Pages

తెలివితేటలు


పూర్వము గోపనాధపురంలో మహేశగుప్తుడు అను వ్యాపారీ ఉండెడివాడు. గోపనాధపురం లో ఆయనకు నిజాయితీ పరుడని గొప్ప పేరే ఉండేది. కొన్ని దశాబ్దాలుగా వ్యాపారముపై మనసు లగ్నం చేయుట వలన శారీరకంగా మానసికంగా అలసిన మహేశగుప్తునికి విశ్రాంతి తీసుకోవాలనిపించింది. 

కాని ఎంతోకాలంగా జాగ్రత్తగా నిర్వహిస్తున్న ఈ వ్యాపారమును తన ముగ్గురు కుమారులలో ఏ కుమారునికి అప్పగిస్తే బాగుంటుంది అనే ఆలోచన మహేషగుప్తునికి తోచింది. వెంటనే తన ముగ్గురు కుమారులు అయిన కుమారగుప్త, శరణగుప్త,వివేకగుప్తలను తన వద్దకు పిలిపించుకున్నాడు. వారితో నాయనలారా నాకు వయసు మీద పడుతోంది. ఊరు పొమ్మంటోంది కాడు రమ్మంటోంది. 

ఎక్కువ రోజులు ఈ కుటుంబ బాధ్యత వ్యాపార బాధ్యత నిర్వహించే శక్తి లేదు. కనుక నేను మీకు బాధ్యత అప్పగించదలచుకున్నాను. కానీ మీలో ఈ బాధ్యత వ్యాపార స్వీకరించుటకు సమర్ధులు ఎవరో నిర్దారించవల్సి ఉంది. మీకు ఒక చిన్న పరీక్ష పెట్ట దలచుకున్నాను అంటూ ముగ్గురిని ఒక గది వద్దకు తీసుకు వెళ్లినాడు. 

నాయనలారా మీకు ఒక వందరూపాయలు ఇస్తాను. మీరు ముగ్గురు మీకు ఇచ్చిన వందరూపాయలతో ఈ గది నింపే వస్తువు తీసుకురావాలని చెప్పాడు. ముగ్గురు తండ్రి మాటకు తలాడిస్తూ అక్కడ నుంచి కదిలారు.


కొంతసేపు అయిన తర్వాత ముగ్గురు కుమారులు మహేష్‌గుప్తుని వద్దకు వచ్చి నాన్న మేము కొన్ని వస్తువులు తెచ్చాం. ఆ వస్తువులతో గది నింపే ప్రయత్నం చేస్తామని చెప్పారు. నలుగురు కల్సి గది వద్దకు చేరినారు.

మొదటగా పెద్దకుమారుడు కుమారగుప్తుడు తాను తెచ్చిన ప్రత్తితో గది నింపడానికి ప్రయత్నించాడు. గది పూర్తిగా నిండలేదు. కొంతభాగమే నిండింది. తన ఓటమిని ఒప్పుకుంటూ కుమారగుప్తుడు పక్కకు తొలిగాడు.
రెండో కుమారుడు శరణగుప్తుడు వడ్లపొట్టు గదిలో పోసాడు. దాంతో కూడా గది నిండలేదు. శరణగుప్తుడు కూడా తన ఓటమిని ఒప్పుకుంటూ పక్కకు తొలిగాడు.
ఇక మూడో కుమారుడు వివేకగుప్తుని వంతు వచ్చింది. వివేక గుప్తుడు తాను తెచ్చిన ప్రమిద నిండా నూనెపోసి ఆ నూనెలో వత్తిడి తడిపి వెలిగించాడు. గదంతా వెలుగుతో నిండిపోయింది. వెలుతురు సోకని ప్రాంతం ఆ గదిలో ఎక్కడా లేదు.

మహేషగుప్తుడు వివేకగుప్తుని అక్కున చేర్చుకుని ఆప్యాయంగా వీపుమీద తట్టినాడు. సరయిన వారసుడు లభించినందుకు సంతోషించినాడు. అప్పుడు కుమారగుప్తుని శరణగుప్తుని తన దగ్గరకు పిలిచి మహేష్‌గుప్తుడు ఇలా చెప్పాడు.

మీరు తెలివికలవారు అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ వివేకగుప్తుని ఆధ్వర్యంలోవ్యాపారం నిర్వహించండి. సమాజంలో మరింత రాణించగలగుతారు అని హితవుపలికాడు. అందుకు వారు తమ సమ్మతిని తెలిపారు.