ఫిక్స్‌డ్ లోన్ - ఈ లోన్‌ను ఆర్థిక సంస్థల ద్వారా సమకూర్చుకోవచ్చు.
-పరిశ్రమను నడపడానికి మూలధనం లేదా వర్కింగ్ క్యాపిటల్ అవసరమవుతుంది. వర్కింగ్ క్యాపిటల్ అంటే పరిశ్రమ రోజువారి నిర్వహణకు అయ్యే మూడు నెలలకు సరిపడా ఖర్చు. ఇందులో ముడి సరుకు వ్యయం, కార్మికులు, ఇతర సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్, నీటి, టెలిఫోన్ తదితర వ్యయాలు, చార్జీలను లెక్కిస్తారు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 25 లేదా 30 శాతాన్ని వర్కింగ్ క్యాపిటల్ మార్జిన్‌గా చూపిస్తారు. ఒక పరిశ్రమను నిర్వహించేటపుడు వర్కింగ్ క్యాపిటల్ అవసరమవుతుంది. దీనిని సరిగ్గా లెక్కకట్టి సరిపడా రుణం పొందాలి. లేనట్లయితే పరిశ్రమ నిర్వహణ భారమై మూతపడే ప్రమాదం ఉంటుంది. ఈ లోన్‌ను స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ద్వారా సమకూర్చుకోవచ్చు.
అనుమతి తీసుకోవడమెలా?
పరిశ్రమ/వ్యాపారాన్ని ప్రారంభించాలంటే ముందు సరైన ప్రదేశాన్ని ఎంపికచేసుకోవాలి. వ్యాపార విజయంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందువల్ల ప్రదేశాన్ని ఎంపికచేసుకోవడానికి ముందు అక్కడ ముడి సరుకుల లభ్యత, తయారైన వస్తువులను మార్కెట్‌కు తరలించే సౌలభ్యం, నిరంతరాయంగా నీరు, విద్యుత్ సదుపాయం, కార్మికుల లభ్యత, రవాణా సౌకర్యాలు ఉన్నాయా అని చూసుకోవాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసే ఇండస్ట్రియల్ ఎస్టేట్లలో అయితే ఈ వసతులనిటితో పాటు, కొన్ని సబ్సిడీ పథకాలు కూడా వర్తిస్తాయి. కానీ అధిక పెట్టుబడి, పరిమితి స్థల లభ్యత వంటి కొన్ని పరిమితుల దృష్ట్యా అక్కడ పరిశ్రమలను స్థాపించడం అందరికీ సాధ్యం కాదు. అందువల్ల ఔత్సాహికులు తక్కువ వ్యయంలో సాధ్యమైనంత వరకు మంచి ప్రదేశాన్ని ఎంచుకోవాలి.
ఫ్యాక్టరీ షెడ్..
ఎంపిక చేసుకున్న ప్రదేశంలో మిషనరీని ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా నిర్మాణానికి సంబంధించి ప్లాన్‌ను ఆర్కిటెక్టర్‌తో తయారు చేయించుకుని సంబంధిత అనుమతులు పొందాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా..
-పొల్యూషన్ సర్టిఫికెట్
-సైట్, భవనాల కోసం గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ నుంచి అనుమతి
-కర్మాగార శాఖ నుంచి ఆమోదం తప్పనిసరి
-డిస్కమ్ ద్వారా విద్యుత్ సరఫరా పొడిగించాలని సాధ్యత సర్టిఫికెట్
-జనరల్ సేల్స్ టాక్స్ (జీఎస్‌టీ), రిజిస్ట్రేషన్ అండ్ సెంట్రల్ సేల్స్ టాక్స్
-నీటి సరఫరా మంజురుకోసం స్థాని సంస్థలు, నదులు/ప్రజా ట్యాంకుల నుంచి నీటిని తీసుకునేందుకు నీటిపారుదల శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి.
-ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ నుంచి నిరభ్యంతర సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ)
ఈ అనుమతులన్నీ సింగిల్ విండో విధానం ద్వారా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్‌లో పరిమిత కాల పరిమితిలోగా మంజూరవుతాయి.