పులిపిరికాయలను వార్ట్స్ అని పిలుస్తుంటారు. జనాభాలో పదిశాతం మందికి పులిపిరులు ఉంటాయి. పులిపిరులకు ప్రధానకారణం వైరస్. ఇవి చర్మం రంగులో కాని, కాస్తంతముదురు గోధుమరంగులో కాని బొడిపెల మాదిరిగా గరుకుగా ఉంటాయి. ప్రత్యేకించి నొప్పిని కలిగించవ్ఞ. ఒకవేళ ఒత్తిడి పడే చోట వస్తే మాత్రం ఇబ్బందిని కలిగిస్తుంటాయి. ఇవి ఎక్కువగా ముఖంపైనా, మెడపైనా, చేతులు,పాదాలు మొదలైన ప్రదేశాల్లోనూ వస్తుంటాయి.
పులిపిరులకు ఔషధంగా ఆముదం చక్కగా పనిచేస్తుంది. ఒక చుక్క ఆముదాన్ని పులిపిరి పైన వేసి స్టికింగ్ టేప్ అతికించాలి. ఇలా రెండుపూటలా మూడు వారాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అరటిపండు తొక్కను తీసుకుని గుజ్జుభాగం పులిపిరులపైన అనేట్లుగా ఉంచి స్టికింగ్ ప్లాస్టర్‌తో అతికించాలి. రాత్రంతా ఉంచి పగటిపూట తీసేయాలి. ఇలా కనీసం వారం రోజుల పాటు చేస్తే ఫలితం ఉంటుంది. అనాస, నిమ్మ, నారింజ పండ్లతొక్కలతో కూడా ఇదేమాదిరిగా చేయవచ్చు. అలాగే వెల్లుల్లి రేకలను పులిపిరుల పైన రుద్దడం వలన కూడా మంచి ఫలితముంటుంది. ఉల్లిపాయలతో ఒక చక్కని ప్రయోజనం ఉంది. దీనిని సగానికి కోసి మధ్యభాగాన్ని చెంచాతో తొలిచేయాలి. తరువాత ఆ భాగాన్ని సముద్రపు ఉప్పుతో నింపాలి. కొంతసేపటికి ఉప్పు, ఉల్లిరసం, కలిసి ఒక ద్రవపదార్థం ఏర్పడుతుంది. దీనిని తీసి జాగ్రత్త చేసుకుని 30రోజులపాటు పులిపిరుల పైన ప్రయోగిస్తూంటే గుణం కనిపిస్తుంది. కేవలం ఉత్తరేణి బూడిదను తులసిఆకులతోగానీ లేదా మణిశిలతో గానీ కలిపి నూరి ఆవనూనె చేర్చి ఆ మిశ్రమాన్ని పులిపిరులపైన రాసినా సరిపోతుంది. కొత్త సున్నానికి పులిపిరులను రాల్చగలిగే అద్భుతశక్తి ఉంది. అల్లం ముక్కను సూదిగా చెక్కి కొత్త సున్నంలో ముంచి పులిపిరికాయలపై రాస్తే చాలు. కాకపోతే ఇలా చేసేప్పుడు సున్నం చుట్టుప్రక్కల చర్మానికి అంటకుండా జాగ్రత్తపడాలి. బొప్పాయి పాలకు, జీడిపండ్లతో తయారుచేసిన తైలానికి కామంచి ఆకుల కల్కానికీ పులిపిర్లను తగ్గించేశక్తి ఉంది. ఇవన్నీ కొంచెం ఉగ్రస్వభావం ఉండే ఔషధ ద్రవ్యాలు కనుక వీటిని వైద్యసలహా మేరకు వాడుకోవాల్సి ఉంటుంది. పులిపిర్ల చికిత్సలో విటమిన్ల పాత్ర కూడా ముఖ్యమైనదే. విటమిన్-ఎ, విటమిన్-సిలను పై పూతగా ప్రయోగించి నప్పుడు పులిపిరికాయలు తగ్గే అవకాశం ఉంది. చేపనూనె, క్యారెట్ మొదలైన వాటిలో విటమిన్-ఎకు సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉసిరికాయలలో విటమిన్‌సి ఎక్కువగా ఉంటుంది. వీటిని నలగ్గొట్టి, గుజ్జుగా చేసి ఒకటి, రెండునెలల పాటు ప్రతిరోజూ పులిపిర్ల మీద పూతగా లేపనం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. |
Pages
▼