అష్టైశ్వర్య ప్రదాయినికి నీరాజనం...! వరలక్ష్మి వ్రతకథ, వ్రతం చేసుకునే విధానం





మస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే,
శంకచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే
నమస్తే గరుడారూడే కోలాసుభయంకరి,
సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే
సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి,
సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే
సిద్ధిబుద్ధి ప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే
ఆద్యన్తరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి
యోగజే యోగసంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే
స్థూలసూక్ష్మ మహారౌద్ర మహాశక్తి మహోదరే,
మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే
పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి,
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే
శ్వేతమ్బరధరే దేవి నానాలంకార భూషితే,
జగత్థ్సతే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే
మాలక్ష్మ్య ష్టకస్తోత్రం యః పఠేద్భక్తిమాన్నరః
సర్వసిద్ధిమవాప్నొతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా
ఏక కాలే పఠేనిత్యం మహాపాపవినాశనమ్,
ద్వికాలం యః పఠేనిత్యం ధనధాన్యాసమన్వితః
త్రికాల యః పఠేనిత్యం మహాశత్రువినాశనమ్,
మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా.
****



మహిళలంతా భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఏకైక వ్రతం వరలక్ష్మీ వ్రతం. శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకుంటారు.

మహా మాయా రూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ చక్ర గదాయుధాలను ధరించిన మహాలక్ష్మీ దేవి అష్ట ఐశ్వర్య ప్రదాయిని. అష్ట సంపదలను అందించే జగన్మంగళదాయిని. అష్ట లక్ష్మి రూపాన్నే వరలక్ష్మీ దేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించినవారికి, కొలిచినవారికి కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి.

స్కాంద పురాణంలో పరమేశ్వరుడు ఈ వ్రత మహాత్మ్యాన్ని పార్వతీదేవికి వివరించినట్టు ఉంది. సకల భువనాలలోనూ మహిళలు సకల ఐశ్వర్యాలను, పుత్రపౌత్రాదులను పొందడానికి వీలైన ఓ మహత్తర వ్రతం ఏదైనా సూచించమని జగన్మాత పరమేశ్వరుడిని వేడుకుంటుంది. అప్పుడు వరలక్ష్మి వ్రతం గురించి ఈశ్వరుడు పార్వతికి తెలియపరిచాడు.  ఈ వ్రతాన్ని పార్వతీదేవికూడా ఆచరించింది.

వ్రతం చేసుకునే విధానం
తొలుత పసుపుతో గణపతిని చేసి పూజించి పీఠంపై అమర్చుకోవాలి. అనంతరం కలశం లోనికి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేయాలి. షోడశోపచార పూజ తర్వాత అథాంగ పూజ చేయవలెను. అష్టోత్తర శతనామ పూజతో నామాలను చదివి, ధూప దీప నైవేద్యాలను, తాంబూలాలను సమర్పించుకోవాలి. పూజ ముగింపునకు సూచనగా కర్పూరంతో మంగళ హారతి ఇవ్వాలి. తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడిచేతికి కట్టుకోవాలి. అమ్మవారికి నైవేద్యంగా నవకాయ పిండివంటలూ, మధుర ఫలాలు సమర్పించాలి. చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ముత్తయిదువలను వరలక్ష్మీ స్వరూపంగా భావించి చందన తాంబూలాలతో వాయనాలు ఇవ్వాలి.

వరలక్ష్మి వ్రతకథ
పూర్వం మగధ దేశంలోని కుండినం అనే పట్టణంలో చారుమతి అనే మహాసాధ్వి అయిన బ్రాహ్మణ స్త్రీ వుండేది. ఆమె సత్ప్రవర్తన కలిగి, వినయ విధేయతలతో భర్తను, అత్తమామలను సేవిస్తూ జీవిస్తూండేది. ఆమె వినయ విధేయతలకు మెచ్చిమహాలక్ష్మిదేవి ఆమెకు స్వప్నంలో సాక్షాత్కరించి, వరలక్ష్మివ్రతం ఉపదేశించి, శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతం ఆచరిస్తే సకల సౌభాగ్యాలు చెకూరుతాయని చెపుతుంది. ఆ ప్రకారం చారుమతి శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మివ్రతం ఆచరించి సకల శుభాలు , సౌభాగ్యాలు పొందుతుంది .

ఈ విధంగా వరలక్ష్మివ్రతం కథ చెప్పుకుంటూ తొమ్మిది దారల నూలు దారాలను పువ్వులతో తొమ్మిది ముడులు వేస్తూ ‘ తారం ‘ తయారుచేసుకొని , కుంకుమబొట్టు పెట్టుకుని, చేతిలో కొబ్బరిచిప్ప కట్టుకుని ముత్తయిదువ చేత తారం కట్టించుకోవాలి. ఆ తరువాత దేవికి హారతి ఇచ్చి, పిండి వంటలను బ్రాహ్మణనీకు దానం ఇచ్చి ఉద్యాపనం చేయాలి.

సాయంత్రం ఇరుగు పొరుగు ముత్తయిదువులను పేరంటానికి పిలిచి కాళ్ళకు పసుపు రాసి, నుదుట కుంకుమ పెట్టి, నానబోసిన సెనగలతో బాటు తాంబూలం ఇచ్చి అక్షింతలు ఇచ్చి నమస్కరించి ఆశీర్వాదం పొందాలి. వచ్చిన పేరంటాలు…అమ్మవారి మీద పాటలు పాడి హారతులు ఇచ్చి అక్షింతలు వేసి పూజించాలి. ఈ విధంగా చేసినవారికి సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు.

వ్రత విశిష్టత
అష్ట లక్ష్మీ రూపాల్లోనూ వరలక్ష్మికి ప్రత్యేక స్థానం ఉంది. విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట ఈ మాసాన్ని శ్రావణ మాసం అంటారు. అందువల్ల ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది. మిగిలిన రోజులలో చేసే లక్ష్మీ పూజలకంటే శ్రావణ మాసంలో చేసే వరలక్ష్మీ వ్రతానికి అధిక ఫలం ప్రాప్తిస్తుందని నమ్మిక. సర్వమంగళ ప్రాప్తి, సకల అభీష్టప్రాప్తి సిద్ధిస్తాయి. నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. ఉత్తరాదిన, దక్షిణాదిన ఇతర పూజలు, వ్రతాలు వేర్వేరు విధాలుగా చేసినా, వరలక్ష్మీ వ్రతం మాత్రం ఒకే రీతిలో చేసుకోవడం విశేషం