అందం,ఆరోగ్యానికి దివ్యౌషధం పెరుగు - ప్రకృతి వైద్యం


అందం,ఆరోగ్యానికి దివ్యౌషధం పెరుగు  - ప్రకృతి వైద్యం


ఆరోగ్యాభివృద్ధికి పెరుగు చక్కని దివ్యౌషధం. ఎండాకాలంలో పెరుగు తినటం వలన మంచి జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. కడుపులో మంటను అరికడుతుంది. పెరుగు ప్రతిరోజు తీసుకోవడం వలన శరీరం దృఢత్వాన్ని, బలాన్ని సంతరించుకుంటుంది. బలమైన, చక్కని ఆరోగ్యానికి పెరుగు దివ్యమైనది. పెరుగులో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. పాలలో మీగడ తీయకుండా తయారయిన పెరుగు చాలా మంచిది.
మీగడ తీసినందున పెరుగు త్వరగా పులిసిపోవడమే కాక విలువైన పోషకాలను కోల్పోతుంది. దక్షిణాది రాష్ట్రాలలో ఉదయాన కాఫీ, టీలకు బదులుగా మజ్జిగ, పెరుగులనే ఎక్కువగా త్రాగుతుంటారు.పెరుగు చిలికి వెన్నతీసిన పుల్లని మజ్జిగ ఎండాకాలంలో చక్కని పానీయంగా పేర్కొనవచ్చు. దప్పికను అరికడుతుంది. ఉష్ణతాపాన్ని తగ్గిస్తుంది. మెదడుకు చలువను కలుగచేస్తుంది.
ఆరోగ్యాన్ని పెంపొందించే శక్తి మాత్రమేకాక సౌందర్య పోషకముగా కూడా ఉప యోగపడుతుంది. పెరుగులో చర్మాన్ని శుభ్రపరచే గుణమున్నది. శరీరంలో కండరాలను, నరాలను దృఢంగా వుంచుతుంది. చర్మానికి మృదుత్వాన్ని కలుగజేస్తుంది. వేసవిలో కమిలిన చర్మానికి సహజకాంతిని కలుగజేస్తుంది. పెరుగులోని సూక్ష్మజీవులు శరీరంకాంతిని, మృదుత్వాన్ని, నునుపును కలుగచేస్తాయి. చర్మానికి పెరుగు మర్ధన చేయడం వలన శరీరం కాంతిని సంతరించుకుంటుంది.
శిరోజాల సంరక్షణకు పెరుగు చక్కని ప్రయోజనకారి. షాంపువాడటం కంటే పెరుగు చక్కని ఫలితం కలుగచేస్తుంది. స్నానం చేయబోయే ముందు పెరుగును కుదుళ్లకు తగిలేటట్లు దట్టంగా పట్టించి పిమ్మట స్నానం చేస్తే శిరోజాలు గట్టిపడి, మృదుత్వాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించు కుంటాయి. చుండ్రును నివారించటంలో పెరుగు అమోఘంగా పనిచేస్తుంది.

ఒక కప్పు పెరుగులో ఒక స్పూన్‌ నారింజ లేక నిమ్మరసాన్ని కలిపి ఆ మిశ్రమాన్ని మెడ వెనుక భాగంలో, ముఖానికి దట్టంగా రాసి, పది నిముషాల తర్వాత మెత్తని బట్టతో తుడిచి, నీటితో కడిగిన పిమ్మట టవల్‌తో మెల్లగా అద్దాలి. ఇలా చేసినట్లయితే ముఖం, మెడ వెనుక భాగం ప్రకాశవంతమవుతుంది. సాధారణంగా యుక్తవయస్సులో వున్న స్త్రీ పురుషులకు మొటిమలు తీవ్ర అసౌకర్యాన్ని, చికాకును, మనోవ్యధను కలుగచేస్తాయి. ఈ మొటిమల బారినుండి విముక్తి పొందాలంటే పెరుగులో శనగపిండిని కలిపి వాడటం ఉత్తమం.
శనగపిండి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, పది నిముషాల తర్వాత, పరిశుభ్రమైన నీటితో కడగాలి. కొద్దిరోజులు ఇలా చేసినట్లయితే మొటిమలను దూరం చేసుకోవచ్చు. ముఖం మీద నల్లని మచ్చలు వున్నట్లయితే ముల్లంగి రసాన్ని తీసి తగినంత మజ్జిగను కలిపి ముఖానికి రాసుకొని అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి వేయాలి. త్వరలో ఫలితం కనిపిస్తుంది.
నాలుగు చుక్కలు బాదంనూనె, పన్నీరు, ఒక స్పూన్‌ మజ్జిగ కలిపి స్నానానికి ముందు శరీరానికి, మెడకు, ముఖానికి రాసుకొని అరగంట తర్వాత టవల్‌తో తుడుచుకొని స్నానం చేస్తే చర్మసౌందర్యాన్ని పెంచుతుంది.ఎండవలన చర్మం కమిలినట్లయితే, రెండు స్పూనుల టమోటా రసంలో ఐదు స్పూన్ల మజ్జిగ కలిపి రాసుకొని కొద్దిసేపయ్యాక కడిగేయాలి. నాలుగు స్పూన్ల మజ్జిగలో కొద్దిగా వెనిగర్‌ కలిపి కాళ్ళకు పట్టిస్తే బిరుసుతనాన్ని పోగొడుతుంది.
ప్రతిరోజు పెరుగును తీసుకోవడం వలన ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చు. పెరుగులో కాల్షియం, ప్రోటీన్లు, పొటాషియం, భాస్వరం, జింకు, పొలాసిస్‌ ‘బి’ విటమిన్‌లు వున్నాయి. పెరుగు సులభంగా జీర్ణమవుతుంది. విరేచనాలవు తున్నట్లయితే పెరుగు తీసుకుంటే క్రమంగా విరేచనాలు కట్టుకుంటాయి. పెరుగు కొలెస్టరాల్‌ను తగ్గిస్తుంది. పెరుగులోని ఔషధగుణాలు గుండె జబ్బులకు, క్యాన్సర్‌ వ్యాధులకు కూడా అమోఘమైనది.