Pages

కోతుల సమయస్పూర్తి


ఒక ఊరిలోని అడవిలో ఒక కోతుల గుంపు వుండేది. ఆ గ్రూపులోని కోతులన్నీ చాలా చురుగ్గా అటు ఇటూ తిరుగుతూ అడవినంతా గందరగోళం చేసేవి. అక్కడ నివసించే మిగిలిన జంతువులు వీటి అత్యుత్సాహానికి చిరాకుపడి వీటిని విసుక్కునేవి.

దానికా కోతులన్నీ మీకేమి మేము అపకారం చేయట్లేదు కదా అనేవి. మిగతా జంతువులు వీటిని చీదరించుకునేవి.
ఒకసారి ఓ కుందేలు పిల్ల పాడుబడ్డ బావిలో పడిపోయింది. ఆ పిల్ల తల్లి అక్కడ ఉన్న కొన్ని జంతువులు దానిని రక్షించడం కోసం అటూ ఇటూ తిరుగుతూ తాళ్లకోసం మర్రి ఊడల కోసం వెతకసాగాయి. వాటికి అవి ఏమీ దొరకలేదు.

తల్లి కుందేలు బావి ప్రక్కన ఏడవడం మొదలైంది.
ఇంతలో కోతుల గుంపు గెంతుతూ ఉరకలేస్తూ ఆ వైపుకు వచ్చాయి. విషయం తెలుసుకున్నాయి. వెంటనే ఓ పెద్దకోతి నేను చెప్పినట్లుగా మీరంతా చేయండి అని మిగిలిన వాటికి విషయం చెప్పింది. దాని ప్రకారం మొదట పెద్దకోతి రెండు చేతులతో బావి పక్కనున్న ఓ చెట్టును పట్టుకుంది.

మిగిలిన కోతులన్నీ ఒకదాని తరువాత మరొకటి వాటి, వాటి తోకలు పట్టుకున్నాయి. అవి అలా ఒక చైన్‌లా తయారయి నూతిలోని నీళ్లవరకూ ఒడిసి పట్టుకున్నాయి. చివరనున్న కోతి కుందేలు పిల్లని ఒడుపుగా నీళ్ళ వరకూ ఒడిసి పట్టుకున్నాయి. చివరనున్న కోతి కుందేలు పిల్లని ఒడుపుగా నీళ్లలోంచి బయటకు తీసి, దానిని పై కోతికి అందించింది.

ఇలా ప్రతీ కోతి ఆ కుందేలు పిల్లని, హుషారుగా అంది పుచ్చుకుంటూ బావి బయటకు తీసుకువచ్చాయి.
మిగిలిన జంతువులన్నీ వాటి సమయస్పూర్తికి, అత్యుత్సాహానికి, పట్టుదలకీ ఆశ్చర్యపోయాయి. తల్లి కుందేలు చేతులు జోడించి నమస్కరించింది. మిగిలిన జంతువులన్నీ ఇంకెప్పుడూ మిమ్మల్ని చీదరించుకోం, విసుక్కోం తక్కువగా అంచనావేయం అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాయి.