Pages

ఆన్‌లైన్‌ మాయలో పడకండి ?

ఒకప్పుడు వంద రూపాయల వస్తువును ఆన్‌లైన్‌ మార్కెట్లో కొనాలంటే తటపటాఇంచేవారు. ఇపుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేవలం ఒక్క క్లిక్‌తో వేలరూపాయ వస్తువుల్ని సైతం కొనుగోలు చేస్తున్నారు. ఈ-కామర్స్‌ అభివృద్ధి చెందడం వల్ల ఇండియాలో ‘ఆన్‌లైన్‌కొట్టు’ ల హంగామా ఈ మధ్య మరీ ఎక్కువగా ఉంది . పండుగల సమయాల్లోనే కాకుండా వింటర్‌, సమ్మర్‌, రైనీ సీజన్‌ అంటూ ఇలా ఎప్పుడు పడితే అప్పుడు బిగ్‌డీల్స్‌ అంటూ ఆన్‌లైన్‌షాపింగ్‌ సంస్థలు డిష్కౌంట్స్‌ ఎరలేస్తున్నారు. దీంతో వినియోగదారులు ఈజీగా వస్తుమోహంలో పడి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. అలా కాకుండా కాసింత సహనం, కూసింత తెలివిని ప్రదర్శిస్తే ఈ- షాపింగ్‌ హాయిగా చేసుకోవచ్చు. ఆ టిప్స్‌ తెల్సుకుందాం.
ఠి మీరు ఇప్పటికే రెండు మొబైల్స్‌ వాడుతున్నా , ఇంట్లో అందరికీ మొబైల్‌ ఉన్నా ఆఫర్‌లో వచ్చిందని వెంటనే ఆన్‌లైన్‌షాపింగ్‌ చేయటం మంచిది కాదని ఆలోచించండి. అవసరంలేని వస్తువును కేవలం ఆఫర్‌ ఉండటం వల్ల కొని ఆ తర్వాత అనవసరంగా తీసుకున్నానని బాధపడకండి.
ఠి ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్స్‌ మార్కెట్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాటి అసలుపని కంజ్యూమరిజమ్‌ని మనకి అలవాటు చేయటమే. చెప్పుల దగ్గరనుంచి ల్యాప్‌టాప్‌ల దాకా అమ్మకానికి పెట్టే ఈ- షాపింగ్‌ వెబ్‌సైట్స్‌ని ఓపెన్‌ చేసి పదే పదే చూడటం తగ్గించండి. దీనివల్ల కొనాలనే ఆసక్తి మనలో లేకున్నా ఓ పదిసార్లు అదే వస్తువును చూశాక తీసేసుకోవాలనిపిస్తుంది.
ఠి మనం షాప్‌కి వెళితే నాలుగు రకాల వస్తువుల్ని చూసి నిర్ధారించుకుంటాం. వస్తువు బరువుందా ? లైట్‌ వెయిటా ? ఏ మెటల్‌తో తయారు చేశారు ? రంగు, పరిమాణం చెక్‌ చేసుకుని ఫీలవుతాం. అయితే ఆన్‌లైన్‌ షాపింగ్‌లో అందంగా ఫొటోషాప్‌లో చేసిన వస్తువు డిజైన్‌ మాత్రమే చూస్తాం, తక్కిన విషయాలు తెలుసుకోవటానికి ఆసక్తి, అవకాశం ఉండకపోవచ్చు. ఇక ఆన్‌లైన్‌షాపింగ్‌ తప్పని సరి అయితే కొనాలనుకునే వస్తువు పూర్తి విశేషాల్ని ఓపిగ్గా చదవండి. ఇతర పేరున్న వెబ్‌సైట్స్‌లో ఆ వస్తువు ఎంత రేటు ఉందో మొదట గమనించండి. వీలైతే బయటమార్కెట్‌లో ఎంత ఉందో కన్ఫం చేసుకోవడం మంచిది. అన్నీ గమనించాక హ్యాపీగా తీసుకోవచ్చు అనుకుంటే వస్తువుకు సంబంధించిన రివ్యూలు చదవండి. అసలు షిప్పింగ్‌ ఫ్రీ ఉందా ? ఎన్ని రోజులకి డెలివరీ అవుతుందనే విషయాలు చదవండి . ఎలకా్ట్రనిక్‌ వస్తువులైతే సర్వీస్‌ సెంటర్లు ఎక్కడ ఉన్నాయనేది తెలుసుకోండి. ఫైనల్‌గా ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థ నియమ,నిబంధనలూ చూసి వస్తువును ఆర్డర్‌ చేయండి.
ఠి ఆన్‌లైన్‌ సంస్థలు క్యాష్‌ ఆన్‌ డెలివరీ లేకుంటే పేయ్‌మెంట్‌ చేశాక వస్తువును డెలివరీ చేయటం చేస్తుంటాయి . ఈ మధ్య చాలా ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్స్‌ పేరున్న బ్యాంకులతో కలిసి క్యాష్‌బ్యాక్‌ ఆఫర్స్‌తో ఊరిస్తున్నాయి. త్వరగా ఆ మోజులో పడకండి. ఫలానా బ్యాంకు క్రెడిట్‌ కార్డుకి ఇ.ఎమ్‌.ఐ. ఆప్షన్‌ ఉందనగానే కొందరికి ఎక్కడలేని సంతోషం కలుగుతుంది. సులువుగా నెలవారీ శాలరీలో ఇంతమనీ కట్‌ అయితే పోయేదేముందీ అనుకుంటే ఆ తర్వాత అదే అలవాటు మీ ఆర్థికపతనానికి దారి తీయవచ్చు. ఇక డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో షాపింగ్‌ చేసినపుడు ఒక్కోసారి అమౌంట్‌ కట్‌ అయి, ఆర్డర్‌ ఫెయిలవుతుంటుంది. దీనివల్ల చాలామంది వినియోగదారులు క్రెడిట్‌ కార్డు బ్యాంకులతో పాటు, సదరు ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్‌ కాల్‌ సెంటర్‌కి కాల్స్‌ చేసి కష్టాలుపడుతుంటారు. అలా కాకుండా క్యాష్‌ అండ్‌ డెలివరీ ఆప్షన్‌ ఎంచుకుంటే డెలివరీ ఆయ్యే రెండు, మూడ్రోజుల్లోపల ఒకవేళ మన దగ్గర డబ్బు లేకున్నా ఎలాగొలాగా అడ్జస్ట్‌ చేసుకోవచ్చు కూడా.
ఠి ఈ రోజే అతి గొప్ప డీల్‌ అని పాపులర్‌ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్స్‌ డప్పు కొడుతుంటాయి. అలాంటి ఆఫర్స్‌ పాపులర్‌ వెబ్‌సైట్స్‌ అన్నీ సంవత్సరాంతం ఇలాగే ఇస్తాయని కాస్త ఆలోచించండి. కేవలం ఆఫర్స్‌ కోసం వస్తువలను కొనే అలవాటు మానండి. మీ కుటుంబంలోని వారికి , సన్నిహితులకి ఇదే చెప్పండి.
ఠి ఈ మధ్యకాలంలో హైదరాబాదులోని యువతరం హెయిర్‌స్టైల్‌, ఫేసియల్‌ లాంటి సర్వీసుల్ని ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటోంది. దీంతో పాటు ఫుడ్‌డీల్స్‌పై మమకారం పెంచుకుంటోంది. వీటికి ఎక్కువగా మధ్యతరగతి యువతే ఆకర్షితులవుతోంది. 450 రూపాయలుండే నాన్‌వెజ్‌ బఫెట్‌ డీల్‌లో కేవలం 299 మాత్రమే వస్తోందని, ఇంటిల్లిపాదికి నాలుగు కూపన్స్‌ని బుక్‌ చేసేముందు ఆ పన్నెండు వందల రూపాయలతో హాయిగా అందరూ ఇష్టమైన ఫుడ్‌ చేసుకుని తినొచ్చని మరవకండి.
ఠి కొందరికి ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయటం ఓ ఫ్యాషన్‌. ఇంకొందరు ధనవంతులు కావటం వల్ల ఆన్‌లైన్‌షాపింగ్‌ చేస్తుంటారు. వారిని చూసి సగటు మధ్యతరగతివాళ్లు వాతపెట్టుకోవటం మంచిది కాదు. ఆన్‌లైన్‌షాపింగ్‌ మాయలో కొట్టుకుపోకుండా కాస్త ఆలోచించండి, జాగ్రత్తగా ఉండండి.