పెళ్ళిలో అక్షింతలు ఎందుకు చల్లుతారు ?




అక్షతల పరమార్థం ఏమిటి?


Special Article on akshitalu meaning and significance, Akshintalu Wedding ceremony, navagraha, human body


వివాహ శుభకార్యంలో జీలకర్ర, బెల్లం పెట్టే వేళ, మాంగల్యధారణ వేళ, వధూవరులపై ఆహుతులు అక్షతలు చల్లి ఆశీర్వదించడం మన హిందూ సంప్రదాయం. వివాహ శుభకార్యాల్లోనే కాదు, ప్రతి శుభకార్యంలోనూ పెద్దలు, పిన్నలకు అక్షతలు వేసి ‘దీర్ఘాయుష్మాన్‌ భవ, చిరంజీవి భవ, సంతాన ప్రాప్తిరస్తు, ఆరోగ్య ప్రాప్తిరస్తు, సుఖజీవన ప్రాప్తిరస్తు’ అంటూ ఆశీర్వదిస్తారు. ఇక దైవసన్నిధిలో సరే సరి, పూజారైతే మంత్రాక్షతలతో అందరినీ దీవిస్తారు. ‘అక్షతలు’ అనే మాట నుంచి వచ్చిందే ‘అక్షింతలు’. క్షతం కానివి అక్షతలు. అంటే రోకలి పోటుకు విరగని, శ్రేష్ఠమైన బియ్యం అన్నమాట. అలాంటి బియ్యాన్ని పసుపు లేక కుంకుమతో, నేతితో కలిపి అక్షతలు తయారు చేస్తారు. నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని దానవస్తువుగా పేర్కొంటారు. ఆ రకంగా నవగ్రహాలలో చంద్రుడికి ప్రీతి కరమైన దానవస్తువు బియ్యం. జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధినాయకుడు. మనిషి మనసు, బుద్ధి, గుణము, తల్లి, వ్యసనము ఇత్యాదులన్నీ చంద్ర కారకాలే అని అన్నారు పెద్దలు. అందుకే మనిషిపై చంద్రుడి ప్రభావం ఎక్కు వగా ఉంటుంది. ఆ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మన స్సుపై ప్రభావం చూపుతుంది. మనోధర్మాన్ని నియంత్రిస్తాయి. 

Special Article on akshitalu meaning and significance, Akshintalu Wedding ceremony, navagraha, human body



శాస్ర్తీయంగా చూస్తే, మనిషి దేహం ఓ విద్యుత్‌ కేంద్రం. విద్యుత్‌ సరఫరాల్లో హెచ్చుతగ్గులు సాధారణం. ఈ వ్యత్యాసాలు మనిషి మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. మనుషుల్లో తమో, రజో, సాత్త్యికాలనే త్రిగుణాలకూ కారకము. పెద్దలు వధూవరులపై అక్షతలు చల్లి ఆశీర్వదించే సమయంలో, దేహంలోని విద్యుత్తులో కొంత బాగం ఈ అక్షతలను తాకుతాయి. ఆశీస్సులు ఇచ్చే వాళ్ల నుంచి, పుచ్చుకొనే వాళ్లకి కొంత విద్యుత్‌ బదిలీ అవుతుంది. ఈ కారణంగా అక్షతల ద్వారా పెద్దలలో ఉండే సాత్విక గుణం పిన్నలకు లభిస్తుందనేది మన నమ్మకం. పెద్దలు, విద్వాంసులు, గురువులు, తల్లిదండ్రులు, అత్తమామలు వివాహ సమయంలో, శుభకార్యాలలో మనకు అక్షతలు వేసి శిరస్సును తాకి ఆశీర్వదించడంలోని ఆంతర్యం, పర మార్థం ఇదే!

Special Article on akshitalu meaning and significance, Akshintalu Wedding ceremony, navagraha, human body



మరో సిద్ధాంతం ప్రకారం చూస్తే మనిషి దేహంలో విద్యుత్‌ కేంద్రాలు ఇరవై నాలుగు ఉంటాయట. వాటిలో ప్రధానమైనది శిరస్సు. ఇది విద్యుదుత్పత్తి కేంద్రమే కాదు. విద్యుత్‌ ప్రసార కేంద్రం కూడా. తలపై అక్షింతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్‌ను గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుంది శిరస్సు. అక్షతలుగా ఉపయోగించే బియ్యానికి పసుపు కుంకుమలు కలపడం ఎందుకు? ఆయుర్వేదం ప్రకారం, చర్మ సంబంధ రోగాల్ని అడ్డుకునే శక్తి పసుపుకు ఉంది. పసుపు నుంచి తయారయ్యే కుంకుమకూ ఈ శక్తి ఉంది. అక్షతలు వేసే వారికి ఎలాంటి రోగ సమస్యలున్నా, పుచ్చు కొనే వాళ్ళకి అవి సోకకుండా ఈ పసుపు కుంకుమలు నివారిస్తాయట. అంతేకాక పసుపు కుంకుమలు శుభానికి సంకేతాలు కూడా. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్యం.

భగవద్గీతలో

‘అన్నాద్భవన్తి భూతాని’ అని మూడవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. జీవులు అన్నం చేత పుడతారట. ఈ అన్నం తయారీకి మనం ఉపయోగించే ధాన్యం బియ్యం. భగవంతునిపై అక్షతలు వేసి నమస్కరించడం అంటే, జీవుడు ఈ అన్నంలో పుట్టీ, తిరగి ఈ జీవుడిని భగవంతుడిలోకి చేర్చడమే. అక్షతలలో ఇంతటి పరమార్థం గోచరిస్తుంది.
తెలుగులో ఈ అక్షతలని తలంబ్రాలు లేదా తలబ్రాలు అని కూడా అంటారు.

తలను = తల యందు పోయబడే, ప్రాలు = బియ్యం అని అర్థం.

Special Article on akshitalu meaning and significance, Akshintalu Wedding ceremony, navagraha, human body



పూర్వం వధువు ధాన్యలక్ష్మిగా చెప్పబడింది. ఈ తలంబ్రాల కార్యక్రమంలో బియ్యానికి ఒక ప్రత్యేకత ఉంది. ‘ఓ వధువా! నీవు మా ఇంటికి వచ్చాక, మన ఇంట ధాన్యం ఇలా కుప్పతెప్పలుగా విరివిగా ఉండి, మన జీవనానికి’ ఆధారభూతమైన ధాన్యంతో మనం నిత్య సంపదల వాళ్ళమై తులతూగుతూ ఉండాలి’ అనే భావానికి అనుగుణంగా ఈ తలంబ్రాల కార్యక్రమం సాగుతుంది. వరుడు, వధువు శిరస్సులపై తలంబ్రాలు పోసుకొనే దానికి ముందు, వరుడు ముందుగా వధువు చేతిని దర్భతో తుడిచి, దోసిలిలో రెండు మార్లుగా బియ్యాన్ని వేసి, ఆ మీదట పాలని కొద్దిగా చల్లి తలంబ్రాలకి సిద్ధం చేస్తాడు. తలంబ్రాలు వేసాక వధువు ఇలా చెయ్యాలని ఒక పద్ధతి చెప్తుంది. ఈ కాలంలో పురోహితులే చేయించి పోయిస్తున్నారు. ‘ఈ కన్య వంశాన్ని తరింపజేయుగాక పుణ్యం వృద్ధి చెందుగాక. శాంతి, పుష్టి, సంతోషం, అభివృద్ధి, విఘ్నాలు లేకపోవడం, ఆయురారోగ్యాలు అన్నీ వీరికి కల్గుగాక!’ అని చదువుతూ అక్షతారోపణం (తలంబ్రాలు పోయించడం) చేయిస్తారు. ఈ చేసిన వివాహకర్మ మొత్తం అక్షతము (నాశనము లేనిది) అగుగాక! అని దీని భావం.

Special Article on akshitalu meaning and significance, Akshintalu Wedding ceremony, navagraha, human body




అక్షతలలో, తలంబ్రాలలో ఇంతటి పరమార్థం గోచరిస్తుంది. మన పూర్వీకులు ఈ వివాహ శుభకార్యాలలో, ఇతర శుభకార్యాలలో ఏర్పాటు చేసిన సంప్రదాయాల్లో, ఆచారాల్లో ఇంత గూఢార్థం ఉంది. వివాహ సమయంలో నవదంపతులు కలిసి జీవించి ఉండాలనీ, ఆదర్శ దంపతులుగా మెలగాలనీ, వధూవరులపై ఆహుతులు అక్షంతలు చల్లి ఆశీర్వదించడమే అక్షతల కార్యక్రమంలోని అర్థం, పరమార్థం. దాన్ని తెలుసుకుని అందుకు అనుగుణంగా మెలగాలి.