చాలామంది తమ సంపాదనలో కొంత మొత్తాన్ని అత్యవసరాల నిమిత్తం దాచుకుంటూ ఉంటారు.
కాని అనేక సందర్భాలలో ఇలా దాచుకున్న మొత్తాలను ఇతర ఖర్చుల కోసం వాడుతుంటారు.
జీతం రాగానే నెలవారీ ఖర్చులు లెక్క చూసుకున్నప్పుడు ఎంతో కొంత మిగులు
కనిపిస్తుంటుంది. కానీ, నెల పూర్తి కాకుండానే జీతమంతా ఖర్చయిపోతుంది. ఎలా
ఖర్చయిందో అర్థం కాదు. మిగులుతుందనుకున్న సొమ్మును ఎందుకోసం ఖర్చు చేశామో
తెలియదు. ఇలాంటి సందర్భాల్లో డబ్బు దాచుకోవడం అసాధ్యమైన విషయంగా కనిపిస్తుంది.
కానీ, కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రతి ఖర్చునూ నెలవారీ ఖర్చుల్లో భాగం
చేసుకుంటూ, మిగిలిన మొత్తాన్ని దాచుకుంటూ ఉంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా
హాయిగా |
జీవనం సాగించవచ్చు.
|
జమ, ఖర్చులు రాయాలి |
జీతం
అందుకున్న తరువాత బ్యాంకులో జమ చేసినా, విత్‌డ్రా చేసినా ఒక పుస్తకంలో
రాసుకోవాలి. బ్యాంకు ఇచ్చిన పాస్‌బుక్‌లో వివరాలు ఎలాగూ ఉంటాయి కదా, మళ్లీ మనం
ప్రత్యేకించి రాసుకోవడమెందుకనే ప్రశ్న ఉద్భవిస్తుంది. అంతేకాదు, వినడానికి ఇది
కొంత హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ ప్రతిసారీ ఇలా రాసుకుంటూ వెళితే అది ఒక
అలవాటుగా మారుతుంది. రెండు మూడు నెలల తరువాత ఎంత మొత్తం జమ చేస్తున్నాం, ఎంత
విత్‌డ్రా చేస్తున్నాం, ఎందుకోసం ఖర్చు చేస్తున్నాం, ఆ ఖర్చు అవసరమా అనే పలు
విషయాలు తెలుస్తాయి. అలాగే నెల చివరలో ఎంత మొత్తం మిగిలిందనే విషయం కూడా
తెలుస్తుంది.
|
అత్యవసరాలు |
అనేక
కారణాల వల్ల మనం డబ్బు దాచుకోలేక అత్యవసర సమయాల్లో ఇబ్బందులు పడుతుంటాము. అందుకే
అత్యవసరాల కోసం కొంత మొత్తాన్ని తప్పనిసరిగా దాచుకోవడం అలవాటు చేసుకోవాలి. అయితే
ఎంత మొత్తం దాచుకోవాలనేది నిర్ణయించడం కొంత కష్టమే. దీనికోసం ఒక చిన్న సూచన
పాటిస్తే సరిపోతుంది. నెలవారీగా అన్ని అవసరాలకు ఎంత మొత్తం ఖర్చు చేస్తున్నామనే
విషయాన్ని గమనించాలి. ఆ మొత్తాన్ని మూడుతో గుణించగా వచ్చిన ఫలితం మనం
దాచుకోవాల్సిన మొత్తమవుతుంది. ఉదాహరణకు నెలవారీ ఖర్చులు ఇరవై వేలు
అవుతున్నాయనుకుందాం. దానిని మూడుతో గుణిస్తే ఫలితం అరవై వేలు అవుతుంది. కనుక ఏ
సమయంలో చూసినా, అరవై వేల రూపాయిలు మన ఖాతాలో నిలువ ఉండాలి. అత్యవసరాల కోసం
దాచుకున్న నిధి నుంచి కాని కొంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తే, మరుసటి నెలలో ఆ
మొత్తాన్ని తిరిగి భర్తీ చేయాలి.
|
అనవసరపు ఖర్చులు వద్దు |
సాధారణంగా
మనందరమూ చాలా డబ్బు సంపాదించి దాచుకోవాలని అనుకుంటూ ఉంటాము. అలా దాచుకున్న
సొమ్మును ఎలా ఖర్చు చేయాలనే విషయంలో ప్రతివారికీ వారివారి అవసరాలు, అభిప్రాయాలు
ఉంటాయి. అయితే ఖర్చులేవీ లేనప్పుడు మన ఖాతాలో ఉన్న డబ్బుతో పాత సెల్‌ఫోన్
స్థానంలో కొత్త ఫోన్ కొనుక్కోవడానికి ఆసక్తి చూపుతాం. లేదా అటువంటి మరొక ఖర్చు
కోసం ఆ మొత్తాన్ని వినియోగించాలనుకుంటాం. ఇది సరైన పద్ధతి కాదు. మనం దాచుకున్న
సొమ్ముతో ఇల్లు లేదా ఫ్లాట్ కొనుక్కోవాలని నిర్ణయించుకున్నప్పుడు మొబైల్
కొనాలనే ఆలోచన మనకు రాదు. మనకు ఎలాంటి అవసరాలు లేవని అనుకుందాం. అన్ని సౌకర్యాలు
ఏర్పాటు చేసుకున్నాం. అటువంటి సమయంలో మన దగ్గర డబ్బు ఉంది. వెంటనే సరదాల కోసం,
షికార్ల కోసం ఖర్చు చేసేస్తాం. లేదా పనికిరాని వాటిలో పెట్టుబడులు పెడతాం. ఇది
సరైన పద్ధతి కాదని తెలిసినప్పటికీ మనం తగిన జాగ్రత్తలు తీసుకోము. ఇలాంటి విషయాల్లో
జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం.
|
రుణాలు తీర్చేయాలి |
ప్రతి
ఒక్కరూ ఏదో ఒక కారణంగా అప్పు చేస్తుంటారు. సాధారణంగా తీసుకునే చేబదుళ్లు
ఎప్పటికప్పుడు తీర్చగలిగినా, కొంచెం పెద్ద మొత్తాల్లో తీసుకునే అప్పులు వెంటనే
తిరిగి చెల్లించడం సాధ్యం కాదు. పిల్లల చదువు కోసం లేదా పెళ్లి కోసం, ఇల్లు
కట్టుకోవడం కోసం, ఫ్లాట్ కొనుక్కోవడం కోసం ... ఏదో ఒక అవసరం నిమిత్తం రుణాలు
తీసుకుంటారు. ఇలాంటి రుణాలను వీలైనంత త్వరగా తీర్చడానికి ప్రయత్నించాలి. పెద్ద
రుణాలను వాయిదాల పద్ధతిలో తీరుస్తూ రావాలి. నెలవారీ ఖర్చుల్లో వీటిని కూడా
చేర్చుకోవాలి.
|
బీమా ప్రాధాన్యం |
ఎవరికి
వారు ముందుగా తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి కొంత మొత్తాన్ని
కేటాయించుకోవాలి. సాధారణంగా ఆఫీసుల్లో యాజమాన్యాలు తమ ఉద్యోగుల జీతాలనుంచి కొంత
మొత్తాన్ని మినహాయించుకుని హెల్త్ ఇన్సూరెన్స్ కోసం వెచ్చిస్తుంటాయి. ఒకవేళ
అటువంటి సదుపాయం కనుక ఆఫీసులో లేకపోతే, ఎవరికి వారు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం
కొంత మొత్తాన్ని కేటాయించుకోవాలి. వివిధ అనారోగ్యాలు, ఆసుపత్రి ఖర్చులు మొదలైనవి
భరించడానికి ఈ ఇన్సూరెన్స్ ఉపకరిస్తుంది. మహిళలు ప్రత్యేకించి గర్భధారణ,
ప్రసూతి మొదలైనవి కూడా ఇన్సూరెన్స్‌లో భాగంగా ఉండేట్లు చూసుకోవాలి. అలాగే
జీవితబీమా చేయడం కూడా అవసరమే.
|
మిగులు ఎంత? |
మీ జీతంలో
మిగులు ఎంత అనేది లెక్క చూసుకోవాలి. నిత్యావసరాల దగ్గరనుంచి, రుణాల వాయిదాలు
కట్టడం, బీమా కోసం ప్రీమియం చెల్లింపు మొదలైనవన్నీ నెలవారీ ఖర్చుల్లో భాగంగా
చేసుకున్న తరువాత ప్రత్యేకమైన ఖర్చులు ఉండవు. అప్పుడు జీతంలో ఎంత మొత్తం
మిగులుతుందనే విషయం స్పష్టమవుతుంది.
|