శేషాద్రి
గరుడాద్రి
వేంకటాద్రి
నారాయణాద్రి
వృషాద్రి
అంజనాద్రి
వృషభాద్రి
శేషశైల ం, గరుడాద్రి, వేంకటాద్రి, నారాయణాద్రి, అంజనాద్రి, వృషాద్రి, వృషభాద్రి అనే ఏడుకొండల సమాహారమే తిరుమల దివ్యక్షేత్రం. అందువల్లే ఇక్కడ కొలువైన స్వామిని, ఏడుకొండల వాడని, సప్తగిరీశుడని పిలుస్తుంటారు. ఏడుకొండల పేరుతో శ్రీశైలపతి, శేషాచలపతి, గరుడా చలపతి, వేంకటా చలపతి, నారాయణుడు, వృషాచలపతి, వృషభాద్రిపతి అని కూడా అంటారు. తిరుమలేశుడు ఇలా ఎన్ని పేర్లున్నా ఏడుకొండల వాడా అని పిలిస్తేనే ఆ స్వామికి ఇష్టం. భక్తులు ఏడుకొండల వాడా, వేంకట రమణా గోవిందా గోవిందా.. అని ఆర్తిగా పిలుస్తారు. స్వామివారు వెల్లకిలా పడుకొని వున్న ఆకృతిలో కనిపించే, స్వామివారు వేంచేసి వున్న, స్వామికి ఇష్టమైన ఏడుకొండలను గురించి క్లుప్తంగా తెలుసుకొందాం.
శేషాద్రి
ఈ కొండను పరిశీలనగా చూస్తే శ్రీ మహావిష్ణువు పాన్పు అయిన ఆదిశేషుని ఆకారంలో వుంటుంది. ఆదిశేషుడు శ్రీమహావిష్ణువుకి పాన్పుగా, పీఠంగా, గొడుగుగా సేవిస్తూ ఉంటాడు. ఒకానొకప్పుడు ఈ ఆదిశేషునికి, వాయుదేవునికి మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అన్న వివాదం ఏర్పడి 'నీకు శక్తి ఉంటే నన్ను కదల్చు' అంటూ ఆదిశేషుడు వేంకటాచలాన్ని చుట్టుకుంటాడు. వాయుదేవుడు పర్వతాన్ని చుట్టుకున్న ఆదిశేషుణ్ణి బలంగా విసరివేయగా పర్వతంతో పాటు ఇక్కడ వచ్చి పడతాడు. ఓడిపోయిన కారణంగా చింతతో ఉన్న ఆదిశేషుణ్ణి శ్రీనివాసుడు ఓదారుస్తూ నిన్ను నేను ఆభరణంగా ధరిస్తానని, ఈ క్షేత్రం నీ పేరుతో ప్రసిద్ధి చెందేలా వరమిస్తానని ఊరడించాడు. ఆనాటి నుండి ఇది శేషాచలం అనీ శేషాద్రి అనే పేర్ల ను పొందడమే గాక, శ్రీనివాసుడు శేషాచలపతి నామధేయంతో నాగాభరణుడై విలసిల్లుతున్నాడు.
గరుడాద్రి
సహజసిద్ధంగా గరుడ ఆకారంలో ఏర్పడిన కొండ ఇది. శ్రీమహావిష్ణువు హిరణ్యాక్షుని ఆదివరాహరూపంతో సంహ రించి భూదేవిని ర క్షించిన పిదప గరుత్మం తుని పిలిచి శ్రీవైకుంఠానికి వెళ్లి తన క్రీడాద్రిని తెమ్మని ఆదేశిస్తాడు. గరుత్మంతుడు తెచ్చినం దువల్లే ఇది గరుడాచలం అని, గరుడాద్రి అని ప్రసిద్ధి పొందింది.
వేంకటాద్రి
వేం అనగా సమస్త పాపాలను, కట: దహించునది అనగా పాపరాశులను భస్మం చేసేది కనుక ఈ దివ్యక్షేత్రాన్ని వేంకటాచలం అని పిలుస్తున్నారు. వేం అమృతత్వాన్ని, కట: ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నందువల్ల కూడా ఈ క్షేత్రం వేంకటాద్రి అని కూడ పేరు పొందింది. అందువల్లే స్వామి వేంకటేశ్వరుడనే పేరు పొందాడు.
నారాయణాద్రి
పూర్వం ఒకానొకప్పుడు నారాయ ణుడు అనే భక్తుడు స్వామి పుష్కరిణీ తీరాన తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన వేంకటాచలపతి వరం కోరుకొమ్మని చెప్పగా నారాయణుడు ఈ క్షేత్రం తన పేరుతో ప్రసిద్ధి పొందాలనీ, అందులో శ్రీనివాసుడు ప్రత్యక్షంగా భక్తులకు దర్శనమివ్వాలనీ ప్రార్ధిస్తాడు. ఆ భక్తుని కోరిక మేరకు ఈ పర్వతం నారాయణాద్రి అనీ, నారాయణాచలం అని పేరు పొందింది.
వృషాద్రి
వృషాద్రి, వృషభాద్రి రెండు సమానార్ధకాలుగా స్వీకరించి వృషభాసుర వృత్తాంతం వల్ల ఆ పేర్లు ఏర్పడ్డాయని కొందరు అంటారు. ప్రత్యేకంగా వృషాద్రి అనే పేరుతో కూడా ఈ పర్వతం ప్రసిద్ధి పొందింది. వృషమనగా ధర్మం. ధర్మదేవత తన అభివృద్ధికై ఈ పర్వతంపై తపస్సు చేసినందువల్ల వృషాద్రి అని పేరు కలిగింది.
అంజనాద్రి
త్రేతాయుగం నాటి గాథ ఇది. కేసరి అనే వానర రాజు ఉండేవాడు. ఆయన భార్య అంజనాదేవి. ఈమెకు సంతానం లేనందువల్ల చి ంతిస్తూ మాతంగు ముని దగ్గరికి వెళ్లి, తన బాధను వెళ్లబోసుకుంది. వెంటనే మాతంగుడు ఆలోచించి ఇలా అన్నాడు.
'అమ్మా పంపానదికి తూర్పు దిక్కున ఐదువందల యోజనాల దూరంలో నారసింహక్షేత్రం ఉంది. దానికి దక్షిణ దిక్కునే నారాయణగిరి క్షేత్రం. ఆ క్షేత్రంలో స్వామి పుష్కరిణి అనే పవిత్రమైన తీర్ధాజలం వెలసివుంది. ఆ కోనేటికి ఉత్తర దిక్కున ఒక క్రోశం దూరంలో ఆకాశగంగ అనే పవిత్ర తీర్ధం నెలకొని వుంది.
అందులో ప్రతి దినం స్నానం చేస్తూ పన్నెండేళ్లపాటు తపస్సు చేస్తూ ఉండు. నీకు తప్పక గుణవంతుడు, శ్రేష్టుడు, అనంత బలశాలి, సర్వలోక ప్రసిద్ధుడు అయిన పుత్రుడు కలుగుతాడు' అంటూ ఆశీర్వదించి పంపాడు.
మాతంగ ముని ఆదేశానుసారం అంజనాదేవి వేంకటాచల క్షేత్రాన్ని చేరుకుని స్వామి పుష్కరిణిలో స్నానం చేసింది. ఆ పుష్కరిణీ తీరంలో ఉండే అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేసి, ఆ పక్కనే వున్న శ్రీవరాహస్వామిని దర్శించింది. పిదప ఆకాశగంగ తీర్ధానికి చేరుకుని, అక్కడ ఉపవాస దీక్షతో వ్రతమాచరించింది.
ఇలా ఒక సంవత్సరం గడిచిన తర్వాత, వాయుదేవుడు ప్రతిరోజూ ఒక ఫలాన్ని ఆమె చేతిలో ఉంచుతుండగా ఆమె దానిని తింటూ తపస్సు కొనసాగిస్తూ వుంది. ఒకానొక రోజు వీర్యంతో నిండిన ఫలాన్ని వాయుదేవుడు అంజనాదేవికి ప్రసాదించినాడు. ఆమె యధాప్రకారంగా ఆకలితో ఆ ఫలాన్ని ఆర గించగా గర్భవతి అయింది. పది మాసాల తర్వాత ఆమెకు పుత్రుడు కలిగాడు. అతడే ఆంజనేయుడు. హనుంతుడు అనే పేర్లతో జగత్ప్రసిద్ధుడై చిరంజీవిగా వెలిసినాడు. అందువల్లే ఈ పర్వతం అంజనశైలం అనీ, అంజనాద్రి అని, అంజనాచలం అనీ ప్రసిద్ధిని పొందింది.
ఇలా ప్రసిద్ధమైన ఈ ఏడు పేర్లతో ఆయా ఆకారాలతో ఏడు కొండలు ఏర్పడినందువల్ల ఈ దివ్యక్షేత్రం సప్తగిరి శైలమనీ, ఏడుకొండల క్షేత్రమనీ పేరొందింది.
వృషభాద్రి
పూర్వం వృషభాసురుడు అనే శివభక్తుడు బలగర్వితుడై విశృంఖలంగా సంచరించేవాడు. దుష్టుడై లోక కంటకుడుగా విహరిస్తున్న వృషభుడు కిరాత వేషధారియైన శ్రీహరితో యుద్ధా నికి తలపడ్డాడు. ఆ ఘోర యుద్ధంలో చిట్టచివరకు శ్రీనివాసుడు సుదర్శన చక్రాన్ని వానిపై ప్రయోగించాడు. ఎదురులేని సుదర్శనాయుధంతో తనకు చావు తప్పదని భావించిన వృష భుడు శ్రీమహావిష్ణువును ఇలా ప్రార్థించాడు.
ఆద్య ప్రభృతి చాయం వై గిరి రుచ్ఛిత శేఖర:
మదాఖ్యయా ప్రధాం యాతు వృషభాచల ఇత్యపి.
పరంధామా నన్ను సంపూర్తిగా క్షమించవలసింది. పర మాత్మా! నీ చేతిలో అందులోను నీ సుదర్శన చక్రా యుధంతో మరణించడం నా మహద్భాగ్యంగా భావిస్తున్నాను. కాని నాదొక కోరిక. నా ఈ చివరి కోరికను తీర్చగల కరుణా మయుడవు నీవు. ఇక్కడే ఈ పర్వతం మీదే వెలసి నీవు వుంటావు కదా.
మరి నీవు ఉన్న ఈ పర్వతం వృషభాచలం అని నా పేరుతో ప్రసిద్ధమగునట్లు అనుగ్రహించవలసింది. అంటూ కన్నుల నిండుగా నీళ్లు కారుతుండగా భక్తి ప్రపత్తులతో శరణువేడుతూ అభ్యర్ధించాడు. వృషభాసురుని ప్రార్ధనను ఆల కించిన భగవానుడు వృషభాసురా! నీవు కోరినట్లుగా అవుతుంది. నేటినుంచి ఈ పర్వతం వృషభాద్రి పేరుతో ప్రసిద్ధి పొందుతుంది. అంటూ తన సుదర్శన చక్రంతో రాక్షసుని వధించాడని బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది.