పనిమీద శ్రద్ధ పెట్టడం లేదని, ఆలస్యంగా ఆఫీసుకు వస్తున్నావని, ఎక్కువగా సెలవులు పెట్టేస్తున్నావని, ఆఫీసులో సీట్లో ఉండకుండా అక్కడాఇక్కడా కబుర్లు చెబుతూ కాలం వెల్లదీస్తున్నామనీ... ఉద్యోగం నుంచి తీసేయడానికి ఇలా ఎన్నో కారణాలుంటాయి. అయితే అమెరికాలోని పెన్సిల్వేనియాలో రిచర్డ్ క్లెమ్ అనే పెద్దమనిషి అవస్థ వేరు. విపరీతంగా బరువు పెరిగిపోయి 190 కిలోలకు చేరుకున్న క్లెమ్ అదేపనిగా 'గ్యాస్' విడుస్తున్నాడనే కారణంతో అతను పనిచేసే కేస్ పోర్క్రోల్ కంపెనీ (పంది మాంసంతో రోల్స్ తయారుచేసే కంపెనీ) అతనికి 'పింక్ స్లిప్' ఇచ్చేసింది.
2013లో బరువు తగ్గేందుకు ఆపరేషన్ చేయించుకున్నా... క్లెమ్ పరిస్థితిలో మార్పు రాలేదట. దాంతో కంపెనీ అతన్ని ఏకంగా ఉద్యోగం లోనుంచి తొలగించేసింది. ఇదెక్కడి అన్యాయమని అతను కోర్టుకు ఎక్కాడు. కేసు నడుస్తోంది. కంపెనీ వాదనేమిటంటే... పదిమంది వచ్చిపోయే ఆఫీసులో క్లెమ్ సువాసనలు వెదజల్లుతుంటే... వ్యాపారం దెబ్బతినదా? అంటోంది. అలాగే తోటి ఉద్యోగుల నుంచి కూడా విపరీతంగా ఫిర్యాదులు రావడంతో తొలగించక తప్పలేదంటోంది.