పరిశ్రమ పెట్టాలి అనుకుంటే .. ..!





ప్రస్తుతం యువతీ యువకులు స్వయం ఉపాధి దిశగా అడుగులేస్తున్నారు. బాగా చదువుకున్న తర్వాత కొందరు నచ్చిన ఉద్యోగం చేయడం లేదా వ్యాపారం చేసేందుకు సిద్ధపడుతుంటారు.


 ఇలా వ్యాపారం చేయాలనుకుంటే అభిరుచికి తగ్గట్టు వ్యాపారం చేయడం ప్రారంభించాలి. వ్యాపారం చేసే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. 

మీరు ప్రారంభించే వ్యాపారం ఏదైనా కావచ్చు. ఆ వ్యాపారంలో మీరు పెట్టుబడి పెట్టిన యజమాని కావచ్చు. కాని మీరు కూడా ఓ సేల్స్‌మెన్(సేవకులు) అని మాత్రం మర్చిపోకండి. 

వ్యాపారం ప్రారంభించిన వెంటనే లాభాలు మన కంట పడవు. మీరు చేయాలనుకున్న వ్యాపారంలో ఎంతమంది పోటీ వున్నారో ఓ లిస్టు తయారు చేసుకోండి. 


అలాగే ఎలాంటి ప్రాంతంలో వ్యాపారం ప్రారంభిస్తే క్లిక్ అవుతారో నిర్ణయించుకోవాల్సింది కూడా మీరే. ప్రతి నిర్ణయాన్ని మీరే స్వయంగా తీసుకోవాలి. నిర్ణయాలు తీసుకునే సమయంలో మీకు మీరే ప్రేరణ అని గుర్తుంచుకోండి. 

మీరు ప్రారంభించబోయే వ్యాపారం నిరంతరం ప్రజలకు ఉపయోగపడేదిగా ఉండాలి. నిత్యం వ్యాపారం జరిగేదిగా ఉండాలి. 


ఉదాహరణకు పచారీ కొట్టు, నిత్యావసర సరుకుల వ్యాపారం, కూరగాయల వ్యాపారం, మెడికల్ షాప్ ఏదైనా కావచ్చు. అది మీ ఆలోచనలకు తగ్గట్టుగా ఉంటుందా అనేది ఆలోచించండి. 

ఒకసారి ప్రారంభించిన వ్యాపారం మళ్ళీ మళ్ళీ ప్రారంభించేందుకు అవకాశాలు ఉండవు. అలాగే నచ్చని ఉద్యోగం వదిలేసి, మరో ఉద్యోగం కోసం వేటాడేది కాదు వ్యాపారమంటే. 


మీరు ప్రారంభించిన వ్యాపారం మీకు నచ్చకపోతే లేక వ్యాపారం సరిగా జరగలేదనో దుకాణం ఎత్తేస్తే నష్టం మీకే. పెట్టుబడి పెట్టి దుకాణం, కంపెనీ లేక మరేదైనా కావచ్చు, దానిని మూసేస్తే నష్టపోయేది మీరేనని గుర్తు పెట్టుకోండి. 

మీరు వ్యాపారం చేసే ముందు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయనే భ్రమలో నుంచి బయట పడేందుకు కృషి చేయండి. భ్రమలో ఉంటే వ్యాపారం చేయలేము. 


మీరు అమలు చేసే ప్రతి ఆలోచనా లాభాలు తెచ్చిపెడతాయనుకుంటే పొరబాటే. వ్యాపారంలో ఒడిదుడుకులు సహజం. జయాపజయాలకు సిద్ధపడాలి. నిస్పృహ చెందకుండా మళ్ళీ, మళ్ళీ ప్రయత్నిస్తుండాలి. 

వ్యాపారం చేసేటప్పుడు ప్రధానమైన సమస్య డబ్బు. వ్యాపారంలో ఆర్థిక పరమైన సమస్యలు తలెత్తుతుంటాయి. వ్యాపారం ఉందికదా అని అప్పులు చేస్తే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.


 ఇలాంటి సమస్యలను అధిగమించగలిగేందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నాకే వ్యాపారం చేసేందుకు సిద్ధపడండి. అప్పు చేసి వ్యాపారం చేయకండి. మీదంటూ డబ్బు ఉన్నప్పుడే దాని విలువు తెలుస్తుంది. అలాగే ఎవరో అప్పు ఇస్తామన్నారని వ్యాపారం ప్రారంభించకండి. 

అలాగే వ్యాపారం ప్రారంభించే ముందు మీరు ప్రారంభించాలనుకున్న వ్యాపారమేంటో, దానికి కావలసిన సరుకులు, వస్తువులు, తదితర వస్తువులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో వ్యాపారస్థులను అడిగి తెలుసుకోండి. అందులో వచ్చే లాభనష్టాల గురించి వారితో ప్రస్తావించండి. ఓ అవగాహనకు వచ్చిన తర్వాతనే వ్యాపారం ప్రారంభించండి

ఆలోచించండి  అభివృద్ధి చెందుదాం రండి -