గుండెల్లో నొప్పి , ఆయాసం


ఛాతీ నొప్పి, ఆయాసం


మనం ఒక్కొక్కసారి ఛాతీలో నొప్పిని, ఆయాసాన్ని అనుభవిస్తుంటాం. ఇవి గుండె, ఆహారనాళాలకు సంబంధించిన వ్యాధుల వలన మాత్రమే కాక, ఛాతీ భాగంలో ఉండే ఊపిరితిత్తుల వల్ల కూడా కలుగవచ్చు. స్థూలకాయులలోనూ, 40 సంవత్సరాలు పైబడిన వారిలోనూ, హై బిపి, మధుమేహం వ్యాధి ఉన్నవారిలో, ధూమపానం చేసే వారిలో (వీరిని హైరిస్క్‌ గ్రూప్‌ అంటారు) ఛాతీలోని నొప్పి, ఆయాసం వస్తే, గుండెకు సంబంధించిన వ్యాధులేమైనా ఉన్నాయేమో అనుమానించాలి.
ఛాతీ ప్రదేశంలో ముందు భాగంలో గుండె,వెనుక భాగంలో ఆహార నాళం కొద్దిగా ఎడమవైపు ఉంటాయి.అందుకనే మనం ఒక్కొక్కసారి ఆహారనాళంలో (ఈసోఫేగస్‌) మంటను గుండె నొప్పిగా భ్రమపడుతుంటాము. అలా ఛాతీ నొప్పిగా ఉన్నపుడు ఆహార నాళాన్ని పరీక్ష చేయించుకోవాలి. ఛాతీ భాగంలోని ఛాతీకుహరంలో ఊపిరితిత్తులు ఉంటాయి. ఛాతీలోని చర్మం, కండరాలు, ఎముకలు, ఊపిరి తిత్తుల వ్యాధులున్నా ఛాతీలో నొప్పి అనుభవమవుతుంది.
న్యుమోనియా వల్ల…
న్యుమోనియా వల్ల కూడా ఛాతీ నొప్పి వస్తుంది.ఈ వ్యాధిగ్రస్థుల్లో దగ్గు,జ్వరం ఉంటుంది.న్యుమోనియా తగ్గేంత వరకూ ఈ ఛాతీ నొప్పి ఉంటుంది. ఊపిరితిత్తుల పై పొరలో (ఫూ్లరల్‌ కేవిటీ) గాలి నిండితే న్యూమోథొరాక్స్‌, నీరు నిండితే ప్లూరల్‌ ఎఫ్యూజన్‌, అనే వ్యాధులు వచ్చినా ఛాతీలో నొప్పి ఉంటుంది. ఈ వ్యాధులు నెమ్మదిగా రావచ్చు. లేదా హఠాత్తుగా సంభవించవచ్చు. దీంతో నొప్పితో పాటుగా ఛాతీ బరువు కూడా అనిపిస్తుంది. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది.
శ్వాస నాళాలకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలలో (పల్మొనరి ఆర్టరీస్‌) రక్తం కొన్ని సందర్భాలలో గడ్డకడుతుంది. ఈ గడ్డలు పెద్దవిగా ఉంటే రక్త నాళాల్లో అడ్డుపడతాయి.
అప్పుడు ఆ రక్తనాళం ఏయే ప్రాంతాలకు రక్తాన్ని సరఫరా చేయాలో ఆ ప్రాంతాలకు రక్త సరఫరా నిలిచిపోతుంది.అటువంటి సమయంలో ఆ భాగాలు దెబ్బతింటాయి. దీనిని పల్మొనరీ ఇన్‌ఫెక్షన్‌ అని అంటారు. దీనిలో ఛాతీ నొప్పి, ఆయాసం దగ్గుతో పాటుగా రక్తం పడుతుంది. సరైన చికిత్స లేకుండా ఈ స్థితి కొనసాగితే శరీరంలో ఆక్సిజన్‌ సరఫరా తగ్గి క్రమంగా రక్తపోటు పడిపోతుంది. ఫలితంగా ప్రాణాపాయ స్థితి సంభవిస్తుంది. ఊపిరితిత్తులకు సోకే క్యాన్సర్‌, అడినోమా వ్యాధిలో ప్రారంభ దశ నుంచి నొప్పి మందంగా ఉంటుంది. పూర్తి స్థాయిలో చికిత్స చేస్తే తప్ప నొప్పి తగ్గదు.
సిగరెట్లు తాగే వారిలో…
దీర్ఘకాలంగా సిగరెట్లు తాగే వారిలో శ్వాసనాళాలలో అడ్డంకి ఏర్పడుతుంది.దీనిని క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ ఎయిర్‌వే డిసీజ్‌ అంటారు.ఈ వ్యాధికి గురైన వారు అస్తమాతో బాధపడుతున్న వారు బరువుగా ఊపిరి తీసుకుంటూ ఉంటారు. ఫలితంగా కండరాలు అలిసిపోయి మెడ, గొంతు, ఛాతీ, కడుపు కండరాలు నొప్పి పెడతాయి.మనం తీసుకున్న ఆహారం జీర్ణకోశంలోకి వెళ్లడానికి ఆహార నాళంలో పెరిస్టాటిక్‌ కదలికలు ఉపయోగపడతా యి. ఉదరవితానం (డయాఫ్రం) కూడా శ్వాసక్రియలో పైకి కిందకు జరుగుతూ దాని ప్రభావాన్ని ఆహారనాళంపై చూపుతుంటుంది. ఆస్తమా, క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ ఎయిర్‌వే డిసీజ్‌లు ఉన్న వారిలో ఉదరవితానం కిందకు, జీర్ణాశ యం మీదకు జారిపోయి హయాటస్‌ హెర్నియా వస్తుంది. కడుపులోని ఆమ్లాలు ఛాతీలోకి నెట్టబడతాయి. ఈ కారణంగా ఆహారనాళంలో మంట, నొప్పి వస్తాయి. దీనిని కూడా మనం ఛాతీ నొప్పిగా భ్రమపడుతుంటాం.
ప్రమాదం జరిగినప్పుడు…
ఏదేని ప్రమాదానికి గురైనప్పుడు ఛాతీ ఎముకలు విరిగి, అవి ఊపిరితిత్తులలో గుచ్చుకోవచ్చు. అప్పుడు ఊపిరితిత్తుల నుంచి గాలి, రక్తం బైటకు రావచ్చు. ఎముకలు విరగకపోయినా, ఛాతీకి మూగ దెబ్బలు తగలడం వలన ఊపిరితిత్తులు వత్తుకుపోయి పల్మొనరీ కంట్యూషన్‌ స్థితి రావచ్చు. అప్పుడు ఛాతీలో నొప్పి. దగ్గులో రక్తం పడుతాయి. రోడ్డు ప్రమాదాలలో ఛాతీ వత్తుకుపోయి, పైకి కనిపించని దెబ్బలు తగిలి రక్తనాశాలు, శ్వాసనాళాలు దెబ్బతిని ప్లూరల్‌ కేవిటీలో రక్తం, గాలి జమకూడవచ్చు. ఫలితంగా హీమోథొరాక్స్‌ కాని, న్యూమోథొరాక్స్‌ కాని రావచ్చు. లేదా రెండూ రావచ్చు. రక్తం మామూలుగా ప్రవహించే ప్రాంతాలలో కాకుండా, కొత్త ప్రాంతాలలో చేరితే ఆ భాగంలో ఇన్‌ఫెక్షన్‌ రావచ్చు. పయోథొరాక్స్‌ అనే స్థితి కలిగి చీము ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో ఛాతీలో నొప్పి ఉంటుంది.
గుండె వ్యాధులున్న కొందరికి కాళ్లలో నీరు చేరి వాపులు కనబడతాయి. ఇటువంటి వారు పడుకున్నప్పుడు ఆ నీరు గుండెలోకి చేరుతుంది. అక్కడ నుంచి ఊపిరితిత్తులకు చేరుతుంది. ఈ స్థితిని ఆర్ధోప్నియా అంటారు. అప్పుడు ఆయాసం, ఊపిరి భారమై రోగికి నిద్రాభంగమవుతుంది. దీనిని పెరాక్సిస్మల్‌ నాక్టర్నల్‌ డిసీజ్‌ అంటారు. ఊపిరితిత్తుల వ్యాధులుంటే ఆయాసంతో పాటు పొడి దగ్గు ఉంటుంది. వీరిలో రాను రాను తలదువ్వుకోవడం వంటి చిన్న పనులు చేసినా ఆయాసం ఎక్కువతుంది. ఊపిరితిత్తులలో పారంకైమా కణాలుంటాయి. వాటిలో అల్వియోలైలు ఉంటాయి. వాటి చుట్టూ ఇంటర్‌స్టీషియమ్‌ అనే పొర ఉంటుంది. ఇది దెబ్బ తినడం వలన ఇంటర్‌స్టీషియల్‌ లంగ్‌ డిసీజ్‌ రావచ్చు. ఇది ప్రైమరీ, సెంకడరీ అని రెండు రకాలుగా ఉంటుంది. ఏ కారణం తెలియకుండా ఈ వ్యాధి సోకితే ప్రైమరీ అనీ, ఏదో ఒక కారణం వలన వస్తే సెకండరీ అని అంటారు. ఈ రెండింటిలోనూ ఆయాసం ఎక్కువగా ఉంటుంది.
ఊపిరితిత్తులలోని పారంకైమా కణాలు క్షయ వంటి వ్యాధులు సోకినప్పుడు దెబ్బ తింటుంటాయి. ఆ వ్యాధి తగ్గినా, దాని వలన కలిగే మచ్చల వలన ఊపిరితిత్తులలో కొంతభాగం దెబ్బతిని, మిగిలిన భాగం మీద ఒత్తిడి ఎక్కువై ఆయాసం వస్తుంది. అలాగే శ్వాసనాళాలు కఫంతో మూసుకునిపోవడం వలన శ్వాస సరిగ్గా అందక ఆయాసం వస్తుంది. ఏదైనా పదార్థం ఊపిరితిత్తులలోకి వెళితే శ్వాసనాళాలలో అడ్డంపడి ఊపిరి అందక ఆయాసం వస్తుంది.
లింఫోమా, క్షయ, వ్యాధులలో లింఫ్‌ నోడ్స్‌ పెరుగుతాయి. అవి ఊపిరితిత్తుల మీద వత్తిడిని కలిగించి, శ్వాస నాళాలు మూసుకుపోయేలా చేస్తాయి. ఫలితంగా ఆయాసం వస్తుంది. ఎపిగ్లాటిస్‌కు ఇన్‌ఫెక్షన్‌ వచ్చినా కోరింత దగ్గు వచ్చినా, ఎడతెరిపి లేని దగ్గుతో ఆయాసం వస్తుంది. లారింజో ట్రేకియో బ్రాంకైటిస్‌. ఎక్స్‌ట్రిన్సిక్‌ ఎలర్జిక్‌ ఆల్వియోలైటిస్‌, ధూమపానం వనల సోకే బ్రాంకైటిస్‌లతో కూడా ఆయాసం వస్తుంది.స్థూలకాయులలో ఊపిరి తీసుకున్నప్పుడు ఛాతీ పెరుగుదల ఆశించినంత ఉండకపోతే ఆయాసం కలుగుతుంది. నరాలకు, ఛాతీ కండరాలకు సంబంధించిన పోలియో మెలైటిస్‌, మయస్థీనియా గ్రావిస్‌, సెర్వికల్‌ సై్పనల్‌ కార్డ్‌ గాయాలు మొదలైన వాటిలో నరాలు, కండరాలు బలహీనమై ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఫలితంగా ఆయాసం కలుగుతుంది.

కొంతమంది ముక్కు దిబ్బడ వేసి ఊపిరాడక ఇబ్బంది పడుతుంటారు. దీనికి, శ్వాసావయావాలు ఇబ్బందుల వలన ఊపిరి ఆడక పోవడానికి తేడా ఉంది. ఆవిరి పడితే లోపలి తేమ పలుచనై, అడ్డంకి తొలగిపో తుంది. శ్వాసావయ వాల లోపాల వలన కలిగే ఊపిరి ఇబ్బందు లు ఆ అనారోగ్యాన్ని తగ్గిస్తే తొలగుతాయి.

-ఛాతీకి తీసే స్కాన్‌ పరీక్షను భోజనం ముందు లేదా తరువాత కూడా చేయించుకోవచ్చు.
-ఛాతీలో ఇంటర్‌కాస్టల్‌ ట్యూబ్‌ ఉన్నవారు నిలబడినా, కూర్చున్నా, పడుకున్నా బ్యాగ్‌ ఒక మీటరు క్రిందకే ఉండేటట్లు చూసుకోవాలి. దాన్ని చేత్తో పట్టుకొని కాలకృత్యాలకు కూడా వెళ్ళవచ్చు.
- ఆస్తమా ఉన్న చిన్న పిల్లలను స్వేచ్ఛగా ఆడుకోనివ్వాలి. అన్ని పోషకాహార పదార్థాలు ఇవ్వాలి. వారికి వ్యాధి నిరోధకత, పెరుగుదల ముఖ్యం.
- దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే గాలి తుంపర్లలో వైరస్‌, బాక్టీరియాలు ఉంటాయి. అవి దగ్గినపుడు ఇతరులకు వ్యాపిస్తాయి, కాబట్టి విధిగా మోహానికి రుమాలు అడ్డం పెట్టుకోవడం మంచిది.
- ఛాతీలోని నీరు, చీము పరీక్ష కోసం నొప్పి తెలియకుండా మత్తు మందు (లోకల్‌ ఎనస్తీషియా) ఇచ్చి తీస్తారు.
-ప్రాణాయామ, ఈత వంటివి ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడే వ్యాయామాలు.
-డాక్టర్‌ బి.శ్యామ్‌ సుందర్‌ రాజ్‌, పల్మనాజలిస్ట్‌. 

శ్రేష్ట హాస్పిటల్స్