మర్మావయవాల వద్ద వచ్చే ఫంగస్ - రకరకాల ఫంగస్‌లు



‘‘నీళ్లలో తడిసినంత మాత్రాన మొక్క మొలవవులే...!’’ చినుకుకు వెరచే స్నేహితులపై విసిరే చెణుకు ఇది. కానీ... నీళ్లలో తడిస్తే మొక్క కాని మొక్క మొలిచేందుకు ఛాన్స్ ఉంది. అది చర్మంపైనా లేదా వెంట్రుకలపైనా లేదా గోరుపైనైనా కావచ్చు. ఆరీ ఆరని దుస్తులు ధరించేవారిలో చెప్పుకోలేనిచోట ఒరుసుకుపోయినట్లుగా కావడం, కొందరిలో వెంట్రుకలు రాలి ప్యాచ్‌లు పడటం, గోరు పుచ్చినట్లుగా కావటం... ఇవన్నీ నీటిచెమ్మతో ఆయా అవయవాలపై మొలిచే మొక్క కాని మొలకలే. అదే... ఫంగస్. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌పై అవగాహన కోసం ఈ కథనం. 
ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కడైనా రావచ్చు. అందుకే వీటిని యుబిక్విటస్ అంటారు. ఇందులో చర్మంపై వచ్చే డర్మటోఫైటోసిస్ తరహా ఫంగస్‌లన్నింటినీ కలిపి ‘టీనియా’ అనే పేరుతో వ్యవహరిస్తుంటారు.

రకరకాల టీనియాలు (ఫంగస్‌లు)...

టీనియా ఫేషియాలిస్ అనే ఫంగస్ ముఖంపైనే వస్తుంటుంది. ఇది సాధారణంగా పెంపుడుజంతువులతో చాలా దగ్గరగా మెలిగేవారిలోనూ, దీర్ఘకాలికంగా స్టెరాయిడ్స్ తీసుకుంటున్నవారిలోనూ ఎక్కువ.

మాడుపైనా, మాడుపై ఉండే వెంట్రుకలు వచ్చే ఫంగస్‌ను ‘టీనియా క్యాపిటిస్’ అంటారు. అలాగే మరో రకం ఫంగస్ గడ్డంలో వస్తుంది. దీన్ని ‘టీనియా బార్బే’ అంటారు.

టీనియా మ్యాన్యువమ్: ఇది చేతులకు వచ్చే ఇన్ఫెక్షన్. ముందుగానే టీనియా పీడిస్ ఉంటే చేతులకూ టీనియా మ్యాన్యువమ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. చేతులపై దురద ఉంటుంది. ఇన్ఫెక్షన్ సోకిన చోట అంచులు స్పష్టంగా కనిపిస్తూ, మధ్యన ఉండే చర్మం బాగానే ఆరోగ్యంగా ఉంటుంది. అరచేతుల వెనకవైపునకు వ్యాపిస్తుంటుంది. అరచేతి గీతల్లో పొలుసుల్లాగా కనిపిస్తుంటాయి. దీనికి పూతమందులు పనిచేయవు. నోటిద్వారా ఇట్రాకోనజోల్, ఫ్లూకోనజోల్ వంటి మందులు తీసుకోవాలి.

క్యాండిడియాసిస్... ఇది ‘ఈస్ట్’ తరహా ఫంగస్‌తో వచ్చే ఇన్ఫెక్షన్. ఇది సాధారణంగా నోటిలోనూ లేదా మర్మావయవాల ప్రాంతంలోనూ, చర్మం ముడుతలు పడేచోట కనిపిస్తుంది. ఆ ప్రాంతాల్లో ఎప్పుడూ తడిగా ఉండటం, చెమట పడుతూ ఉండటం వల్ల ఇది వస్తుంది. క్యాండిడా అల్బికన్స్ అనే తరహా ఫంగస్ మన నోటి నుంచి మలద్వారం వరకు ఉండే మార్గం (గాస్ట్రో ఇంటస్టినల్ ట్రాక్)లో కాలనీలుగా ఏర్పాటు చేసుకుని నివసిస్తుంటుంది. సాధారణంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తగ్గేందుకు యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడే వారిలో దీని తీవ్రత పెరుగుతుంది. స్థూలకాయం, డయాబెటిస్, ఎయిడ్స్, చెమటలు ఎక్కువగా పట్టే లక్షణం, ఎండోక్రైన్ సమస్యలు, స్టెరాయిడ్స్ వాడటం, దీర్ఘకాలిక జబ్బులు వంటివి ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. చర్మం ఎర్రబారడం, దోక్కుపోయినట్లుగా ఉండటం వంటి లక్షణాలతో పాటు మహిళలు కొందరిలో రొమ్ముల కింద ఎర్రబారినట్లుగా ఉండే లక్షణాలతో కనిపిస్తుంటుంది.
టీనియా కార్పొరిస్: ఇది పాదాలు, చేతులు, మర్మావయవాలు మినహా శరీరంలో ఎక్కడైనా వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్. అన్ని వయసుల వారిలో కనిపిస్తుంది. సాధారణంగా పాడి పశువులు, పందులను పెంచేవారిలో ఎక్కువగా వస్తుంది. ఇది ట్రైకోఫైటాన్ రూబ్రమ్ అనే ఫంగస్ వల్ల వస్తుంది. ఇది వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించకపోవచ్చు. అయితే కొద్దిగా దురదతో పాటు చాలా కేసుల్లో చిన్నవి నుంచి పెద్దగా ఉండే ఎర్రటి, గుండ్రటి, అంచులు ఉబ్బినట్లుగా ఉండే ప్యాచ్‌లు కనిపించవచ్చు. ఇలా వచ్చే రింగులు ఒకదానితో మరొకటి కలిసేంతగా వ్యాపిస్తే అవి పెరిగి పెద్దగా మారవచ్చు. పగుళ్లు, గడ్డల వంటివి (బ్లిస్టర్స్ అండ్ గ్రాన్యులోమా) వంటివీ కనిపిస్తాయి. వీటినే మాజోచీస్ గ్రాన్యులోమా అంటారు. కొన్నిసార్లు అంతగా ప్రకాశవంతంగా లేని వెండిరంగులో ఉండే సోరియాసీ ఫార్మ్ మచ్చలు కనిపించవచ్చు.

గోళ్లకు వచ్చే ఫంగస్... 
టీనియా అన్‌గ్యువమ్: ఇది గోరు (నెయిల్ ప్లేట్) కు వచ్చే ఒకరకం ఫంగస్. ట్రైకోఫైటాన్ రూబ్రమ్, ట్రైకోఫైటాన్ మెన్‌టాగ్రోఫైట్స్, ఎపిడెర్మోఫైటాన్ ఫ్లకోజమ్ వంటి రకాల వల్ల ఇది వస్తుంది. ఈ రకం ఫంగస్‌లో అది గోరుకు ఇరువైపుల ఉండే, గోరుపైకి వచ్చిన చర్మం ముడుతల నుంచి వ్యాపిస్తుంది. క్రమంగా గోరు తన పారదర్శకతను కోల్పోతుంది. కొందరిలో శిథిలం అవుతుంది. కట్ చేసినప్పుడు తెగక పొట్టుగా రాలుతుంది. యుక్తవయసు దాటినవారిలో కనిపిస్తుంది. బలహీనమైన గోళ్లు ఉన్నవారికి ఇది వచ్చే అవకాశం ఎక్కువ. ఇందులో డిస్టల్ అండ్ ల్యాటరల్ సబ్ అన్‌గ్యువల్ ఒనైకోమైకోసిస్, సూపర్‌ఫీషియల్ వైట్ ఒనైకోమైకోసిస్, ప్రాక్సిమల్ సబ్ అన్‌గ్యువల్ ఒనైకోమైకోసిస్ వంటి కొన్ని రకాలు ఉన్నాయి. త్వరగా చికిత్స తీసుకోవడం వల్లనే ప్రభావం ఉంటుంది. పూత మందులు పనిచేయవు. ఇట్రాకొనజోల్, టెర్బినాఫిన్ వంటి మందులు వాడాలి.

కాళ్లకు వచ్చే ఫంగస్

టీనియా పెడిస్: దీన్ని సాధారణ పరిభాషలో ‘అథ్లెట్స్ ఫూట్’ అని వ్యవహరిస్తుంటారు. ఆటలాడే వయసున్న పిల్లల్లో లేదా యుక్తవయస్కుల్లో ఇది కనిపించడమే దీనికి కారణం. అయితే అరుదుగా 50 ఏళ్ల వయసు వారిలో కూడా కనిపిస్తుంది. అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లోనే ఎక్కువ. చాలా బిగుతైన పాదరక్షలు వాడేవారిలో లేదా పాదాలకు ఎక్కువగా చెమట పట్టేవారిలో ఇది ఎక్కువ. దురద ఉంటుంది. ఇది రెండురకాల లక్షణాలతో కనిపిస్తుంది. ఇది వచ్చినప్పుడు పాదానికి పొట్టురాలినట్లుగా చర్మం రాలవచ్చు లేదా కాలి బొటనవేలి కింద పగులు లాగా రావచ్చు. సాధారణంగా కాలివేళ్లలో నాలుగు, ఐదో వేలి మధ్యలో కనిపిస్తుంటుంది. ఎక్కువగా నీళ్లలో ఉండేవారిలో కనిపిస్తూ ఉంటుంది.

ఇందులో రెండు రకాలు ఉంటాయి. మడమకూ, మడమ అంచులకు మాత్రమే పరిమితమైతే దాన్ని ‘మోకాసిన్ టైప్’ అని వ్యవహరిస్తారు. ఒకవేళ పాదం / మడమ అంతటా నీటి బుడగలు, తిత్తులు వంటివి కనిపిస్తే దాన్ని ‘బుల్లస్ టైప్’ అంటారు.

నివారణ/ చికిత్స
ఇవి కనిపించినప్పుడు తగ్గడానికి కాస్తంత వదులుగా ఉండే పాదరక్షలు ధరించడం, స్నానం తర్వాత పాదాలను బెంజోల్ పెరాక్సైడ్‌తో శుభ్రంగా కడిగడం వంటి జాగ్రత్త/చికిత్సలతో దీన్ని తగ్గించవచ్చు. ఇక క్లోట్రైమజోల్, మైకోనజోల్, కీటోకొనజోల్, ఎకోనజోల్ వంటి పూతమందులతో కూడా చికిత్స చేయవచ్చు.


మర్మావయవాల వద్ద వచ్చే ఫంగస్

టీనియా క్రూరిస్ (ధోబీస్ ఇచ్): ఇది మర్మావయవాల ప్రాంతంలో కనిపించే ఫంగల్ ఇన్ఫెక్షన్. దీన్నే సాధారణ పరిభాషలో ‘ధోబీస్ ఇచ్’ లేదా ‘జాక్ ఇచ్’ అంటారు. మర్మావయవాల ప్రాంతంలో మచ్చలా వచ్చి బాధిస్తుంటుంది. అక్కడ చెమటలతో తడిగా, పచ్చిగా ఉండే వాతావరణం వల్ల ఇది వస్తుంది. సాధారణంగా చాలా బిగుతైన దుస్తుల వల్ల లేదా స్థూలకాయంతో బట్టలు బిగుతుకావడం వల్ల, దీర్ఘకాలంగా కార్టికోస్టెరాయిడ్స్ వాడుతుండటం వల్ల రావచ్చు. డయాబెటిస్ ఉంటే అది దీన్ని ప్రేరేపించే అవకాశం ఎక్కువ. నెలల నుంచి ఏళ్ల పాటు బాధిస్తుంటుంది. పాదాలకు ఫంగస్ (టీనియా పెడిస్) ముందే ఉన్నవారిలో... ఇది వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ. మర్మావయవ ప్రాంతాల్లో ఎర్రటి స్పష్టమైన ప్యాచ్‌తో కనిపిస్తూ, దురదలు పెట్టే లక్షణం ఉండటం వల్ల రోగులకు చాలా ఇబ్బందిని, అసౌకర్యాన్ని కలగజేస్తుంది. గజ్జల నుంచి తొడలపైకీ, ఒక్కోసారి పిరుదులపైకీ పాకవచ్చు. అయితే వృషణాల సంచిపైకిగాని లేదా పురుషాంగంపైకి గాని పాకే అవకాశాలు చాలా అరుదు.

మర్మావయవాల వద్ద వచ్చే క్యాండిడియాసిస్: ఇది మహిళల్లో యోని ప్రాంతంలోనూ, పురుషుల్లో పురుషాంగం ఉన్న చోట కనిపించే ఒక రకం ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇందులో వల్వెటిస్, వల్వోవెజినైటిస్, బెలనైటిస్, బెలనోపోస్థైటిస్ వంటి రకాలు ఉన్నాయి. పూతమందులతో తగ్గే అవకాశాలున్నాయి. నోటిద్వారా తీసుకోవాల్సిన మందులు కూడా వాడవచ్చు.

శోభి మచ్చలు 
వీటిని వైద్యపరిభాషలో పిటిరియాసిస్ వెర్సికోలర్ అంటారు. కొందరిలో ఈ శోభిమచ్చలు చాలా దీర్ఘకాలం పాటు కనిపిస్తాయి. నొప్పి, బాధ లేకపోయినా అసహ్యంగా కనిపిస్తాయి. ‘మలాసెజియా ఫర్‌ఫర్’ అనే ఫంగస్ వల్ల వస్తాయి. ఎక్కువ వేడి వాతావరణంలో ఉండేవారిలో, ఎక్కువగా చెమటలు పట్టి, ఆరకుండా ఉండేవారిలో, జిడ్డు చర్మం ఉండేవారిలో ఇవి ఎక్కువ. కొద్దిపాటి దురదలు కనిపిస్తాయి. ఒక్కోసారి పొలుసుల్లా రాలిపోతూ ఉండవచ్చు. ఛాతీ, భుజాలు, మెడ, వీపు, పొట్ట, కొందరిలో మర్మావయవాల ప్రాంతాలు, తొడల వంటి చోట్ల కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి. వుడ్‌ల్యాంప్‌లో చూసినప్పుడు ఇవి నీలి, ఆకుపచ్చ మెరుపుతో కనిపిస్తాయి. దీనికి కీటోకోనజోల్ షాంపూలు వాడటం, కీటోకోనజోల్ క్రీమ్, క్లాట్రిమాజోల్ క్రీమ్ వంటి పూతమందులతో పాటు నోటి ద్వారా తీసుకునే ఇట్రికోనజోల్, ఫ్లూకోనజోల్ వంటి మందులు ఉపయోగపడతాయి.