దక్షిణం వైపు ఖాళీ వదలకుండ ఇల్లు కట్టవచ్చా?






దక్షిణం వైపు ఖాళీ వదలకుండ ఇల్లు కట్టవచ్చా? 



house


గృహం పరిపూర్ణ నిర్మాణంలో చుట్టూ వదలడం అనేది ముఖ్య విషయం. అయితే, చిన్న స్థలం అయినప్పుడు ఏదైనా ఒక భాగం హద్దు మీద నిర్మాణం చేసుకుని కడుతుంటారు. ప్రధానంగా దక్షిణం లేదా పడమరలు మాత్రమే ఇందుకు ఉపయోగించాలి. దక్షిణం రోడ్డు వచ్చినప్పుడు, రోడ్డు బాగా కిందికి వున్నప్పుడు ఇల్లు దక్షిణం హద్దు మీద నిర్మించకూడదు. అప్పుడు పడమర హద్దు మీదకు జరిగి కట్టుకోవచ్చు. పడమర హద్దు మీదకు కట్టినప్పుడు దక్షిణం ఖాళీ వదలాలి. పడమర కూడా రోడ్డు కిందికి, పూడినప్పుడు దాని హద్దుమీద కూడా కట్టకూడదు. ఏదేమైనా, తప్పనిసరిగా ఇంటికి మూడువైపులా ఖాళీ వుండాలి. అప్పుడే అరవైశాతం అయినా గృహానికి న్యాయం జరుగుతుంది.


తూర్పు ఈశాన్యంలో కారు పార్కింగ్ పెట్టి వాయవ్య భాగం రూం రెంటుకు ఇవ్వవచ్చా? - వినయ్, చేవెళ్ల
గృహం మన అవసరాలకు నిర్మించడమా... గృహ శాస్త్రం ప్రకారం నిర్మించడమా... అనేది ప్రధానం. ఈరోజు మనిషి తన వసతుల కోసం శాస్త్రాన్ని శస్త్ర చికిత్స చేస్తున్నాడు. ఎప్పుడైనా గృహం నిండుగా వుండాలి. తను నివసించే భాగం కిందనా, పైననా అనేది ఎంచుకొని ఏదో ఒకచోట స్థిరపడాలి. అందుకు సరిపడే విధంగా ప్లాను చేసుకోవాలి. తాను వుండే పోర్షన్‌లోనే మరొక రెండు (అద్దె) ఉండటం వల్ల అటు నైరుతి, ఇటు వాయవ్యం ఎటువైపు పోర్షన్ రెంటుకు ఇచ్చినా ఒక భాగం కోల్పోతాం. అది పరిపూర్ణతకు పెద్ద లోపం. ఏదో ఒక భాగం అనగా పైన లేదా కింద రెంటు గదులు నిర్మించి యజమాని ఒక దాంట్లో పూర్తిగా లేదా ఎక్కువ భాగం తూర్పు వదిలి ఇల్లు వేసుకుంటే ఇద్దరికీ న్యాయం జరుగుతుంది.

పస్టు ఫ్లోర్‌లో మూడు రెంటు పోర్షన్లు తూర్పు ముఖం పెట్టి వేయవచ్చా? - వాసవి, నేరేడ్‌మెట్
రెండు గదులు ఎన్ని వస్తాయి, ఎన్ని వేసుకోవచ్చు అనేది గృహ విస్తీర్ణం, ఎంత మంది అనే దానిపై ఆధారపడి వుంటుంది. ముఖ్యంగా ఫస్టుఫ్లోర్‌లో అద్దె పోర్షన్లు వేయాలనుకుంటే తప్పక తూర్పు, ఉత్తరం ఖాళీ వదిలిపెట్టాలి. ఆ వైపు నుండి అద్దె పోర్షన్లకు వెళ్లే అవకాశం సవ్య దిశలో వస్తుంది. అవసరాల కోసం ఎక్కువ గదులు వేసి ఇరుకు చేసుకోకుండా సరైన కొలతలతో, వచ్చిన వాళ్లు కూడా ఆరోగ్యంగా వుండేలా గాలి వెలుతురు విస్తారంగా వచ్చేలా పోర్షన్లు వేయాలి. రెండు పోర్షన్లు ఒక ఫ్లోర్‌లో వేయడం సముచితం. ఎందుకంటే పొయ్యిలు సమంగా సరైన దిశలో ఆగ్నేయం వాయవ్యంలో పంచబడతాయి. తద్వారా పూర్తి ఇంటికి శాస్త్ర విఘాతం జరగకుండా వుంటుంది.

తూర్పు ఆగ్నేయం, అలాగే ఉత్తర వాయవ్యం బాల్కనీల్లో బాత్రూములు కట్టుకోవచ్చా? - సిద్దిరాములు, ములుగు
గృహాన్ని ‘గుహ’లా మలుచుకోవద్దు. ఇంటిని సంస్కరించుకొని మన పూర్వులు ఎన్నో అద్భుతాలు చేశారు. ఆనాడు వాళ్ళకు ఇన్ని ఆధునిక యంత్రాలు లేవు. కానీ, సృష్టి వనరులతో ఎన్నో మహత్తర నిర్మాణాలు చేశారు. చత్రశాలలు, గుడిగోపురాలు, తటాకాలు మొదలైనవి. కానీ, నేటి ఆధునికుడు తన అతిజ్ఞానంతో పక్క కింద గొయ్యిలు తవ్వుకుంటున్నాడు. తూర్పు ఉత్తరాలు ఊపిరి స్థలాలు. అవి మాత్రమే... ఇంటి పై భాగంలో మిగిలివుండే కనీస ఖాళీలు. వాటిని కూడా మరుగుదొడ్లు వేసి నానా ఖండాలుగా వాడుతున్నారు. అలా చేయకూడదు. ఇంటిలో ఏ తప్పు చేసినా అవి ఏమీ ఎదురు చెప్పవుకానీ... వాటి తీవ్ర ఫలితాన్ని ఆచరణ రూపంలో తిప్పికొడతాయి. అప్పుడు తట్టుకోవడం కష్టం. ఎంత మేరకు శాస్త్రాన్ని ఆమోదించేలా కట్టుకుంటామా అన్నది ముఖ్యం. కళ్ళకు గంతలు కట్టుకొని ఎక్కువ దూరం ప్రయాణించలేము కదా!

ఇంటి యజమాని దక్షిణం పోర్షన్‌లో వుండాలా? ఉత్తరం పోర్షన్‌లో వుండాలా? - డి. మధు, ఖమ్మం
ఎంత పెద్ద హోదాగల వ్యక్తికైనా... ఎంత నిరుపేదకైనా ‘కడుపు’ ఉంటుంది కదా... నేను ‘కడుపు’ అనే ఎందుకు అంటున్నాను అంటే గూటికి కూడా ఒక ‘గర్భం’ వుంటుంది. దానినే ప్రధానంగా ఎంచుకొని గృహ విభాగం చేయాలి. చాలామంది వాస్తును తెలిసిన శాస్త్రంగా చాలా చులకనగా చూస్తూ ఉంటారు. నిజానికి లోతులు దాని రీతులు, మూలాలు తెలుసుకోకుండా వాఖ్యానిస్తూ వుంటారు. కారణం మాలాంటి వాళ్లు శాస్త్రాన్ని సులభీకరిస్తూ చెపుతూ వుండటం వల్ల. కానీ, ఒక్కో సూత్రం వెనుక మానవ జీవన వైభవ సుగంధాలను నిద్రలేపే నిగూఢత్వం వాటిలో వుంటుంది. ఆధునిక జీవన రంగుటద్దాలల్లో పచ్చని చెట్టు ఎర్రగా వుందని నిర్ధారించడం లాంటిది. యజమాని ఒక నిండు పోర్షన్‌లో వుండాలి. ఆ నిండుతనం ఆ గృహాలల్లో వుందా చూడాలి. పోర్షన్ అనగానే భాగాలు వేశారు అని కదా! భాగాల మధ్య ఉండటానికి ఇల్లు ఎందుకు కట్టుకోవడం అంతకష్టపడి పూర్ణ భాగాన్ని శాస్త్రీయంగా నిర్మించుకొని యజమాని నివసించాలి. అప్పుడే ఆరోగ్య ఐశ్వర్యం.