గుంటూరులో పుట్టి అక్కడినుంచి చేతులు మారి ఆంగ్లేయుల వశమైన ఈ వజ్రానికి
పరిచయం అక్కర్లేదు. వందల ఏళ్లుగా మనకు దూరమైన ఈ అతిపెద్ద వజ్రం.. ఇప్పుడు మళ్లీ మన
దేశానికి చేరుతుందా?
భారత ప్రధాని నరేంద్రమోదీ నవంబర్ నెలలో బ్రిటన్ లో పర్యటిస్తున్న
నేపథ్యంలో దీన్ని భారత్ కు తిరిగి ఇవ్వాల్సిందేనన్న వాదనలు క్రమంగా ఊపందుకుంటున్నాయి.
మొన్నామధ్య కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆక్స్ ఫర్డ్ వెళ్లినప్పుడు.. వలసపాలనలో భారతదేశం
నుంచి దోచుకున్న సంపద మొత్తాన్ని తిరిగి కక్కాల్సిందేనని గట్టిగా చెప్పారు. ఇప్పుడు
ఆయన బాటలోనే.. బ్రిటిష్ ఎంపీ కీత్ వాజ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నూటికి నూరుపాళ్లూ
కోహినూర్ వజ్రం భారత్ కే చెందాలని, ప్రధాని నరేంద్రమోదీ చేతికి దానిని అందించాలని డిమాండ్
చేశారు.
ఆ మేరకు మంగళవారం బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ ను అభ్యర్థించారు. బ్రిటన్
లో ఎంపీగా అత్యధిక కాలం కొనసాగుతున్న ఆసియావాసిగా రికార్డులకెక్కిన కీత్ వాజ్ వ్యాఖ్యలతో
కోహినూర్ వజ్రాం మరోసారి చర్చనీయాంశమైంది. ఇదీ కోహినూర్ ప్రస్థానం.. గుంటూరు జిల్లాలోని
కొల్లూరు గనులులో ఈ ప్రఖ్యాత వజ్రం లభించింది. మాల్వా రాజు మహలక్ దేవ్ దీని తొలి యజమానిగా కొందరు చరిత్రకారులు
భావిస్తారు. తర్వాతికాలంలో కాకతీయుల సామ్రాజ్యానికి చేరింది. క్రీస్తు శకం 1310లో కాకతీయ
చక్రవర్తి ప్రతాపరుద్రుడు.. ఢిల్లీ సుల్తాన్ తో సంధి చేసుకున్న సమయంలో అపార సంపదతో
పాటు కోహినూర్ వజ్రాన్ని కూడా సమర్పించుకున్నాడు.
1526లో ఈ వజ్రం మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు
బాబర్ వశం అయి.. బాబర్ వజ్రంగా పేరు పొందింది. మొఘల్ సామ్రాజ్యం ప్రాభవాన్ని కోల్పోతున్న
సమయంలో నాదిర్ షా దీన్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు. అది నెరవేరలేదు గానీ దానిని చూసే
భాగ్యం మాత్రమే ఆయనకు దక్కింది. నిజానికి కోహినూర్ కు ఆ పేరు (కోహ్-ఇ-నూర్ అంటే కాంతి
శిఖరం) పెట్టింది కూడా నాదిర్ షాయే. బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ ద్వారా
1913లో ఈ వజ్రం విక్టోరియా రాణికి బహుమతిగా వెళ్లింది. అప్పటి నుంచి లండన్ లోనే ఉండిపోయిన
కోహినూర్ ప్రస్తుతం లండన్ లోని ఓ మ్యూజియంలో ఉంది. దాన్ని తిరిగివ్వాల్సిందిగా భారత
ప్రభుత్వం ఇన్నాళ్లూ చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలిచలేదు. ఇప్పటికైనా మన కోహినూర్ మన చెంతకు
చేరాలని ఆశిద్దాం.