బంగారాన్ని దాచుకోవడానికి భయపడేవారికి బంపర్‌ ఆఫర్‌.

సుమారు 50 లక్షల కోట్ల విలువైన బంగారం మన దేశ ప్రజల వద్ద భద్రంగా వుందన్నది ఓ అంచనా. అమ్మో, అంత విలువైన బంగారం మన దేశంలో వుంటే, భారతదేశం నిజంగానే ఎంతో 'గొప్ప' దేశం అయిపోయి వుండాలి కదా.? అన్న డౌట్‌ మీకొస్తే, అది మీ తప్పు కానే కాదు. ఎందుకంటే బంగారం జనం దగ్గర వుండటం వేరు, దానికి లెక్కలుండడం వేరు.  ఆ లెక్కలు తేల్చడానికే ఇప్పుడు కేంద్రం సమాయత్తమవుతోంది. బంగారం మీద బాండ్లు ఇస్తామనీ, దాంతోపాటుగా వడ్డీ కూడా ఇస్తామని కేంద్రం చెబుతోంది. మీ వద్ద అవసరానికి మించి బంగారం బీరువాల్లో మగ్గుతోంటే, దాన్ని కాస్తా బ్యాంకులకు సమర్పిస్తే, బ్యాంకులు మీకు నెల నెలా వడ్డీని కూడా ఇస్తాయి.. అలా కేంద్రం కొన్ని విధి విధానాల్ని రూపొందించి జనం ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యింది.  


పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు అవసరం కోసం చేయించుకున్నా, తీరా వాటిని దాచుకోవాలంటే చాలా కష్టమని బాధపడ్తుంటారు కొందరు. చేసేది లేక బ్యాంకుల్లో తాకట్టు పెట్టి, దానికి నెల నెలా వడ్డీ కడుతూ వుంటారు. ఆ తిప్పలనుంచి ఉపశమనం లభించడమే కాదు, బ్యాంకుల్లో మగ్గుతోన్న బంగారం ఇకపై నెలనెలా వడ్డీ కూడా తీసుకొస్తుందంటే ఎవరికైనా ఆనందమే కదా.!  


అయితే ఇక్కడే ఓ పితలాటకం వుంది. అదేంటంటే, మీరు బ్యాంకుల్లో డిపాజిట్‌ చెయ్యాలనుకుంటున్న బంగారం బీఐఎస్‌ హాల్‌మార్క్‌ గుర్తింపు వుండాలి. నాణ్యత విషయంలో బ్యాంకులు రాజీపడే ప్రసక్తే లేదు. అంతే కాదు, ఆ బంగారం ఎలా సంక్రమించింది.? అనేదానిపై కూడా స్పష్టత ఇవ్వాలి. 'కెవైసీ' ఫామ్‌ కూడా సమర్పించాలట. ఇంకేవో కొన్ని నిబంధనలు కూడా వున్నాయట. అద్గదీ అసలు విషయం.  ఈ దెబ్బతో అక్రమంగా దాచిన బంగారం బ్యాంకులకు చేరుతుందనీ, తద్వారా దేశంలోని మొత్తం బంగారానికి కాకపోయినా, చాలావరకు బంగారానికి లెక్కలు దొరుకుతాయనీ పాలకులు భలే తెలివిగా ప్లాన్‌ చేశారు కదూ.! పాలకుల ప్లాన్‌ సంగతి పక్కన పెడితే, బంగారాన్ని దాచుకోవడానికి భయపడేవారికి మాత్రం ఇదో బంపర్‌ ఆఫర్‌.