సాధారణంగా జైళ్ళలో పురుషులకు, స్త్రీలకు ప్రత్యేక బారాక్ లు ఉంటాయి. వారికి కేటాయించిన జైలు గదుల్లో వారిని ఖైదు చేస్తారు. వీరు కాకుండా ఎల్జీబీటీలు ఖైదీలుగా వస్తే ఏం చేస్తారు...? చాలా దేశాలలో ఇదే పెద్ద సమస్య.. కొన్ని దేశాలు అసలు లెస్బియన్స్ లేదా 'గే'లు సంస్కృతినే అనుమతించని దేశాలకు మరీ సమస్య. అయితే కొన్ని దేశాలు వీరి కోసం తమ జైళ్ల శాఖకు చెందిన నియమనిబంధనలే మార్చుకుంటున్నాయి.
బ్రెజిల్ కు చెందిన రియో డి జనీరో రాష్ట్రం కొత్త నియమ నిబంధనలను తీసుకువచ్చింది. చాలా కాలంగా ఎల్జీబీటీలో జైళ్లలో వివక్షకు గురవుతున్నారని, మరోవైపు అత్యాచారాలకు గురవుతున్నారని, ఇలా కేసులు చాలా ఉన్నాయని ఓ స్వచ్ఛంధ సంస్థ తెలిపింది. 2001 నుంచి జైళ్ల శాఖలో మార్పులు తీసుకురావాలని కోరుతూనే ఉన్నారు. ఇన్నాళ్ళకు బ్రెజిల్ లోని రాష్ట్ర ప్రభుత్వం మార్పులు తీసుకువచ్చింది.
లింగమార్పిడి(ట్రాన్స్జ్ జెండర్స్ ) చేసుకున్నవారు వారి ఇష్టానుసారం పురుషులు లేదా మహిళలు ఉండే గదులను ఎంచుకోవచ్చు. ఇంతకాలం వారిని పురుషులకు కేటాయించిన గదులలో ఉంచడం వలన అత్యాచారాలు జరిగేవనీ, వాటిని నిరోధించడానికి లింగమార్పిడి చేసుకున్నవారి స్థితిని అనుసరించి వారు పురుషులు లేదా మహిళల బారాక్ లను ఎంచుకునే అవకాశం కలిగించింది.
వారి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రియో డి జనీరో రాష్ట్ర జైళ్ళ శాఖ కల్నల్ ఎరిర్ రిబైరో తెలిపారు. ఈ కొత్త నియమం వలన జైళ్ళలో మగ్గుతున్న43 వేల మందిలో 700 మంది లబ్ధి పొందుతారని అంచనా.