నాన్‌ ఓవెన్‌ ప్యాకేజింగ్‌ బ్యాగ్‌ల తయారి పరిశ్రమ


సన్నటి పట్టీలు (టేప్‌లు) అల్లినట్లుగా ఉండే క్లాత్‌తో తయారుచేసే ప్యాకేజింగ్‌ బ్యాగ్‌లను
ఓవెన్‌ బ్యాగ్‌లు అంటారు.

సిమెంట్‌, బియ్యం, ఎరువులు, విత్తనాలు, పొడి, గ్రాన్యూల్స్‌ రూపంలో
 ఉండే కెమికల్స్‌, గోధుమపిండి, మొక్కజొన్నపిండి వంటి ఆహార పదార్థాలు, పశువుల, కోళ్ల దాణా,
 ప్లాస్టిక్‌ ముడి పదార్థాలు వంటి అనేక ఉత్ప త్తుల ప్యాకింగ్‌కు ఇప్పుడు ఎక్కువగా ఈ ఓవెన్‌ ఫ్యాబ్రిక్‌తో
 చేసిన బ్యాగ్‌లను ఉపయోగిస్తున్నారు.
ఇటీవల కాలంలో ఆ ఉత్పత్తుల ప్యాకింగ్‌కు నాన్‌ ఓవెన్‌ ఫ్యాబ్రిక్‌తో తయారైన బ్యాగ్‌ల వినియోగం
మొదలైంది. అల్లకం లేకుండా తయారు చేసే క్లాత్‌లాంటి పదార్థం కావడంతో నాన్‌ ఓవెన్‌ ఫ్యాబ్రిక్‌గా వ్యవహరిస్తున్నారు.

పోలి ప్రొపెలిన్‌ (పిపి), పెట్‌ ముడి పదార్థాన్ని ఫైబర్‌గా మార్చి (దారంగా కాకుండా పీచుగా) ప్రత్యేక
యంత్ర పరికరాల ద్వారా వివిధ బరువు (చ.మీ. బరువు 10గ్రా నుంచి 200 గ్రాముల బరువు వరకు)
ఉండే తెల్లని, వివిధ రంగుల్లో క్లాత్‌ను తలపించే ప్లాస్టిక్‌ షీటును తయారుచేస్తారు.

దీనినే నాన్‌ ఓవెన్‌ ఫ్యాబ్రిక్‌ అంటారు. ఈ ఉత్పత్తి టెక్నికల్‌ టెక్స్‌టైల్‌ తరగతికి చెందింది. వివిధ నాణ్యతలతో
 తయారైన నాన్‌ ఓవెన్‌ ఫ్యాబ్రిక్‌ను అనేక రంగాల్లో ఉపయోగిస్తున్నారు. చిన్న క్యారీ బ్యాగ్‌లు,
షాపింగ్‌ బ్యాగ్‌ల తయారీకి నాన్‌ ఓవెన్‌ ఫ్యాబ్రిక్‌ ఉపయోగిస్తున్నారనేది అందరికీ తెలుసు.

నాన్‌ ఓవెన్‌ ప్యాకేజింగ్‌ బ్యాగ్‌లు:
భిన్నంగా కనిపించాలని భావించేవారు అధిక ధరతో ఉన్నవైనా అందంగా ముద్రించిన నాన్‌ ఓవెన్‌
బ్యాగ్‌లను ఉపయోగిస్తున్నారు. రైస్‌ మిల్లర్లు బియ్యం, విత్తన తయారీదారులు విత్తనాల, చిన్న
మొత్తాల్లో ప్యాకింగ్‌ చేసే సేంద్రీయ ఎరువుల ప్యాకింగ్‌కు ఈ బ్యాగ్‌ను ఉపయోగిస్తున్నారు

. కొన్ని సిమెంటు కంపెనీలు కూడా ఈ బ్యాగ్‌లు ఉపయోగిస్తున్నాయి. మరికొన్ని కారణాల వల్ల
మరిన్ని వ్యాపార సంస్థలు భవిష్యత్తులో నాన్‌ ఓవెన్‌ ఫ్యాబ్రిక్‌ ప్యాకేజింగ్‌ బ్యాగ్‌లు ఉపయోగిస్తాయి.

 అవి-

1. హెచ్‌డిపిఇ ఓవెన్‌ బ్యాగ్‌లతో పోలిస్తే పిపి, పెట్‌ నాన్‌ ఓవెన్‌ బ్యాగ్‌లు అధిక గట్టితనాన్ని కలిగి ఉంటాయి.
2. ఓవెన్‌ బ్యాగ్‌లపై ప్రింటింగ్‌తో పోలిస్తే నాన్‌ ఓవెన్‌ ఫ్యాబ్రిక్‌ ప్రింటింగ్‌ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
 నాన్‌ ఓవెన్‌ ఫ్యాబ్రిక్‌పై రోల్‌ టు రోల్‌ ప్రింటింగ్‌ సాధ్యం. 1 నుంచి 8 రంగుల వరకు అందమైన ఫోటో
 ప్రింటింగ్‌ ఈ బ్యాగ్‌లపై సాధ్యపడుతుంది. అందువల్ల ఈ బ్యాగ్‌లు వినియోగదారులను త్వరగా ఆకర్షిస్తాయి.

3. నాన్‌ ఓవెన్‌ వాటర్‌ ప్రూఫ్‌ ఫ్యాబ్రిక్‌తో తయారైన బ్యాగ్‌లు తడిసినా లోపలి పదార్థాలు చెడిపోవు.

4. వివిధ రంగుల్లో నాన్‌ ఓవెన్‌ ఫ్యాబ్రిక్‌ లభ్యమౌతుంది.

5. ప్యాకింగ్‌ చేయాల్సిన ఉత్పత్తికి అనుగుణమైన మందం గల నాన్‌ ఓవెన్‌ ఫ్యాబ్రిక్‌ లభ్యమౌతుంది.

6. నాన్‌ ఓవెన్‌ ఫ్యాబ్రిక్‌ పూర్తిగా రీసైక్లింగ్‌కు అవకాశం ఉంది. కాబట్టి ఇది పర్యావరణ అనుకూల
ఉత్పతి.
బ్యాగ్‌ల తయారీ విధానం
నాన్‌ ఓవెన్‌ ఫ్యాబ్రిక్‌ రోల్స్‌ను సేకరించి ఆటోమేటిక్‌, సెమీ ఆటోమేటిక్‌ యంత్రాల్లో 5, 10, 25, 50 కేజీల
పరిమాణం ప్యాకింగ్‌ బ్యాగ్‌లు తయారు చేయవచ్చు.

ముందుగా ఫ్యాబ్రిక్‌పై అవసరమైన డిజైన్‌ రోల్‌ టు రోల్‌ ప్రింటింగ్‌ యంత్రంలో ముద్రిస్తారు. తరవాత
ప్రింటింగ్‌ చేసిన ఈ ఫ్యాబ్రిక్‌ రోల్‌ను ఆటోమేటిక్‌ స్టిచింగ్‌, కటింగ్‌ యంత్రంలో అవసరమైన సైజుల్లో
 బ్యాగ్‌లుగా తయారుచేస్తారు. ఇది ఆటోమేటిక్‌ యంత్రంతో తయారీ విధానం.
సెమీ ఆటోమేటిక్‌ తయారీ విధానంలో ముందుగా రోల్‌ నుంచి ఫ్యాబ్రిక్‌ను ప్రత్యేక యంత్రంతో కట్‌ చేస్తారు.
 ఈ కటింగ్‌ ఫ్యాబ్రిక్‌ను ప్రత్యేక కుట్టు యంత్రాలతో బ్యాగ్‌లుగా కుడతారు. వీటిపై ప్రత్యేక ముద్రణ యంత్రంతో
 ప్రింటింగ్‌ చేస్తారు.
ఓవెన్‌ ప్యాకింగ్‌ బ్యాగ్‌ల కన్నా భిన్నంగా ఉండే నాన్‌ ఓవెన్‌ ప్యాకింగ్‌ బ్యాగ్‌ల తయారీ పరిశ్రమ
 సమర్థులైన యువతకు మంచి స్వయంఉపాధి అవకాశం అవుతుంది.
పరిశ్రమ వ్యయం:
ఆటోమేటిక్‌ పరిశ్రమ
ఉత్పత్తి సామర్థ్యం: రోజుకు 13వేల బ్యాగ్‌లు (8 గంటల షిఫ్ట్‌లో)

పరిశ్రమ వ్యయం: రూ.110.00 లక్షలు

సెమీ ఆటోమేటిక్‌ పరిశ్రమ

ఉత్పత్తి సామర్థ్యం: 10వేల బ్యాగ్‌లు / రోజుకు (16 గంటలు)

పరిశ్రమ వ్యయం: రూ.65.00 లక్షలు