సముద్రం ఒడ్డున నివసిస్తున్న ఒక జాలరి చేపలు పట్టడానికి
సముద్రంలోకి వెళ్ళాడు. చేపలకోసం నీటిలోకి వల విసిరాడు. కాసేపటి తర్వాత వల పైకి
లాగి చూడగా అందులో రెండూ మూడు చిన్న చేపలతో పాటు ఒక సీసా కనిపించింది. జాలరి ఆశ్చర్యంగా ఆ సీసా తీసుకుని మూత తెరిచాడు. వెంటనే దానిలోంచి బుస్‌మని నల్లటి పొగ బయటకు వచ్చింది. ఆ పొగ మేఘంలా మారి, దాని మధ్యలో పెద్ద ఆకారంలో భూతమొక్కటి ప్రత్యక్షం అయ్యింది. భూతాన్ని చూసి జాలరి భయంతో గడగడా వణికిపోయాడు. భూతం భయంకరంగా నవ్వి..''కొన్ని వందల సంవత్సరాల పాటు నేను అందరిని హడల కొట్టాను. అయితే ఒక మాయావి తన మంత్ర శక్తితో నన్ను ఈ సీసాలో బంధించి సముద్రంలోకి విసిరేశాడు. ఎంతోకాలంగా బయటపడే అవకాశం లేకుండా గడిపాను. చివరకు నీ వల్ల నాకు స్వేచ్ఛ లభించింది'' అన్నాడు. జాలరి నోట మాట రాలేదు. తిరిగి ఆ భూతమే ఇలా అంది. ''నిన్ను చంపక తప్పదు. ఎందుకంటే ఈ సీసాలోంచి నేను బయట పడ్డ విషయం నీకొక్కడికే తెలుసు. ఇది రహస్యంగా వుండాలంటే నువ్వు చావాలి'' అన్నది. ఈలోగా జాలరి భయంలోంచి తేరుకున్నాడు. భూతం జాలరిని చంపడానికి సిద్ధమయ్యింది. ఎప్పుడో ఒకసారి వాళ్ళ తాత చెప్పిన కథ గుర్తుకు వచ్చి, జాలరి ధైర్యం తెచ్చుకొని ఒక్కక్షణం ఆగు. నువ్వు ఎలాగూ నన్ను చంపకుండా వదలవని తెలుసు. అయితే చనిపోయే ముందు నాదో చివరి కోరిక తీరుస్తావా?'' అన్నాడు. ''చివరి కోరికఏమిటోవెంటనే చెప్పు'' అంది భూతం కోపం గా.''నువ్వు చూస్తే పర్వతంలా ఇంత పెద్దగా వున్నావు. ఇంత చిన్న సీసాలోకి నువ్వెలా వెళ్ళావో అస్సలు అర్థం కావడం లేదు. తెలుసుకోవాలని వుంది.చనిపోయే వ్యక్తి ఆఖరి కోరిక తీర్చడం ధర్మం'' అంటూ తొందరపెట్టాడు జాలరి. చాలాకాలం బంధింపబడి ఉండి, అనుకోకుండా దొరికిన స్వేచ్ఛ వల్ల కలిగిన ఆనందంతో భూతంలోని ఆలోచనా శక్తిని హరింప జేశాయి. ''అహ్హహ్హ అని పెద్దగా నవ్వుతూ మానవులకు అన్నీ సందేహాలే!'' అనుకొని ''చూడు మానవుడా..నేనెలా లోపలికి వెళ్ళానో..''అంటూ ఆ భూతం తన ఆకారాన్ని చిన్నగా మార్చకుని జాలరి చేతిలోని సీసాలోకి దూరింది.వెంటనే జాలరి సీసా మూతను గట్టిగా బిగించాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ సీసాను సముద్రంలోకి విసిరేశాడు. |
Pages
▼