ఏపీ సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లా టీడీపీ నేతలకు దేవుడే అయ్యారు. ఆయన కోసం గుడి కడతారట. తమ ప్రాంతంలో రాజధాని నిర్మిస్తున్నందుకు కృతజ్ఞతగా చంద్రబాబుకు గుడికట్టాలని గుంటూరు జిల్లాలోని టీడీపీ నాయకులు నిర్ణయించినట్టు తెలిసింది. హరిశ్చంద్రపురం గ్రామంలో కృష్ణానది ఒడ్డున 15 లక్షలతో చంద్రబాబుకు గుడి కట్టాలని నిర్ణయించినట్టు తుళ్ళూరు మండల టీడీపీ వైస్ ప్రెసిడెంట్ సతీశ్ తెలిపారు.
రాజధానికి శంకుస్థాపన చేసే దసరా పండగరోజే ఈ గుడికి కూడా శంకుస్థాపన చేస్తామన్నారు. తమ అభిమాన తారలకు, రాజకీయ నాయకులకు గుడులు కట్టి సంబరాలు చేసుకోవడం తమిళనాడు వాసుల ఆనవాయితీ. ఎంజీఆర్, జయలలిత, ఖుష్బూ, నమిత, హంసిక.. ఇలా ఎంతోమందికి గుడులు కట్టి వాళ్లు తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే అదే సంస్కృతి నవ్యాంధ్రకు కూడా పాకినట్టు కనిపిస్తోంది.