వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో చెప్పేసే యాప్

రైల్వే టికెట్ల కోసం ఆఖరు క్షణాల్లో ప్రయత్నించిన ఎవరికైనా.. బెర్త్ లేదా సీటు కన్ఫర్మ్ అయిన టికెట్లు దొరకడం దాదాపు అసాధ్యం. తత్కాల్ ద్వారా మాత్రమే.. అది కూడా ప్రయాణానికి ఒకరోజు ముందు మాత్రమే కన్ఫర్మ్ టికెట్లు పొందే వీలుంది. 

కాబట్టి ఆఖరు క్షణాల్లో ప్రయాణాలు పెట్టుకున్న వారు అనివార్యంగా వెయిటింగ్ లిస్టు టికెట్లే తీసుకుని.. కన్ఫర్మ్ చేయమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ గడపడం తప్పదు. వెయిటింగ్ టికెట్లు ప్రయాణ సమయానికి కొద్ది గంటల ముందుమాత్రమే కన్ఫర్మ్ అవుతుంటాయి. 

దీంతో.. వెయిటింగ్ టికెట్ తీసుకున్న వారు తమ ప్రయాణం ఏమవుతుందో ఏమోనన్న ఆందోళనతో.. ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తుంటారు. వెయిటింగ్ లిస్ట్ టికెట్ కొనడం లేదా తత్కాల్ లో ప్రయత్నించడం కాకుండా ప్రత్యామ్నాయ రీతులను ఆశ్రయించడం గురించి మీరు ఎలా తెలుసుకుంటారు..?




ఈ డోలాయమానానికి సమాధానమే కన్ఫర్మ్ టికెట్. చారిత్రక విధానాల ద్వారా, రైలు టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలను ఊహిస్తుంది. ఈ అంచనాలు, ప్రయాణికులు వెయిట్ లిస్ట్ టికెట్లు కొనాలా వద్దా..? ప్రయాణం కొనసాగించాలా వద్దా..? అన్నది నిర్ణయించుకునే అవకాశాన్నిస్తాయి. 

శ్రీపాద వైద్య, దినేశ్ కుమార్ కొత్త ల మస్తిష్కం నుంచి ఆవిష్కృతమైందే ఈ కన్ఫమ్ టికెట్ (Confirmtkt). ఇది భారతదేశంలో బుకింగ్ జరిగిన రైలు టికెట్లను సరికొత్తగా నిర్వచిస్తుంది. అంచనాలతో పాటు, రైల్లో అందుబాటులో ఉన్న అన్ని కోటాలను విశ్లేషిస్తూ.. టికెట్ల అందుబాటు గురించి వివరిస్తుంది.

ఇది ఎలా ప్రారంభమైంది..?
శ్రీపాద, దినేష్ లు ఐబిఎంలో పనిచేసేవారు. “మేము సొంతంగా సంస్థను ప్రారంభించాలని ఉవ్విళ్లూరే వాళ్ళం. బెంగళూరులో ప్రతిరోజూ మేము ఆటోలతో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారంగా, 2011లో మీటరప్ (Meterup) యాప్ ని కనుగొన్నాము” అని తమ ప్రస్థానాన్ని వివరించారు శ్రీపాద. 

ప్రయాణికుడి గమ్యస్థానానికి ఎంత ఛార్జ్ అవుతుందో ఈ యాప్ అంచనా వేస్తుంది. దీంతో.. ప్రయాణికుడు ఆటో డ్రైవర్ తో బేరాలు ఆడే వీలుంటుంది. అయితే ఈ ప్రయోగం సఫలం కాలేదు. అప్పుడు ఈ యాప్ ను రైలు ప్రయాణికులకు ఉపయోగ పడేలా అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుంది..? అన్న ఆలోచన వచ్చింది.


“ప్రతిసారీ, మనం టికెట్ల కోసం ప్రయత్నిస్తాము. అయితే వెయిటింగ్ లిస్ట్ లోనే టికెట్లు దొరుకుతాయి. మన టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయో లేదో ఊహించి, ప్రయాణపు తేదీలను సర్దుబాటు చేసుకోవడమో.. లేదా రైలు ప్రయాణం మానేయడమో చేస్తుంటాము. ఈ సమస్యను పరిష్కరించేలా ఒక సాఫ్టువేర్ ను తయారు చేయాలని నిర్ణయించుకున్నాము” - దినేశ్ వివరించారు. 

2012 ఆఖరులో, ఈ మిత్రద్వయం, వెయిటింగ్ లిస్టు జాబితా ఆధారంగా, టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలను విశ్లేషించే, సాఫ్ట్ వేర్ తయారీకి పూనుకున్నారు. “మా ప్రయత్నంలో, చాలా రైళ్ళ వెయిటింగ్ టికెట్ల గురించి మేము కచ్చితమైన అంచనాలకు రాగలిగాము” అని దినేశ్ వివరిస్తారు.

దినేశ్, తంజావూర్ లోని శాస్త్రా యూనివర్శిటీ పూర్వ విద్యార్థి. ఇతను విశ్లేషణల్లో దిట్ట. తరచూ ప్రయాణాలు చేస్తుంటాడు. శ్రీపాద సాంకేతిక రంగంలో దిట్ట. ఇతను జంషెడ్ పూర్ నిట్ నుంచి 2010 లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలను అంచనా వేయడంతో పాటు.. 

ఈ యాప్, టికెట్ ఎప్పుడు కన్ఫర్మ్ స్టేటస్ కు వెళ్లొచ్చో కూడా వివరించగలదు. తమ ఈ-మెయిల్ అడ్రస్ అందించి సభ్యులుగా చేరిన యూజర్స్, టికెట్ PNR నంబర్ ను టైప్ చేస్తే చాలు.. అన్ని వివరాలు ఈమెయిల్ కు వచ్చేస్తాయి.

ఐదు నెలల ఈ సంస్థ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అనూహ్యంగా 43 వేల డౌన్ లోడ్స్ సాధించింది. “ఇప్పటి వరకూ మేము ఐదు లక్షల PNR ఎంక్వైరీలను ప్రాసెస్ చేశాము. అందులో44,90,937 ఎంక్వైరీలు రైళ్ళ గురించే కావడం విశేషం” అంటారు దినేశ్. 

వెబ్ ట్రాఫిక్ కి సంబంధించినంత వరకూ.. ఆండ్రాయిడ్ అప్లికేషన్ 65% యూజర్స్ లో.. 60% రిటర్న్ రేట్ ఉండడం ఇందులో అత్యంత కీలకాంశం. ఈ ConfirmTKT యాప్, మామూలుగా మనుషులు ఆలోచించే తీరుకి అతి సమీపంగా ఉంటుంది. 

“మనుషులు ఊహించి.. లేదా గతానుభవాల ఆధారంగా చేసుకొని, దానికి అనుగుణంగా భవిష్యత్తును రూపొందించుకుంటారు. అదే విధంగా, ConfirmTKT కూడా గత టికెట్ల జాబితా తీరును విశ్లేషిస్తూ.. టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాన్ని వెల్లడిస్తుంది” అని శ్రీపాద వెల్లడించారు. డాటాను ఆధారంగా చేసుకొని, ప్రతి రైలు యొక్క కన్ఫర్మ్ అయ్యే టికెట్ల జాబితాను రూపొందించి, ప్రయాణికుడి టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందో లేదో వెల్లడిస్తుంది. 

టికెట్ తరగతి, గత టికెట్ల ట్రెండ్స్, ప్రయాణపు మాసము తదితర వివరాలపై దీని విశ్లేషణ ఆధారపడి ఉంటుంది. టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉన్నా కూడా.. తన విశ్లేషణ ద్వారా, ఏ కోచ్ లో టికెల్ అందుబాటులో ఉందో.. ConfirmTKT విశ్లేషిస్తుంది.