రానని.. రాలేనని..ఊరకే అంటావు.జగన్.. రావాలని ఆశలేనిదే ఎందుకు అంటావు?

nannu pilavaddu pilichina nenu raanu

''నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి నన్ను పిలవొద్దు. ఒకవేళ పిలిచినా నేను రాను'' అని విపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ తేల్చిచెప్పారు. 

దీనిపై గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక బహిరంగ లేఖ రాశారు. '' నాకు ఏ ఆహ్వానాలూ పంపవద్దు. మీరు ఆహ్వానం ఇచ్చినా జగన్‌ రాలేదు అని, ఆ తర్వాత నామీద ఒక బండ విసరవద్దు. మీరూ, మీ ఆదేశాల మేరకు మీ అరడజను మంది మంత్రులు చేయబోయేది ఇదే అని ఈ పాటికే నాకు, రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలిసింది'' అంటూ తన లేఖను ప్రారంభించారు. శంకుస్థాపనకు రాకపోవడానికి ఆయన 8కారణాలను పేర్కొన్నారు. లేఖలోని అంశాలు... 

1. ప్రజలకు ఇష్టం లేకపోయినా అధికారాన్ని ఉపయోగించి రైతుల భూములు లాక్కొని, వారి ఉసురు మీద రాజధాని కడుతున్నారు. రైతుల మెడమీద కత్తిపెట్టి లాక్కున్న వైఖరికి వ్యతిరేకంగా శంకుస్థాపనకు రాదలచుకోలేదు. 

2. రాజధాని ప్రాంతంలో సెక్షన్‌ 30, సెక్షన్‌ 144 ఏడాదిగా ఎందుకు అమలు చేస్తున్నారు? 

3.. గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తీర్పును బేఖాతరు చేస్తూ కోర్టును, ప్రజల మనోభావాలను రెండింటినీ లెక్క చేయని వైఖరికి నిరసనగా శంకుస్థాపనకు రాదలచుకోలేదు.

4.. అసైన్డ్‌ భూములు, పేదల భూములు అంటే మీకు చులకన స్వభావం. మీ ఇష్టం వచ్చినట్లు ఆక్రమించుకునే మీ మనస్తత్వానికి నిరసనగా శంకుస్థాపనకు రాదలచుకోలేదు. 

5.. మీ కమీషన్ల కోసం, మీ లంచాల కోసం, మీరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ ప్రజల కడుపు కొడుతున్నారు. మీకు నచ్చిన ప్రైవేటు, విదేశీ సింగపూర్‌ కంపెనీలకు మీ ఇష్టం వచ్చినట్టు భూములు ఇస్తున్న మీ వైఖరికి నిరసనగా నేను రాదలచుకోలేదు. 

6.. విభజన చట్టం ప్రకారం మనకు ఇవ్వాల్సినవన్నీ నెరవేరుస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పుడు... రాజధాని నిర్మాణానికి ప్రైవేటు సింగపూర్‌ కంపెనీలతో లేదా ప్రైవేటు విదేశీ కంపెనీలతో ఏం పని? రాజధానిలో ఉండాల్సిన హైకోర్టు, సెక్రటేరియేట్‌, అసెంబ్లీ, ప్రభుత్వ కార్యాలయాలను అక్కడే ఉన్న ప్రభుత్వ భూముల్లో కట్టుకొని, రోడ్లు వేసి, జోనింగ్‌ చేయవచ్చు. రియల్‌ ఎస్టేట్‌ చేసుకుంటారో.. భూములు వారి వద్దే అట్టిపెట్టుకుంటారోనన్నది ప్రజల ఇష్టానికి వదిలేయకుండా.. మీ సొంత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం పేద ప్రజల భూములను లాక్కోవడానికి నిరసనగా మేం కార్యక్రమానికి రాదలచుకోలేదు. 

7.. మీ వాళ్లను బినామీలుగా పెట్టుకొని రాజధాని ప్రాంతంలో వందల ఎకరాలు కొనుగోలు చేయించారు. వారి భూములు వదిలేసి పేదల భూములను లాక్కున్నారు. ఈ వైఖరికి నిరసనగా మేం రాదలచుకోలేదు. 

8.. ఒక్క రోజు తతంగానికి ప్రజల డబ్బు దాదాపు రూ.400 కోట్లు బూడిదపాలు చేస్తున్నారు. ''చివరిగా ఒక్క మాట. రాజధాని నిర్మాణానికి మేం వ్యతిరేకంగా కాదు. ఇది రైతుల కడుపు కొట్టడానికి మీరు చేస్తున్న శంకుస్థాపన. అందువల్లే, ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తున్నాం' అని పేర్కొన్నారు.