మూత్రపిండాల్లో రాళ్లు పోయేదెలా?


మూత్రపిండాల్లో రాళ్లు పోయేదెలా?




ఆయుర్వేద శాస్త్ర రీత్యా మూత్రపిండాల్లో రాళ్ల వ్యాధిని ‘ మూత్రాశ్మరి ’ అంటారు. వాతం వల్ల శరీరంలో నీటిశాతం తగ్గిపోయి ఆ తర్వాత కణాల లోపలి భాగాలపై కాల్షియం, ఫాస్ఫేట్స్‌, ఆక్సిలేట్స్‌ రసాయనాలు పేరుకొని పోయి మూత్రపిండాల్లో రాళ్లుగా పరిణామం చెందుతాయి. మూత్రపిండాల్లోని రాళ్లు కొద్ది కొద్దిగా కరిగి, మూత్రనాళంలోకి దిగి ఇరుకైన సన్నని భాగాల్లో చిక్కుకుపోతాయి. ఇవి ప్రమాదకరం.





వ్యాధిలక్షణాలు- విపరీతమైన నొప్పి వీపు వెనుక వైపు నుంచి కిందికి దిగుతూ గజ్జల్లోకి , జననేంద్రియాల్లోకి పాకుతుంది. అలాంటి సమయంలో జ్వరం, వాంతి, ఆకలి లేకపోవడం, నిద్రలేకపోవడం, మూత్రం పోసేటపుడు మంట కలుగుతుంది. మూత్రంలో రక్తం కూడా పోయే అవకాశముంది. కొన్ని సందర్భాల్లో రాళ్లు కిడ్నీలో పూర్తిగా నిండిపోయి కిడ్నీ రాయిలా తయారవుతుంది. కొందరిలో మూత్రపిండాల్లోని రాళ్లు ఏరకమైన ఇబ్బందినీ కలగజేయకున్నా ఆశ్చర్యపోవాల్సినవసరం లేదు.

కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ముఖ్యకారణాలు ?
ఎముకలు విరిగినపుడో, గుల్లబారినపుడో ఎక్కువ కాలం కాల్షియం ట్యాబ్లెట్లను వాడితే అవి కాల్షియం ఆక్సలేట్‌గా మారి రాళ్లవుతాయి. కాల్షియం, ఫాస్ఫేట్స్‌, ఆక్సిలేట్స్‌ రసాయనాలుండే ఆహారాన్ని తీసుకున్నా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి.
కిడ్నీలో రాళ్లు రాకుండా చేయాలంటే ?
ఎక్కువగా మంచి నీళ్లు తాగాలి. ఇతర ద్రవపదార్థాలు ఎక్కువశాతం తీసుకోవటం వల్ల రాళ్లు ఏర్పడే అవకాశాలు తక్కువ ఉన్నాయి.
పెరటి మొక్కల వైద్యం
అతి తక్కువ ఖర్చుతో మన ఇంట్లోని పెరటిమొక్కలతో కిడ్నీల్లోని రాళ్లను కరిగించే అవకాశాలున్నాయి. అవేంటో తెల్సుకుందాం.
తులసి రసం
కావాల్సినవి - కొన్ని తులసిఆకులు, తేనె
తయారీ విధానం - ముందుగా తులసి ఆకు రసం చేసుకోవాలి. చెంచాడు తులసి ఆకు రసంలో అంతే తేనె కలిపి ప్రతీరోజూ ఉదయాన్నే సేవించాలి. కనీసం ఆర్నెళ్లు ఇలాగే చేస్తే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి.
కొండపిండి కషాయం
కావాల్సినవి- కొండపిండి మూలిక, నీరు
తయారీ విధానం- కొండపిండినే పాషాణభేది అంటారు. ఈ మూలికా వేరు చూర్ణాన్ని తయారు చేసుకుని కొద్దిపాటినీటితో కలిపి చెంచాడు తీసుకోవాలి. లేదా నేరుగా 30 మి.లీ. మూలికా వేరు రసాన్ని తాగాలి. ఇలా మూడుపూటలా తీసుకోవాలి. లేకుంటే కొండపిండి కషాయంని ఆకు పెసర పప్పుతో కలిపి కూరగా వండుకు తినటం అలవాటు చేసుకోవాలి. మూడునెలల తర్వాత కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి.
ఉలవచారు
కావాల్సిన పదార్థాలు - ఉలవలు, ముల్లంగి ఆకులు, నీరు
తయారీ విధానం - ఉలవల్లో ముల్లంగి ఆకులు సన్నగా తరిగి కలిపాలి. నీళ్లు బాగా పోసి ఉడికించాలి. పై నీటిని తీసి చారు చేసుకోవాలి. ఈ ఉలవచారు రోజూ తాగితే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి.
గలిజేరు పులుసు
కావాల్సిన పదార్థాలు - తెల్ల గలిజేరు వేరు, నీరు.
తయారీ విధానం - తెల్ల గలిజేరు వేరును నీటిలో మెత్తగా నూరాలి. ఒక కప్పు నీటిలో ఒక రోజు రాత్రంతా నాన బెట్టి ఉదయాన్నే వడబోసి తర్వాత తాగాలి. దీంతో మూత్రపిండాల్లోని రాళ్లు కరిగిపోతాయి.
గమనిక- కిడ్నీల్లో రాళ్లు బాగా పెద్దవిగా ఉన్నా, అవి బయటకు రావటం వీలుకాని సందర్భాల్లో ఆయుర్వేద వైద్యులను సంప్రదించటం మంచిది.
డాక్టర్‌ కందమూరి
ఆయుర్విజ్ఞాన కేంద్రం, ఫోన్‌ : 9866482598